రామన్న రాక.. కేకేనా! | KTR Speedup HMDA Works | Sakshi
Sakshi News home page

రామన్న రాక.. కేకేనా!

Published Tue, Sep 24 2019 1:40 PM | Last Updated on Fri, Oct 4 2019 1:01 PM

KTR Speedup HMDA Works - Sakshi

రెండేళ్లయినా.. బాలానగర్‌ ఫ్లైఓవర్‌ పనులను 2017 ఆగస్టు 21న మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. కానీ ఇప్పటికీ ఈ పనులు పూర్తి కాలేదు. ఇంజినీరింగ్‌ పనులైతే కేవలం 25శాతమే కావడం గమనార్హం. మిగతా పూర్తి కావాలంటే మరో ఏడాది పట్టే అవకాశం ఉంది.   

సాక్షి, సిటీబ్యూరో: విశ్వనగరాభివృద్ధిలో కీలకపాత్ర పోషించే హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) చేపట్టిన ప్రాజెక్టులు మూడడుగులు ముందుకు... ఆరడుగులు వెనక్కు అన్న చందంగా మారాయి. ముఖ్యంగా నగరంలో ట్రాఫిక్‌ ఒత్తిడిని తగ్గించేందుకు ప్రారంభించిన బాలానగర్‌ ఫ్లైఓవర్‌ నిర్మాణం, బాటసింగారం, మంగళ్‌పల్లిలోని లాజిస్టిక్‌ హబ్స్‌ పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. అయితే బాటసింగారం లాజిస్టిక్‌ హబ్‌ పనులు 70శాతం పూర్తయ్యాయని ఇంజినీరింగ్‌ అధికారులు చెబుతున్నప్పటికీ ఇంకా కార్యాచరణ మొదలు కాలేదు. ఇక మియాపూర్‌లోని ఇంటర్‌ సిటీ బస్‌ టెర్మినల్‌ (ఐసీబీటీ) పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. చెరువులు కబ్జాకు గురికాకుండా, భూగర్భజలాలు పెంచాలన్న ఉద్దేశంతో రూ.120 కోట్లతో చేపట్టిన చెరువుల సుందరీకరణ పనులకూ ఆటంకాలు తప్పడం లేదు. మరోవైపు హెచ్‌ఎండీఏకు ఆదాయం సమకూర్చే ల్యాండ్‌పూలింగ్‌ (భూసేకరణ)లో అనుకున్నంత వేగం లేదు. పురపాలక శాఖ మంత్రిగా కేటీఆర్‌ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి హెచ్‌ఎండీఏ ప్రాజెక్టులు, వాటి స్థితిగతులు, ఇతర విభాగాల పనితీరుపై మంగళవారం సమీక్షించనున్నారు. ఆయా పనులపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ నేపథ్యంలో హెచ్‌ఎండీఏ ప్రాజెక్టుల స్థితిగతులపై ‘సాక్షి’ ఫోకస్‌...  

నత్తనడకన..
బాలానగర్‌–నర్సాపూర్‌ ఎక్స్‌ రోడ్‌లో ట్రాఫిక్‌ కష్టాలు తీర్చేందుకు హెచ్‌ఎండీఏ రూ.384 కోట్లతో బాలానగర్‌లోని శోభన థియేటర్‌ నుంచి ఐడీపీఎల్‌ వరకు 1.09 కిలోమీటర్ల మేరకు ఆరు లేన్ల ఫ్లైఓవర్‌ నిర్మాణ పనులు చేపట్టింది. 2017 ఆగస్టు 21న మంత్రి కేటీఆర్‌ ఈ పనులకు శంకుస్థాపన చేశారు. అయితే ఫ్లైఓవర్‌ కోసం 8 ఎకరాల 20 గుంటల ప్రాపర్టీలు నింపాదిగా సెటిల్‌ చేశారు. ఇక ఇంజినీరింగ్‌ పనుల విషయానికొస్తే 25 శాతం మేర మాత్రమే జరిగాయి. మిగిలిన 75 శాతం పనులు పూర్తి కావాలంటే మరో ఏడాది సమయం పట్టే అవకాశముందని హెచ్‌ఎండీఏ ఇంజినీరింగ్‌ విభాగ అధికారులు చెబుతున్నారు.   

ఐసీబీటీ ఎక్కడ?  
2011లోనే అంతర్జాతీయ సౌకర్యాలతో మియాపూర్‌లోని 55 ఎకరాల్లో ఇంటర్‌ సిటీ బస్‌ టెర్మినల్‌ (ఐసీబీటీ) నిర్మించాలనుకున్నా భూవివాదంతో పాటు కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యంతో ఏళ్లు గడుస్తున్నా పట్టాలెక్కలేదు. రెండేళ్ల క్రితమే ఈ పనులను దక్కించుకున్న కంపెనీని రద్దు చేసిన హెచ్‌ఎండీఏ తాజా పరిస్థితులపై మళ్లీ అధ్యయనం చేసేందుకు ట్రాన్జక్షన్‌ అడ్వైజరీ కమిటీని నియమించింది. ఇదిచ్చే నివేదిక ఆధారంగానే ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొని ఐసీబీటీ పనులు ప్రారంభించనుంది. ఇందుకయ్యే వ్యయం రూ.100 కోట్లు ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఇది పట్టాలెక్కితే ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్‌ బస్సులు ఇక్కడ నిలపొచ్చు. ఏవైనా వాహనాలను పార్కింగ్‌ చేసుకునేందుకు రెంటల్‌ సర్వీసు కూడా అందుబాటులో ఉంటుంది. ప్రజలకు కావాల్సిన సౌకర్యాలైన ఆరోగ్యం దగ్గరి నుంచి వినోదం వరకు అన్ని వసతులు కల్పించనున్నారు. ప్రయాణికులు విశ్రాంతి తీసుకునేందుకు డార్మిటరీస్, సినిమా థియేటర్‌ను నిర్మించనున్నారు. ఫుడ్‌కోర్ట్స్, సెలూన్స్‌ కూడా ఏర్పాటు చేయనున్నారు. 

