పెద్దపల్లి : మానవత్వానికే మచ్చ తెచ్చే ఓ సంఘటన కరీంనగర్ లో చోటు చేసుకుంది. కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మండలం అందుగులపల్లిలో ఇద్దరు ఒడిశా కార్మికులు విద్యుద్ఘాతంతో మృతి చెందారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వివరాల్లోకి వెళ్తే...అందుగులపల్లి గ్రామం సమీపంలోని ఇటుక బట్టీల్లో సుమారు వెయ్యి మంది కార్మికులు పనిచేస్తుంటారు. వీరిలో ఎక్కువ మంది ఒడిశాకు చెందిన వారే. శ్యామ్ అనే వ్యక్తి నడుపుతున్న బట్టీలో పనిచేసే ఇద్దరు కార్మికులు నాలుగు రోజుల క్రితం తప్పించుకునేందుకు ప్రయత్నించారు.
అయితే రాత్రి సమయంలో అడ్డదారిన పొలాల నుండి వెళ్లిన వారిద్దరూ.. రైతులు వరి పొలాలను పందుల బారి నుంచి కాపాడుకునేందుకు పెట్టిన విద్యుత్ తీగలు తగిలి షాక్‌తో మృతి చెందారు. కాగా ఈ విషయం తెలిసిన బట్టీ యజమాని శ్యామ్ ఆ మృతదేహాలను గుట్టుచప్పుడు కాకుండా దూరంగా పారవేయించారు. అయితే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వటంతో ఆదివారం ఈ విషయం వెలుగులోకి వచ్చింది.