అడ్డుకుంటారా? ఓటింగ్ కోరతారా?
పోలవరం ఆర్డినెన్‌సపై కాంగ్రెస్‌కు కేటీఆర్ సవాల్
హైదరాబాద్: పోలవరం ఆర్డినెన్స్‌ను రాజ్యసభలో అడ్డుకుని తెలంగాణ ప్రజలపై మీ చిత్తశుద్ధిని నిరూపించుకుంటారా.. అని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ మంత్రి కె.తారక రామారావు కాంగ్రె స్‌ను సవాల్ చేశారు. ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు కె.రాజయ్య యాదవ్‌తో కలిసి తెలంగాణభవన్‌లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మంద బలం ఉందనే అహంకారంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా నిర్ణయాలు చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన నిర్ణయాన్ని మాత్రమే అమలు చేస్తున్నామంటూ బీజేపీ నేతలు చేస్తున్న వాదనల్లో అర్థం లేదన్నారు. వాటినే అమలు చేయాలనుకుంటే.. ఇక కొత్త ప్రభుత్వం, కొత్తగా ప్రధానమంత్రి ఎందుకని కేటీఆర్ ప్రశ్నించారు. లోక్‌సభలో మందబలం ఉన్నా రాజ్యసభలో బీజేపీ బలం తక్కువగా ఉందన్నారు. పోలవరం ముంపు గ్రామాలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు. నోటి మాటలతో, వట్టి ప్రకటనలతో కాంగ్రెస్ నేతలు మాట్లాడితే సరిపోదన్నారు.
కాంగ్రెస్‌పార్టీకి చిత్తశుద్ధి ఉంటే పోలవరం ఆర్డినెన్స్‌ను రాజ్యసభలో అడ్డుకోవాలని కేటీఆర్ సవాల్ చేశారు. పోలవరం ఆర్డినెన్స్‌పై రాజ్యసభలో ఓటింగ్ పెడితే ఆగిపోతుందన్నారు. కాంగ్రెస్ తెలంగాణ నేతలు పొన్నాల లక్ష్మయ్య, డి.శ్రీనివాస్, జానారెడ్డికి ఢిల్లీకి వెళ్లి సోనియాగాంధీపై ఒత్తిడి తెచ్చి రాజ్యసభలో ఓటింగ్‌ను కోరాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలు చేవగలిగిన నాయకుల్లాగా వ్యవహరిస్తారా, ఆంధ్రా కాంగ్రెస్ నాయకులకు తొత్తులుగా దాసోహమంటారా? అనేది రాజ్యసభలో వారి వైఖరితో తేలిపోతుందన్నారు.