labour died
-
‘కేశోరాం’లో కార్మికుడి మృతి
సాక్షి, పాలకుర్తి(కరీంనగర్): పాలకుర్తి మండలం బసంత్‌నగర్ కేశోరాం సిమెంట్ కర్మాగారంలో బుధవారం లిఫ్ట్ ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు కిందపడి కొడారి నర్సింగం(42) అనే పర్మినెంట్ కార్మికుడు మృతి చెందాడు. మృతుడి కుటుంబసభ్యులు, తోటికార్మికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈసాలతక్కళ్లపల్లి గ్రామానికి చెందిన నర్సింగం కేశోరాం సిమెంట్ కర్మాగారంలో ఎలక్ట్రికల్ విభాగంలో పనిచేస్తున్నాడు. ఉదయం షిఫ్ట్ విధులకు హాజరై సిమెంట్ మిల్లు వద్ద నాల్గో అంతస్తులో పని చేస్తుండగా ఉదయం సుమారు 10 గంటలకు టీ తాగేందుకు లిఫ్ట్ ద్వారా కిందకు దిగేందుకు ప్రయత్నించగా ప్రమాదవశాత్తు 60 మీటర్ల ఎత్తు నుంచి కింద పడ్డాడు. దీంతో అతని తలతోపాటు చేయి, కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే తోటికార్మికులు, అధికారులు కంపెనీ ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నిస్తుండగానే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్షుడు కౌశికహరి, ప్రధాన కార్యదర్శి తోడేటి రవికుమార్‌లతోపాటు ఇతర నాయకులు సంఘటనా స్థలానికి చేరుకుని అధికారుల నిర్లక్ష్యం మూలంగానే ప్రమాదం చోటు చేసుకుందని ఆరోపిస్తూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. కార్మికసంఘం నాయకులు, అధికారులతో కలిసి ప్రమాదం జరిగిన వీఆర్‌పీఎం లిఫ్ట్ ప్రాంతాన్ని, సిమెంట్ మిల్లు నాల్గో అంతస్తు పైకి ఎక్కి పరిశీలించి మృతుడి కుటుంబానికి రూ.40లక్షలు ఎక్స్‌గ్రేషియా, ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ఐదుగంటల పాటు ఉద్రిక్త వాతావరణం కార్మికుడు నర్సింగం మృతితో కార్మికులు ఉదయం షిప్టు విధులను బహిష్కరించి కంపెనీ గేట్ ఎదుట నిరసనకు దిగారు. తొలుత యాజమాన్యం రూ.20లక్షలతోపాటు నర్సింగం కుమారుడికి ఉద్యోగం ఇచ్చేందుకు అంగీకరించింది. ఈమేరకు కంపెనీ ప్లాంట్ హెడ్ రాజేశ్‌గర్గు ఈవిషయాన్ని కార్మికసంఘం నాయకులకు తెలుపగా అందుకు వారు ఒప్పుకోకపోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈనేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ముందస్తుగా పోలీసులు భారీగా మోహరించారు. కార్మికసంఘం నాయకులకు, అధికారులకు మధ్య పలుదఫాలుగా జరిగిన చర్చలు విఫలం కావడంతో నాయకులు, కార్మికులు గేట్ ఎదుట బైఠాయించి ఆందోళన నిర్వహించారు. దాదాపు 5గంటల పాటు పలు దఫాలుగా కొనసాగిన చర్చల అనంతరం మృతుడి కుటుంబానికి రూ.33లక్షలు చెల్లించేందుకు యాజమాన్యం అంగీకరించింది. దీంతో పాటు మృతుడి కుటుంబంలో ఒకరికి పర్మినెంట్ ఉద్యోగం, సంఘటనకు బాధ్యులైన వారిపై తగిన విచారణ నిర్వహించి చర్యలు తీసుకునేందుకు యాజమాన్యం అంగీకరిస్తూ వ్రాతపూర్వకంగా ఒప్పందపత్రాన్ని అందజేశారు. దీంతో