నాగార్జునసాగర్: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు కావస్తున్నా ఇంతవరకు కార్మిక విధానాన్ని ప్రకటించలేదని సీఐటీయూ రాష్ట్ర ప్రధానకార్యదర్శి సాయిబాబు అన్నారు. నాగార్జునసాగర్ విజయవిహార్ అతిథిగృహంలోని సమావేశమందిరంలో మూడురోజుల పాటు నిర్వహించనున్న సీఐటీయూ జిల్లా శిక్షణ తరగతుల్లో భాగంగా రెండో రోజైన సోమవారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో విద్యుత్ కొరతతో పరిశ్రమలు మూతపడుతున్నాయని, షిఫ్టుల కుదింపు జరుగుతుందని దీంతో కార్మికులు పనిలేక రోడ్డున పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణకు 4వేల మెగా వాట్ల విద్యుత్ కొరత ఉందని తెలిపారు. దీనికి కారణం ప్రతిపక్షాలేనంటూ నిందిస్తూ పబ్బం గడపడం పద్ధతి కాదన్నారు. అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి విద్యుత్ వాటా కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఉన్న హిల్‌కాలనీ, పైలాన్‌కాలనీ భూములను వేలం వేయడం తగదని సాయిబాబు పేర్కొన్నారు. సమావేశంలో సీఐటీయూ రాష్ట్రకార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు తిరందాసు గోపి, కే.వి, లక్ష్మీనారాయణ,సులోచన,కున్‌రెడ్డి నాగిరెడ్డి,అవుత సైదులు పాల్గొన్నారు.
కాంట్రాక్టు ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలి
వివిధస్కీమ్‌లలో ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న పార్ట్‌టైం,ఫుల్‌టైం కార్మికులు, కాంట్రాక్టు ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. నాగార్జునసాగర్ విజయవిహార్ అతిథిగృహంలో సోమవారం రెండవరోజు సీఐటీయూ జిల్లా శిక్షణ తరగతులు కొనసాగాయి. ఉద్యోగ భద్రత, కనీసవేతనాలు, ఇతర సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయడానికి వెళితే సీఎం కేసీఆర్ అపాయింట్‌మెంట్ ఇవ్వడంలేదని పేర్కొన్నారు. ఈసందర్భంగా కళాకారులు ఆటపాటలతో ఆహుతులను అలరించారు. ఈ కార్యక్రమంలో అవుత సైదులు, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
కార్మిక విధానాన్ని ప్రకటించని ప్రభుత్వం
Published Tue, Oct 21 2014 1:34 AM | Last Updated on Fri, Oct 19 2018 7:19 PM
Advertisement