
కనికరం లేని ఆస్పత్రి సిబ్బంది
తాండూరు టౌన్:
అనారోగ్యంతో బాధపడుతున్న ఓ అభాగ్యుడు ఆస్పత్రి ఆవరణలోనే మృతిచెందాడు. ఆస్పత్రి సిబ్బంది సకాలంలో చికిత్స అందించకపోవడంతో అతడు ప్రాణం విడిచాడు. ఈ సంఘటన శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి ఆవరణలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. పట్టణంలోని పాతతాండూరుకు చెందిన రాములు(38) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అతనికి సొంతవాళ్లు ఎవరూ లేకపోవడంతో యాచిస్తూ జీవనం సాగిస్తున్నాడు.
చికిత్స చేయించుకునేందుకు ఆయన గురువారం ఆస్పత్రికి వచ్చాడు. అయితే అనారోగ్యంతో ఉన్న అతడికి ఆస్పత్రి లోపలికి వెళ్లే తాకతు లేకపోవడంతో ఆవరణలోనే కుప్పకూలిపోయాడు. ఆస్పత్రి సిబ్బంది గమనించినా అతడిని ఎవరూ పట్టించుకోలేదు. చికిత్స అందించేందుకు ముందుకు రాలేకపోయారు. దీంతో ఒకరోజు మొత్తం ఆవరణలోనే అపస్మారక స్థితిలో పడిఉన్న రాములు చివరకు శుక్రవారం కన్నుమూశాడు. మానవీయ విలువలను మరిచిన ఆస్పత్రి సిబ్బంది అతడికి చికిత్స అందించకపోవడంపై పలువురు మండిపడ్డారు.
కనీసం శవాన్ని మార్చురీకి తరలించేందుకు కూడా సిబ్బంది ముందుకురాలేదు. అనంతరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మన్సిపల్ సిబ్బంది మార్చరీకి తరలించారు.