కార్మికులు, నాయకులు శాంతించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ కార్యక్రమంలో గుర్తింపు కార్మికసంఘం అధ్యక్షుడు కౌశికహరి, ప్రధాన కార్యదర్శి తోడేటి రవికుమార్, జీడీనగర్, బసంత్‌నగర్, పాలకుర్తి సర్పంచులు సూర సమ్మయ్య, కట్టెకోల వేణుగోపాలరావు, జగన్, కాంట్రాక్ట్ కార్మిక సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ముక్కెర శ్రీనివాస్, పాలకుర్తి వైస్ ఎంపీపీ ఎర్రం స్వామి, నాయకులు అయోధ్య సింగ్, తంగెడ అనిల్‌రావు, ముల్కల కొంరయ్య, అంతర్గాం జెడ్పీటీసీ నారాయణతోపాటు సమీప గ్రామాల ప్రజాప్రతినిధులు, కార్మికులు పాల్గొన్నారు. కాగా మృతుడికి భార్య సరితతోపాటు ఇద్దరు కుమారులున్నారు, మృతుడి తల్లి సుశీల కంపెనీ ఎదుట పండ్ల షాపు నిర్వహిస్తోంది. అందరితో కలివిడిగా ఉండే నర్సింగం మృతితో ఈసాలతక్కళ్లపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. అధికారుల నిర్లక్ష్యమే కారణం కేశోరాం కర్మాగారంలో జరిగిన ప్రమాదానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని కార్మికులు ఆరోపిస్తున్నారు. కర్మాగారంలో ఐదో అంతస్తులు గల సిమెంట్ మిల్లు వద్ద కార్మికులు ఎక్కేందుకు, దిగేందుకు ఏర్పాటు చేసిన గల వీఆర్‌పీఎం లిఫ్ట్‌కు ఆపరేటర్ లేడని, లిఫ్ట్ కూడా సరిగ్గా పనిచేయడం లేదని ఒకచోట ఆగాల్సింది ఇంకో చోట ఆగుతోందని ఈవిషయాన్ని సంబంధిత అధికారులకు తెలిపినా పట్టించుకోలేదని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. లిఫ్ట్ సరిగ్గా ఆగకపోవడం వల్లనే నర్సింగం అదుపుతప్పి కింద పడి మృతిచెందాడని, వెంటనే సంఘటనకు బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
విషవాయువులతో ఇద్దరు కార్మికులు మృతి
హైదరాబాద్: బాలానగర్‌లోని బయోకెమికల్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో విషాదం చోటుచేసుకుంది. విషవాయువు కారణంగా ఇద్దరు కార్మికులు మృతిచెందారు. కంపెనీలోని డ్రైనేజీని శుభ్రం చేయడానికి మ్యాన్హోల్లోకి ముగ్గురు కార్మికులు దిగారు. అయితే అందులోని విషవాయువుల కారణంగా ఇద్దరు కార్మికులు మృతిచెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. అగ్నిమాపక సిబ్బంది చేరుకుని సహాయక కార్యక్రమాలు చేపట్టారు. మృతులను మూసాపేట్ జనతానగర్‌కు చెందిన అల్లాడి రామారావు(50), అల్లాడి సీతారామ్(30) (బాబాయ్, అబ్బాయ్)గా గుర్తించారు. -
మ్యాన్ 'హెల్'
