సాక్షి, హైదరాబాద్: రాజధాని నగరంతో పాటు దాని పరిసర ప్రాంతాల అభివృద్ధికి వచ్చే నాలుగేళ్లలో రూ.50 వేల కోట్లు ఖర్చు చేయనున్నామని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. శాసనసభకు ప్రతిపాదించిన 2020–21 వార్షిక బడ్జెట్‌లో హైదరాబాద్ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించినందుకు ఆదివారం ఆయన ఒక ప్రకటనలో ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ దాని పరిసర ప్రాంతాల అభివృద్ధితో పాటు మూసీ నది ప్రక్షాళన, మూసీ రివర్ డెవలప్‌మెంట్ ఫ్రంట్ కోసం ఈ నిధులను ఖర్చు చేయనున్నామని వెల్లడించారు.
హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చాలన్న తెలంగాణ ప్రభుత్వ నిబద్ధతకు బలం చేకూర్చే విధంగా బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయన్నారు. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ఎస్‌ఆర్‌డీపీ కార్యక్రమంతో నగరంలో ఇప్పటికే అనేక ప్రాజెక్టులను చేపట్టి పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నామని, పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ తగ్గించేందుకు ఫ్లై ఓవర్లు, అండర్‌పాసులను వినియోగంలోకి తెచ్చామన్నారు. రెండో దశ మెట్రో రైలు ప్రాజెక్టు కోసం ప్రణాళికలు కొనసాగుతున్నాయని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment