
డిగ్గీ ‘కూత’.. కేటీఆర్ వాత
⇒ డ్రగ్స్ వ్యవహారంలో టీఆర్‌ఎస్ వారసుడి సన్నిహితులున్నారంటూ దిగ్విజయ్ ట్వీట్
⇒ మీరు విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం వచ్చిందంటూ కేటీఆర్ చురకలు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న డ్రగ్స్ కేసుకు సంబంధించి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్, మంత్రి కె.తారకరామారావు మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. తొలుత డ్రగ్స్ వ్యవహారంలో టీఆర్‌ఎస్ వారసుడి స్నేహితులు ఉన్నారంటూ దిగ్విజయ్ ట్వీటర్‌లో ట్వీట్ చేయగా.. ఇందుకు మంత్రి కేటీఆర్ దీటుగా బదులిచ్చారు. వీరిద్దరి మధ్య గతంలో ఐసిస్ అంశంలోనూ ట్వీటర్ యుద్ధం జరగడం గమనార్హం.
తెలంగాణలో భారీ డ్రగ్ కుంభకోణం బయటపడింది. ఈ వ్యవహారంలో టీఆర్‌ఎస్ వారసుడి సన్నిహితులకు సంబంధం ఉంది. మరి వారిని విచారిస్తారా? రక్షించుకుంటారా..? వేచిచూద్దాం..
– దిగ్విజయ్‌సింగ్
మీరు పూర్తిగా ఓడిపోయారు. ఇక మీరు విశ్రాంతి తీసుకోవాలి. మీ వయసుకు తగిన పనులు చేసుకుంటే బాగుంటుంది.
ఇప్పటికైనా తెలంగాణ పదాన్ని సరిగ్గా రాయగలిగారు.. చాలా సంతోషం.
– మంత్రి కేటీఆర్