సాక్షి,సిటీబ్యూరో: నగరంలో మ్యాన్‌హోళ్ల కారణంగా దశాబ్ద కాలంలో 25 మంది కార్మికులు మృత్యువాత పడినా అధికారులు, కాంట్రాక్టర్ల తీరు మారడం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మ్యాన్‌హోళ్లలోకి ముందు జాగ్రత్తలు తీసుకోకుండా కార్మికులను దింపొద్దని ఎన్నిసార్లు చెబుతున్నా పట్టించుకోవడం లేదు. జలమండలి బోర్డు 1989లో ఆవిర్భవించింది. అప్పటి నుంచి నేటి వరకు సుమారు 25 మంది కార్మికులు మ్యాన్‌హోళ్లలోకి దిగి మృత్యువాతపడడం అందరినీ కలచివేస్తోంది. కొన్ని నెలలుగా తెరచుకోని మ్యాన్‌హోళ్లలో మురుగు నీటిలో ఉండే కాలుష్య కార కాలు, ఇతర అనుఘటకాలతో మీథేన్, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్డయాక్సైడ్ వంటి విషవాయువులు అధిక మొత్తంలో వెలువడతాయి. ఇందులోకి దిగేముందు రెండుగంటల పాటు మ్యాన్‌హోల్ మూతను తెరచి ఉంచాలి. ఆ తర్వాత అగ్గిపుల్లను వెలిగించి వాయువులు ఉన్నాయో లేదో చెక్ చేసుకున్న తర్వాతే అందులోకి దిగాలి. కానీ నేరుగా మూతలు తెరచి అందులోకి దించుతుండడంతో కార్మికులు సమిధలవుతున్నారు. సెలవురోజుల్లో పర్యవేక్షణ శూన్యం... మ్యాన్‌హోల్ ప్రమాదాలు ఇటీవల రెండో శనివారం,ఆదివారం, ఇతర పర్వదినాల వంటి సెలవురోజుల్లోనే చోటుచేసుకుంటున్నాయి. ఆయా ప్రాంతాల్లో అధికారులు క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులపై నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ప్రమాదాలు జరుగుతుండడం గమనార్హం. సంఘటన జరిగినపుడే హడావుడి చేస్తున్న అధికారులు పనులు జరుగుతున్నప్పుడు ఆయా ప్రాంతాలను కనీసం సందర్శించడంలేదన్న విమర్శలున్నాయి. సుప్రీం మార్గదర్శకాలకు తిలోదకాలు.. మ్యాన్‌హోళ్లలోకి పారిశుద్ధ్య కార్మికులను దించడాన్ని సుప్రీంకోర్టు గతంలో తప్పుబట్టింది. దీంతో కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ కార్మికులను మ్యాన్హోళ్లలోనికి ఎట్టి పరిస్థితుల్లోనూ దించరాదని, ఎయిర్‌టెక్ యంత్రాలతోనే శుద్ధిచేయాలని స్పష్టమైన ఆదేశాలిచ్చింది. కానీ ఈ మార్గదర్శకాలు కాగితాలకే పరిమితమయ్యాయని ఇటీవలి దుర్ఘటనలు రుజువు చేస్తున్నాయని కార్మికసంఘాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. గతంలో నగరంలో జరిగిన ప్రమాదాల్లో మృతిచెందిన జలమండలి కార్మికుల ఉదంతాలు కొన్ని.. సంవత్సరం మృతిచెందిన కార్మికుని పేరు 1988 ఉస్మాన్ 2003 చంద్రయ్య(నారాయణగూడా) 2004 మన్నెం(రెడ్‌హిల్స్) 2014 బి.సత్యనారాయణ(ఓల్డ్‌సిటీ) 2015 రాములు వీరుకాక మరో 20 మంది వరకు నైపుణ్యంలేని కార్మికులు(అడ్డా కూలీలు) మ్యాన్‌హోళ్లలోకి దిగి మృత్యువాతపడ్డారు. కార్మికులను నేరుగా దింపడంతోనే ప్రాణాలు పోతున్నాయి నైపుణ్యం లేని కార్మికులను నేరుగా మ్యాన్‌హోళ్లలోకి దించడంతోనే వారి ప్రాణాలు పోతున్నాయి. దీనికి అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమే ప్రధాన కారణం. కార్మికశాఖ మార్గదర్శకాల ప్రకారం మ్యాన్‌హోళ్లలోకి ఎట్టిపరిస్థితుల్లోనూ కార్మికులను దించరాదు. ఎయిర్‌టెక్ యంత్రాలతోనే శుద్ధిచేయాలి. ప్రతి ఎయిర్‌టెక్ యంత్రంపై 6గురు సహాయకులు ఉండేలా చర్యలు తీసుకోవాలి. 50 మ్యాన్‌హోళ్ల పర్యవేక్షణకు ఒక సీవరేజి కార్మికుడు ఉండాలి. కానీ జలమండలిలో సిబ్బంది లేమి తీవ్రంగాఉంది. మృతిచెందిన కార్మికుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం అందించాలి. ఆనంద్‌రెడ్డి, జలమండలి సీవరేజి కార్మికుల సంఘం నేత బాధిత కుటుంబాలను ఆదుకుంటాం: డిప్యూటీ మేయర్ గచ్చిబౌలి: మ్యాన్ హోల్లో పడి మృతి చెందిన వారి కుటుంబాలను తెలంగాణ ప్రభుత్వం, జీహెచ్ఎంసీ ఆదుకుంటుందని డిప్యూటీ మేయర్ బాబా ఫసియొద్దీన్ తెలిపారు. ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని ఆయన పేర్కొన్నారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా ఘటన చోటుచేసుకుందన్నారు. కార్పొరేటర్ జగదీశ్వర్æ గౌడ్ మాట్లాడుతూ నెల రోజుల వ్యవధిలో ఇది రెండో ఘటన అని అన్నారు. డిప్యూటీ మేయర్, ఎమ్మెల్యేతో పాటు జీహెచ్ంఎంసీ జోనల్ కమిషనర్ బి.వి.గంగాధర్ రెడ్డి, సర్కిల్–12 ఉప కమిషనర్ మమత, మాదాపూర్ ఏసీపీ రమణకుమార్, సీవరేజ్ బోర్డు జీఎం సుదర్శన్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మ్యాన్ హోల్లో పడి కార్మికులు మృతి చెందడానికి ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమని యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఎం.రవికుమార్ యాదవ్ పేర్కొన్నారు. కార్మికుల కుటుంబాలకు రూ.15 లక్షల నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లించకుంటే ఆందోళన చేస్తామని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి బసిరెడ్డి బ్రహ్మానందరెడ్డి, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యదర్శి ఇమామ్ హుస్సేన్ పేర్కొన్నారు. -
ఐటీసీ పీఎస్‌పీడీలో ప్రమాదం
కార్మికుడి మృతి.. మరో ఐదుగురికి అస్వస్థత బూర్గంపాడు: ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలోని ఐటీసీ పీఎస్‌పీడీలో శనివారం రాత్రి చోటుచేసుకున్న ప్రమాదంలో ఒక పర్మనెంట్ కార్మికుడు మృతి చెందగా, మరో కాంట్రాక్ట్ కార్మికుడి పరిస్థితి విషమంగా ఉంది. ఇదే ఘటనలో మరో ఐదుగురు కార్మికులు కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఐటీసీ పీఎస్‌పీడీలోని ఎస్ఆర్పీ (సోడా రికవరీ ప్లాంట్)లో సాంకేతిక లోపాలను సరిచేస్తున్న క్రమంలో కొద్ది పరిమాణంలో ఎన్సీజీ (నాన్ కన్జెన్షబుల్ గ్యాస్) లీకవటంతో అక్కడ పనిచేస్తున్న పర్మనెంట్ కార్మికుడు పీఎల్ఎన్ ప్రసాద్, అతడి పక్కనే ఉన్న కాంట్రాక్ట్ కార్మికుడు వీరభద్రం ఊపిరాడక తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని రక్షించేందుకు అక్కడికి వెళ్లిన మరో ఐదుగురు కార్మికులు కూడా అస్వస్థతకు గురయ్యారు. వీరికి ఐటీసీలోని డిస్పెన్సరీలో ప్రథమ చికిత్సలు నిర్వహించి.. వెంటనే భద్రాచలంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పీఎల్ఎన్ ప్రసాద్ (28) మృతి చెందాడు. కాకినాడకు చెందిన ప్రసాద్‌కు 11 నెలల క్రితమే వివాహం జరిగినట్లు తోటి కార్మికులు తెలిపారు. కాంట్రాక్ట్ కార్మికుడు వీరభద్రం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో ఉంచి వైద్య సేవలందిస్తున్నారు. అస్వస్థతకు గురైన మరో ఐదుగురు కార్మికులకు కూడా భద్రాచలంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్య సేవలు అందిస్తున్నారు. అయితే ఈ ఐదుగురి ఆరోగ్యం పట్ల ఆందోళన అవసరం లేదని వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న కార్మిక సంఘాల నాయకులు ఆస్పత్రి వద్దకు వెళ్లి పరిస్థితిని వాకబు చేశారు. -
కూలీ మృతి : కార్మికులు ఆందోళన
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా జైపూర్ పవర్ ప్లాంట్ నిర్మాణంలో బుధవారం విషాదం చోటు చేసుకుంది. పశ్చిమ బెంగాల్‌కి చెందిన ఓ కూలీ బుధవారం ఉదయం పై నిర్మాణంలో ఉన్న భవనం పైకప్పు నుంచి జారి పడి ప్రమాదవశాత్తు మరణించాడు. అయితే ఆ విషయాన్ని యాజమాన్యం గోప్యం ఉంచేందుకు ప్రయత్నిస్తుంది. ఆ క్రమంలో కూలీ మృతదేహన్ని యాజమాన్యం మాయం చేసిందని ఆరోపిస్తూ కార్మికులు ఆందోళనకు దిగారు. అందులోభాగంగా విధులు బహిష్కరించి పవర్ ప్లాంట్ ఎదుట ఆందోళనకు దిగారు. దాంతో పవర్ ప్లాంట్ నిర్మాణ పనులు ఆగిపోయాయి. -
మానవత్వానికే మచ్చ తెచ్చిన యజమాని!
పెద్దపల్లి : మానవత్వానికే మచ్చ తెచ్చే ఓ సంఘటన కరీంనగర్ లో చోటు చేసుకుంది. కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మండలం అందుగులపల్లిలో ఇద్దరు ఒడిశా కార్మికులు విద్యుద్ఘాతంతో మృతి చెందారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వివరాల్లోకి వెళ్తే...అందుగులపల్లి గ్రామం సమీపంలోని ఇటుక బట్టీల్లో సుమారు వెయ్యి మంది కార్మికులు పనిచేస్తుంటారు. వీరిలో ఎక్కువ మంది ఒడిశాకు చెందిన వారే. శ్యామ్ అనే వ్యక్తి నడుపుతున్న బట్టీలో పనిచేసే ఇద్దరు కార్మికులు నాలుగు రోజుల క్రితం తప్పించుకునేందుకు ప్రయత్నించారు. అయితే రాత్రి సమయంలో అడ్డదారిన పొలాల నుండి వెళ్లిన వారిద్దరూ.. రైతులు వరి పొలాలను పందుల బారి నుంచి కాపాడుకునేందుకు పెట్టిన విద్యుత్ తీగలు తగిలి షాక్‌తో మృతి చెందారు. కాగా ఈ విషయం తెలిసిన బట్టీ యజమాని శ్యామ్ ఆ మృతదేహాలను గుట్టుచప్పుడు కాకుండా దూరంగా పారవేయించారు. అయితే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వటంతో ఆదివారం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. -
మట్టిపెళ్లలు విరిగిపడి కూలీ మృతి
హైదరాబాద్: పైప్‌లైన్ నిర్మాణం చేస్తుండగా మట్టిపెళ్లలు విరిగిపడి శివమణి(20) అనే కూలీ గురువారం మృతి చెందాడు. మరో ఇద్దరు గాయపడ్డారు. వివరాలు... మహబూబ్ నగర్ జిల్లా ధనవాడకు చెందిన శివమణి, ఔటర్ రింగురోడ్డు పనుల్లో బాగంగా తారామతి పేట వద్ద పైప్‌లైన్ వేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
మట్టిపెళ్లలు విరిగిపడి కూలీ మృతి