క్యామ మల్లేశ్
డీసీసీ అధ్యక్షుడు మల్లేశ్ ధ్వజం
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ప్రత్యేక రాష్ర్టం కోసం ఉద్యమించిన కవులు, విద్యార్థులు, మేధావులు... ఇప్పుడు తెలంగాణ ఉనికిని కాపాడుకునేందుకు పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ పిలుపునిచ్చారు. ప్రజా వ్యతిరేక విధానాలతో ఐదు నెలలుగా ప్రజలను కేసీఆర్ ప్రభుత్వం గందరగోళంలోకి నెడుతోందని విమర్శించారు. శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. సంక్షేమ పథకాలకు మళ్లీ దరఖాస్తులు చేసుకోవాలని నిబంధనలు విధించడంతో వృద్ధులు, పేదలు నానాయాతనకు గురవుతున్నారని అన్నారు.
ప్రభుత్వానికి కనువిప్పు కలిగించేలా ప్రతిపక్షాల పోరాటానికి ప్రజాసంఘాలు మద్దతుగా నిలవాలని పేర్కొన్నారు.హిట్లర్ పాలనను తలపించేలా రోజుకో సర్వేతో సంక్షేమ పథకాల అమలును కాలయాపన చేస్తున్నారని దుయ్యబట్టారు. శ్రమదానంతో హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన, ఇందిరాపార్కులో సరస్సు నిర్మాణం అంటూ మతిభ్రమించినట్లు సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కల్లబొల్లి మాటలతో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ అనతికాలంలోనే అపఖ్యాతిని మూటగట్టుకుంటోందని అన్నారు.
కరెంట్ కోతలతో పంటలు ఎండిపోయి పశుసంపద కబేళాకు తరలుతోందన్నారు. అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేకపోవడం దురదృష్టకరమన్నారు. రుణమాఫీ వర్తింపులేక, రుణాలు మంజూరు చేయకపోవడంతో ఇప్పటికే జిల్లాలో పలువురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ర్టం సాధిస్తే ఉద్యోగాలు దక్కుతాయని ఆత్మబలిదానాలు చేసుకున్న యువత ఆకాంక్షలను కూడా ప్రభుత్వం నెరవేర్చడంలేదని విమర్శించారు. ఉద్యోగాల భర్తీపై స్పష్టమైన ప్రకటనలు కూడా చేయకపోవడంతో నిరుద్యోగులు నైరాశ్యంలో కూరుకుపోతున్నారని పేర్కొన్నారు.