రెండు రాష్ట్రాలకు సాగర్ ఆయకట్టు విభజన
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఎన్నెస్పీ సర్కిళ్లలో మార్పులు
నూజివీడు, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో విస్తరించి ఉన్న నాగార్జునసాగర్ ప్రాజెక్టు(ఎన్నెస్పీ) ఆయకట్టును రెండు రాష్ట్రాల పరిధిలో విభజించే పనిలో ఉన్నతాధికారులు నిమగ్నమయ్యారు. ఎన్నెస్పీ ఉన్నతాధికారుల నివేదికలను అనుసరించి ఆయకట్టును విభజిస్తున్నట్లు తెలిసింది.
నాగార్జున సాగర్ ఎడమకాలువ నల్గొండ, ఖమ్మం, కృష్ణా జిల్లాల్లో విస్తరించి ఉంది. ఈ కాలువ కింద ఈ మూడు జిల్లాల్లో 12 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. కృష్ణాజల్లాలో 3.50 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ మొత్తం ఆయకట్టుకు ఈ కాలువ ద్వారా సాగునీరు అందుతోంది. అయితే విభజన నేపథ్యంలో ఇప్పటి వరకు రెండు ప్రాంతాలకు కలిపి ఉన్న సర్కిల్ కార్యాలయాలు ఇక నుంచి వేరవనున్నాయి.
ఇప్పటి వరకు నూజివీడు, టేకులపల్లి, మిర్యాలగూడెం, సాగర్‌డ్యాం సర్కిళ్లుగా ఉన్నాయి. అయితే ఖమ్మం జిల్లా టేకులపల్లి సర్కిల్ పరిధిలోని కల్లూరులో డివిజన్ కార్యాలయం ఉంది. ఈ కార్యాలయం పరిధిలో తిరువూరు, గంపలగూడెం మండలాల్లో కొంత ఆయకట్టు ఉంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో కల్లూరు డివిజన్ కార్యాలయం పరిధిలోని ఆయకట్టు అంతా నూజివీడు సర్కిల్ పరిధిలోకి చేరుస్తున్నారని ఎన్నెస్పీ వర్గాల ద్వారా తెలి సింది. దీంతో ఇక నుంచి ఈ ఆయకట్టుకు నీటి సరఫరాను నూజివీడు సర్కిల్ అధికారులే నిర్వహించనున్నారు.
మిర్యాలగూడెం సర్కిల్ పరిధిలో ఇప్పటి వరకు ఉన్న జగ్గయ్యపేట ఎన్నెస్పీ డివి జన్ కార్యాలయం కూడా నూజివీడు సర్కిల్ పరిధిలోకి రానుంది. ఖమ్మం ఎన్నెస్పీ డివిజన్ పరిధిలో ఉన్న వత్సవాయి, కంచికచర్ల, నందిగామ మండలాల్లోని ఆయకట్టు మొత్తం నూజివీడు సర్కిల్ పరిధిలోకి రానుంది.
ఎన్నెస్పీ ఉద్యోగుల్లో కూడా ఈ ప్రాంతానికి చెందిన ఉద్యోగులు ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో పనిచేస్తున్నారు. వారు కూడా తమ సొంత జిల్లాలకు బదిలీ అవుతారని ఎన్నెస్పీ వర్గాలు తెలిపాయి. దీనిలో భాగంగానే శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎన్నెస్పీ టేకులపల్లి ఎస్‌ఈ అప్పలనాయుడు సమాంధ్రకు వస్తున్నారని సమాచారం. ఈ సర్కిళ్ల పరిధిలో పనిచేస్తున్న ఇంజినీరింగ్ అధికారులు, ఉద్యోగుల వివరాలను స్థానికత ఆధారంగా ఇప్పటికే సిద్ధం చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.