
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్నామని ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇతర నగరాలతో పోల్చుకుంటే మౌలిక వసతులు బాగా ఉండటంతో ట్రాఫిక్ సమస్య లేదని తెలిపారు. శనివారం జరిగిన స్పిరిట్ ఆఫ్ తెలంగాణ సమావేశంలో పాల్గొన కేటీఆర్ పలు అంశాలపై మాట్లాడారు. నైపుణ్యమున్న ఐటీ నిపుణులు ఉండటంతో హైదరాబాద్ ఐటీకి అడ్వాంటేజ్ అని పేర్కొన్నారు. బ్యాడ్మింటన్ క్రీడాకారులు సైనా నెహ్వాల్, కశ్యప్‌లు తనను కలిసి వారి వివాహానికి ఆహ్వానించారని కేటీఆర్ తెలిపారు.
సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘దేశంలోని ఇతర పట్టణాలతో పోల్చితే ఐటీ ఫాస్ట్ గ్రోయింగ్ సిటీ హైదరాబాద్. త్వరలో ఐటీ కారిడార్‌లో మొత్తం ఎలక్ట్రానిక్ వాహనాలను ఉపయోగిస్తాం. ఎలివేటెడ్ బస్ ట్రాన్స్‌పోర్టు సిస్టమ్‌ను తెస్తాం. శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు మెట్రోను పొడిగిస్తాం. పొల్యుషన్ లేని హైదరాబాద్‌గా తయారుచేస్తాం. క్రీడలతో పాటు ఐటీ కారిడార్లను విస్తరిస్తాం, యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం. వివిధ రంగాల్లో యువతను ప్రోత్సహిస్తున్నాం. భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలా మా నిర్ణయాలు ఉంటాయి. టీఆర్‌ఎస్ తీసుకువచ్చిన విధానాలతోనే హైదరాబాద్ గ్లోబల్ సిటీగా మారింది. ఈ ఎన్నికల్లో ప్రజలు టిఆర్‌ఎస్‌నే ఎన్నుకుంటార’ని అన్నారు.