
బాలికను బలిగొన్న బడిబస్సు
- ఫిట్‌నెస్ లేని బస్సులు
- డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమంటున్న స్థానికులు
- బస్సు అద్దాలు, స్కూల్ ఫర్నిచర్ ధ్వంసం
సరూర్‌నగర్: స్కూల్ బస్సు నుంచి దిగుతున్న చిన్నారి అదే వాహనం కిందపడి విగతజీవిగా మారిన సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ శంకర్ యాదవ్ తెలిపిన వివరాలు.. బడంగ్‌పేట నగర పంచాయతీ పరిధిలోని నాదర్‌గుల్ ప్రెస్ కాలనీలో నివాసం ఉండే పేట యాదగిరి, మమత దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. యాదగిరి కారుడ్రైవర్, మమత గృహిణి. వీరి కుమార్తె నం దిత (4) స్థానిక సెయింట్ మాథ్యూస్ హైస్కూల్‌లో ఎల్‌కేజీ చదువుతోంది.
శనివారం ఒంటిపూట తరగతులు కావటంతో అదే స్కూల్‌కు చెందిన బస్సులో ఇంటికి బయలుదేరింది. వారి స్జేజీ వద్ద కు రాగానే బస్సు నుంచి కిందకు దిగు తుండగానే డ్రైవర్ వాహనాన్ని ముందు కు పోనిచ్చాడు. చిన్నారి అదుపుతప్పి కింద పడిపోయింది. బస్సు వెనుక చక్రా లు నందిత తలపై నుంచి వెళ్లటంతో అక్కడికక్కడే మృతి చెందింది. గమనిం చిన డ్రైవర్ బస్సును అక్కడే నిలి పివేసి పరారయ్యాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న తల్లితండ్రులు నందిత మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
ఆరు నెలల క్రితం పెద్దకూతురు మృతి..
యాదగిరి, మమతలకు ఇద్దరు ఆడపిల్లలు, ఒక కుమారుడు. కాగా ఆరునెలల క్రితం వీరి పెద్ద కూతురు అనారోగ్యంతో చనిపోయింది. ఆ బాధ నుంచి తేరుకోకముందే నందితను స్కూల్ బస్సు కబ ళించడం ఆ దంపతులకు తీరని శోకాన్ని మిగిల్చింది. అల్లారుముద్దుగా పెంచు కుంటున్న నందిత దుర్మరణాన్ని వారు తట్టుకోలేకపోతున్నారు.
స్కూల్ బస్సు, ఫర్నిచర్ ధ్వంసం..
నందిత మృతిచెందిన విషయాన్ని తెలుసుకున్న కుటుంబ సభ్యులు, స్థానికులు ప్రమాదానికి కారణమైన స్కూల్ బస్‌ను ధ్వంసం చేశారు. అనంతరం స్కూల్‌కు వెళ్లి కరస్పాండెంట్‌ను చితకబాది ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. మీర్‌పేట ఇన్‌స్పెక్టర్ శంకర్ యాదవ్ ఎస్‌ఐలు సిబ్బంది తో సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
సూపర్‌వైజర్ లేకపోవడంతోనే..
ప్రతి స్కూల్ బస్సులో తప్పనిసరిగా సూపర్‌వైజర్, ఆయాను ఏర్పాటు చేయాల్సి ఉండగా.. అలాంటి ఏర్పాట్లు చేయకుం డానే నిబంధనలకు విరుద్ధంగా బస్ డ్రైవర్‌ను మాత్రమే నియమించుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్కూల్ బస్సు డ్రైవర్ మల్లేశ్ ఎప్పుడూ తప్పతాగి ఉంటాడని, అతడ్ని ఎలా నియమించుకున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యా న్ని నిల దీస్తున్నారు. సెయింట్ మాథ్యూ స్ పాఠశాలలో ఐదు బస్‌లు ఉండగా ఒక్క బస్సుకు కూడా ఫిట్‌నెస్ లేకపోవటం గమనార్హం. డొక్కు బస్సులతో పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని అక్కడకు చేరుకున్న వార్డు కౌన్సిలర్లు యాతం శ్రీశైలం యాదవ్, అంకంగారి మంజుల ఆరోపించారు.
మృతదేహంతో పాఠశాల ఎదుట ధర్నా పోస్టుమార్టం అనంతరం నందిత మృతదేహాన్ని తల్లితండ్రులకు అప్పగించటంతో కుంటుంబ సభ్యులు రాత్రి నాదర్‌గుల్‌కు చేరుకున్నారు. అనంతరం చిన్నారి మృతదేహంతో సెయింట్ మాథ్యూస్ స్కూల్ ఎదుట ధర్నాకు దిగారు. మృతికి స్కూల్ యాజమాన్యం బాధ్యత వహించాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. పాఠశాల యాజమాన్యం వచ్చేవరకు ధర్నాను విరమించేది లేదని బాధితులు పేర్కొన్నారు. కాగా నాదర్‌గుల్, బడంగ్‌పేట వెళ్లే రహదారిని స్తంభింపచేశారు.
స్కూల్ బస్సులు ఇలా ఉండాలి...
బస్సు గాడమైన పసుపు రంగులో, స్పష్టంగా కనిపించేలా ఉండాలి. విద్యార్థులు బస్సులోకి ఎక్కడం, దిగడం డ్రైవర్‌కు కనిపించే విధంగా కన్వెక్స్ క్రాస్ వ్యూ అద్దాలు అమర్చాలి. బస్సు లోపలి భాగంలో ఒక పెద్ద పారదర్శకమైన అద్దం ఏర్పాటు చేయాలి.
బస్సు ఇంజన్ కంపార్ట్‌మెంట్‌లో ఒక అగ్నిమాపక యంత్రం (ఫైర్ ఎక్స్‌టింగ్విషర్),పొడి అందుబాటులో ఉండాలి. అత్యవసర ద్వారం ఏర్పాటు చేయాలి. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అందుబాటులో ఉండాలి.
సదరు పాఠశాల/కళాశాల పేరు, టెలిఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్, పూర్తి చిరునామా బస్సుకు ఎడమవైపున ముందుభాగంలో స్పష్టంగా రాయాలి. సీట్ల కిందిభాగంలో బ్యాగుల కోసం అరలు, పట్టుకోవడానికి లోహపు స్తంభాలను బస్సులో అమర్చాలి.
వాహనానికి నాలుగువైపులా పై భాగం మూలాల్లో (రూఫ్‌పై కాదు) బయటివైపు యాంబర్ (గాఢ పసుపు పచ్చని) రంగు గల ఫ్లాపింగ్ లైట్లను ఏర్పాటు చేయాలి. పిల్లలు దిగేటప్పుడు,ఎక్కేటప్పుడు ఈ లైట్లు వెలుగుతూ ఉండాలి.
సదరు వాహనం స్కూల్ బస్సు అని తెలిసేవిధంగా ముందుభాగంలో పెద్ద బోర్డుపైన 250ఎం.ఎం.కు తగ్గని విధంగా ఇద్దరు విద్యార్థుల (ఒక అమ్మాయి, ఒక అబ్బాయి) బొమ్మలు నల్లరంగులో చిత్రించి ఉండాలి. ఆ చిత్రం కింద ‘‘స్కూల్ బస్సు’’ లేదా ‘‘ కళాశాల బస్సు’’ అని నల్ల రంగులో కనీసం 100ఎంఎం సైజు అక్షరాల్లో రాయాలి. అక్షరాల గాఢత సైజు కనీసం 11ఎం.ఎం.ఉండాలి.