సుందరీకరణ అంతంతే...
హెచ్‌ఎండీఏ పరిధిలోని చెరువుల సుందరీకరణ కూడా నత్తనడకన సాగుతోంది. దాదాపు రూ.120 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 20 చెరువుల సుందరీకరణ పనులు అలస్యంగా జరుగుతుండడం అధికారుల అలసత్వం, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యానికి నిదర్శనం. అయితే కొన్ని చెరువుల పనులకు స్థానికులు ఆటంకం కలిగిస్తున్నారనే వాదనను అధికారులు తెరపైకి తేస్తున్నా.. ముందే గుర్తించిన చెరువులు కావడంతో ఆ ఆటంకాలను అధిగమించి పనుల్లో వేగం పెంచాల్సిన అవసరం ఉంది. కానీ ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. 

లెక్కల్లోనే ‘హరితం’
ఏడు జిల్లాల పరిధిలో ఉన్న హెచ్‌ఎండీఏ అర్బన్‌ ఫారెస్ట్రీ అధికారులు ఈ ఏడాది 4కోట్ల మొక్కలను అందుబాటులో ఉంచామని లెక్కలు చెబుతున్నప్పటికీ... ఆ స్థాయిలో హరితహారం సందడి కనిపించడం లేదు. ఈ ఏడాదివి 2.95 కోట్ల మొక్కలు, పాతవి 1.08 కోట్లు ఉండడంతో 4కోట్ల వరకు మొక్కలు అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు. ఈ లెక్కన 2.95 కోట్ల కొత్త మొక్కలకు రూ.180 కోట్లు వరకు వ్యయం చేసినట్టుగా హెచ్‌ఎండీఏ అధికారులు చెబుతున్న మాటలను బట్టే ఇది తెలుస్తోంది. బ్యాగ్‌ ఫిల్లింగ్‌ (ఎర్రమట్టి, వర్మీ కంపోస్టు, నారు లేదంటే విత్తనం) దగ్గరి నుంచి వాటరింగ్, షిఫ్టింగ్‌ ఆఫ్‌ నర్సరీ, మెయింటెనెన్స్‌ ఆఫ్‌ నర్సరీ, కార్మికులు... ఇలా నార్మల్‌ సైజు మొక్కల (5బై9, 6బై8, 6బై12)కు రూ.60 నుంచి రూ.80 వరకు ఖర్చవుతుందన్న మాటలు సబబుగానే ఉన్నా... ఈసారి ఎన్ని మొక్కలు నాటారో? ఎన్ని పంపిణీ చేశారో? అనే దానిపై స్పష్టత లేకపోవడం విమర్శలకు తావిస్తోంది.  

స్పీడ్‌ పెంచాలె...  
మరోవైపు ఇప్పటికే హెచ్‌ఎండీఏ చేపట్టిన భారీ ప్రాజెక్టులతో పాటు ప్రతిపాదిత ప్రాజెక్టులను పట్టాలెక్కించేందుకు ల్యాండ్‌పూలింగ్‌ వేగవంతం చేయాల్సిన అవసరముంది. ఈ దిశగా ఆ విభాగ అధికారులు ఆసక్తి చూపుతున్న ప్రతాపసింగారం, భువనగిరి, చౌటుప్పల్, కీసర రైతుల భూములు తీసుకొని లేఅవుట్లుగా అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఉంది. మే 5న ల్యాండ్‌పూలింగ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేస్తే ఇప్పటి వరకు ఏ ఒక్క ప్రాంతంలోనూ పూర్తి స్పష్టత రాలేదు. అయితే తాజా అంశాల నేపథ్యంలో ల్యాండ్‌పూలింగ్‌ వేగిరం చేస్తేనే హెచ్‌ఎండీఏ ప్రాజెక్టులు పరుగులు పెడతాయి. ఇప్పటికే పూర్తిస్థాయి సిబ్బందితో ఉన్న ల్యాండ్‌పూలింగ్‌ విభాగం ఆయా భూ యాజమాన్య హక్కులు గుర్తించడం, లేఅవుట్‌కు అనువైన ప్రాంతమా? కాదా? అని నిర్ధారించుకోవడం చేస్తే 6 నెలల్లోనే దాదాపు నాలుగు లేఅవుట్లు అభివృద్ధి చేయవచ్చని హెచ్‌ఎండీఏ వర్గాలే పేర్కొంటున్నాయి.  

లాజిస్టిక్‌ హబ్స్‌ పనులు ఇలా..
బాటసింగారం
విస్తీర్ణం 40 ఎకరాలు   
వ్యయం రూ.35 కోట్లు  
పనులు పూర్తి 70 శాతం
కమర్షియల్‌ ఆపరేషన్‌కు గ్రీన్‌ సిగ్నల్‌
 
మంగళ్‌పల్లి
విస్తీర్ణం 22 ఎకరాలు
వ్యయం రూ.20 కోట్లు  
పనులు పూర్తి 40 శాతం  
కమర్షియల్‌ ఆపరేషన్‌కు మరో మూడు నెలలు పట్టే అవకాశం  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement