కేటీఆర్ సోదరా..వ్యక్తిగత విమర్శలు మానుకో
చేవెళ్ల: 'మా కుటుంబం 30 ఏళ్లుగా నిస్వార్థంగా ప్రజాసేవ చేస్తోంది. మేమేంటో ప్రజలకు తెలుసు. సీబీఐ కేసు వ్యక్తిగతమైనది కాదు. నాపై వచ్చిన అవినీతి ఆరోపణలకు సంబంధించి సాక్ష్యాలేమైనా మీదగ్గర ఉంటే కోర్టులో సమర్పించాలి. అర్థం పర్థంలేకుండా వ్యక్తిగతంగా అసత్య ఆరోపణలుచేస్తే ఊరుకునేదిలేదు..'అని మాజీ హోంమంత్రి పి.సబితారెడ్డి మంత్రి కేటీఆర్‌పై ఫైరయ్యారు.
రంగారెడ్డి జిల్లా పర్యటనలో మంత్రి కేటీఆర్.. మాజీ హోంమంత్రి సబితారెడ్డిపై పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం ఆమె మాట్లాడుతూ ప్రజల పక్షాన ఉండి మీ తప్పులను చూపితే వాటిపై స్పందించకుండా వ్యక్తిగత విమర్శలకు దిగడం ఏమిటని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నాం కదా అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు బ్రదర్.. అంటూ కేటీఆర్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు.
తాటాకు చప్పుళ్లకు భయపడే నాయకులం కాదని సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై పోరాటంలో వెనక్కి తగ్గబోమన్నారు. తెలంగాణ సాధన కోసం టీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఉద్యమం చేయలేదని, ప్రత్యేక రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఇచ్చిన విషయాన్ని మరిచిపోతున్నారని సబితా ఇంద్రారెడ్డి దుయ్యబట్టారు. వ్యక్తిగత ప్రతిష్టకుపోయి మాజీ మంత్రి డాక్టర్ రాజయ్యను బకరాను చేశారని సబితారెడ్డి దుయ్యబట్టారు. రాజయ్య విషయంలో ఏ అవినీతి జరిగిందో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.