
'టీటీడీపీ నేతలు చిల్లరవేషాలు మానుకోవాలి'
న్యూఢిల్లీ: కృష్ణపట్నం, లోయర్ సీలేరులో ఉత్పత్తి అవుతున్న విద్యుత్లో తమ రాష్ట్రానికి రావాల్సిన వాటా ఎందుకివ్వడం లేదని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని ప్రశ్నించారు. శుక్రవారం న్యూఢిల్లీలో కేటీఆర్ విలేకర్లతో మాట్లాడుతూ... విద్యుత్ విషయంలో టీటీడీపీ నేతలు కేంద్ర ప్రభుత్వం వద్దకు వచ్చి విజ్ఞప్తి చేయకుండా... చంద్రబాబు ఇంటి ముందు ధర్నా చేయాలని సూచించారు. ఇకనైనా చిల్లర వేషాలు మానుకోవాలని తెలంగాణ టీడీపీ నేతలకు కేటీఆర్ హితవు పలికారు.
తెలంగాణకు రావాల్సిన విద్యుత్ వాటా ఇప్పించాలని కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, రవిచంద్ర ప్రసాద్లకు కలసి విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. అలాగే తెలంగాణకు సహకరించాలని కూడా కోరినట్లు... అందుకు వారు సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. కరెంట్ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రశ్నలకు ఏపీ సీఎం చంద్రబాబు ఇంకా జవాబు చెప్పలేదని విలేకరి అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.