పోదాం.. లక్నవరం | Laknavaram reservoir | Sakshi
Sakshi News home page

పోదాం.. లక్నవరం

Published Fri, Apr 22 2016 1:21 AM | Last Updated on Sun, Sep 3 2017 10:26 PM

Laknavaram reservoir

హన్మకొండ : పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్న లక్నవరం జలాశయంలో నూతనంగా నిర్మించిన అద్దాల మేడలు, ఉడెన్ కాటేజీలు రేపటి నుంచి పర్యాటకులకు అందుబాటులోకి రానున్నాయి. శనివారం ఉదయం రాష్ట్ర గిరిజన, పర్యాటక శాఖ మంత్రి ఆజ్మీర చందూలాల్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పేర్వారం రాములు, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గద్దల పద్మ హజరుకానున్నారు. లక్నవరం జలాశయంలో నిర్మించిన వేలాడే వంతెన, కాకరబోడు దీవిలో నిర్మించిన కాటేజీలకు పర్యాటకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. వీటికి అదనంగా లక్నవరం జలాశయంలో ఉన్న మరో దీవిలో కొత్తగా నాలుగు కాటేజీలను నిర్మించారు. 

 
అద్దాల మేడలు

ఎత్తై కొండల మీద ఆకుపచ్చ రంగు చిక్కగా పరుచుకున్న దట్టమైన అడవిలో పదివేల ఎకరాల్లో విస్తరించిన చెరువు మధ్యలో వెలసిన దీవుల్లో అద్దాల మేడలను నిర్మించారు. దాదాపు రూ.40 లక్షల వ్యయంతో ఈ అద్దాల మేడలను నిర్మించారు. వీటిని సాంకేతిక పరిభాషలో ‘ఆన్ డై లైన్’ కాటేజీలు అంటారు. ఫ్రాన్స్ నుంచి తెప్పించిన మెటీరియల్‌తో ఈ కాటేజీలు నిర్మించారు. తుప్పు, ఫంగస్ లాంటివి ఈ కాటేజీలకు పట్టవు. దాదాపు ఇరవై ఏళ్ల వరకు కాటేజీలు మెరుపును కోల్పోవు. ఐదు వందల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఈ రెండు కాటేజీల్లో 90 శాతం అద్దాలతోనే గోడలు నిర్మించారు. దీంతో గదిలో నుంచే ప్రకృతి అందాలను వీక్షించవచ్చు. అద్దాల గదులతో పాటు గతంలో నిర్మించిన రెండు ఉడెన్ కాటేజీలను రేపు ప్రారంభించనున్నారు. ప్రస్తుతం కాకరబోడులో ఉన్న రెస్టారెంట్‌లో ఎనిమిది గదులు ఉన్నాయి. కొత్తగా నాలుగు గదులు అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో లక్నవరం హరిత హోటర్ సామర్థ్యం 12 గదులకు చేరుకుంది. ఆన్‌లైన్ ద్వారా ఈ గదులను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీవిలో బస చేసే పర్యాటకులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. సోలార్ విద్యుత్ దీపాలతో పాటు జనరేటర్లు అందుబాటులో ఉంచారు. వేయి లీటర్ల సామర్థ్యం కలిగిన నీటి శుద్ధి కేంద్రం ఉంది. దీనితో పాటు పదివేల లీటర్ల సామర్థ్యం కలిగిన మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని నిర్మించారు.

 
ఇక్కడ బస చేసే వారి కోసం మినీ రెస్టారెంటును నిర్మించారు. ఈ నాలుగు గదుల్లో వెస్ట్రన్ పద్ధతిలో టాయిలెట్లు నిర్మించారు. ఈ దీవిలో దాదాపు ఆరువేల చదరపు అడుగులు లాండ్ స్కేపింగ్‌ను అభివృద్ధి చేశారు. ఈ దీవికి చేరుకోవాలంటే 160 మీటర్ల పొడవైన సస్పెన్షన్ బ్రిడ్జి మీదుగా ప్రయాణించి కాకరబోడు దీవికి చేరుకోవాలి. అక్కడి నుంచి బోటులో రెండో దీవికి చేరుకోవచ్చు. స్పీడ్‌బోటు కూడా అందుబాటులో ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement