హైదరాబాద్ : తెలంగాణలోని లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని మాజీ ఎమ్మెల్యే, తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాబురావు డిమాండ్ చేశారు. ఎస్టీ జాబితాలో లంబాడీలు ఉండటం వల్ల ఆదివాసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఇక్కడ తెలంగాణ ప్రజా ఫ్రంట్(టీపీఎఫ్) ఆధ్వర్యంలో ‘‘తెలంగాణలో సాగుతున్న ఆదివాసీ ఉద్యమం– ప్రజాస్వామిక దృక్పథం’’అనే అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు.
బీసీ(ఏ)లో ఉన్న లంబాడీలను 1970వ సంవత్సరంలో అసెంబ్లీలో తీర్మానం చేయకుండా, గవర్నర్ నివేదిక, ట్రైబల్ అడ్వజరీ కమిటి నివేదిక లేకుండా ఎస్టీ జాబితాలో చేర్చారని అన్నారు. ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించే వరకు ఇంద్రవెల్లి తరహాలో పోరాటం చేస్తామని హెచ్చరించారు. త్వరలో నిజాం కళాశాల మైదానంలో బహిరంగసభ నిర్వహిస్తామన్నారు. ప్రొఫెసర్ భంగ్యా భూక్యా మాట్లాడుతూ ఎస్టీలపై సమగ్రంగా అధ్యయనం చేస్తే వాస్తవాలు బయటికి వస్తాయని అన్నారు.
హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ లంబాడీల వల్ల నష్టపోయామనే భావన ఆదివాసీల్లో బలంగా ఉందని, రెండు గ్రూపుల మధ్య తగాదాలను పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. టీపీఎఫ్ అధ్యక్షుడు నలమా స కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టఫ్ అధ్యక్షురాలు విమలక్క, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు, ప్రొఫెసర్ అన్వర్‌ఖాన్, రాజు నాయక్,కె.గోవర్ధన్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment