సాక్షిప్రతినిధి, ఆదిలాబాద్ : ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు భూసేకరణ నత్తనడకన సాగుతోంది. ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టి ఏళ్లు గడుస్తుండగా.. భూ సేకరణ ప్రక్రియ కొనసా..గుతూనే ఉంది. దీంతో కొన్ని చోట్ల ప్రాజెక్టు పనులకు ఆటంకం ఏర్పడుతోంది. మరోవైపు ప్రాజెక్టు నిర్మాణంతో కోల్పోతున్న తమ భూములకు ప్రభుత్వం ఇచ్చే పరిహారం తక్కువగా ఉందని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం రూపొందించిన నూతన భూసేకరణ చట్టం ప్రకారమే భూములకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. భూమినే నమ్ముకుని తరతరాలుగా జీవనం కొనసాగిస్తున్నామని, జీవనాధారాన్ని కోల్పోతున్న తమకు ప్రభుత్వం అరకొర పరిహారం చెల్లించడం తగదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు కింద భూములు కోల్పోతున్న నిర్వాసితులకు ఎకరానికి రూ.లక్ష నుంచి రూ.మూడు లక్షల వరకు ప్రభుత్వం పరిహారం చెల్లిస్తోంది.
మెట్ట భూములకు ఎకరానికి రూ.లక్షా 25 వేలు, ఏడాదికి ఒకటీ, ఒక పంట పండే భూములకు రూ.3 లక్షల చొప్పున ఇస్తున్నారు. ఈ పరిహారం ఏమాత్రం సరిపోదని రైతులు ఆవేదన. కొత్తగా అమలు చేయనున్న భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. నూతన చట్టం ప్రకారం చెల్లించే పరిహారం ఇప్పుడు ఇస్తున్న పరిహారం కంటే తక్కువగా వచ్చే అవకాశాలున్నాయని రెవెన్యూ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.
జిల్లాలో ఐదు ప్యాకేజీలు..
తెలంగాణలోని ఏడు జిల్లాల పరిధిలో 16.40 లక్షల ఎకరాల బీడు భూములను సాగులోకి తెచ్చేందుకు ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి సాగునీటి పథకానికి శ్రీకారం చుట్టారు. పనులు పూర్తయితే జిల్లాలో 21 మండలాల పరిధిలో 1.56 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. జిల్లాలో కొనసాగుతున్న ప్రాజెక్టు పనులను ఐదు ప్యాకేజీలుగా విభజించారు. ఈ పనుల కోసం మొత్తం 8,491 ఎకరాల భూములు అవసరమని నీటి పారుదల శాఖ గుర్తించింది. నాలుగేళ్లు గడిచినప్పటికీ భూసేకరణ ప్రక్రియ ఓ కొలిక్కి రాలేదు.
ఇప్పటి వరకు 3,672 ఎకరాలు మాత్రమే సేకరించగలిగారు. ఇంకా 4,818 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ఇందులో ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసిన అసైన్డ్ భూములు 1,532 ఎకరాలు ఉండగా, ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములు 368 ఎకరాలు ఉన్నాయి. మిగిలిన 2,381 భూముల సేకరణ వివిధ స్థాయిలో ఉంది. సేకరిస్తున్న భూములకు సంబంధించి పరిహారం ఇంకా రైతులకు చెల్లించాల్సి ఉంది. అత్యధికంగా మందమర్రి మండల పరిధిలో భూములు సేకరించాల్సి ఉంది. ముఖ్యంగా క్యాతన్‌పల్లి, బొక్కలగుట్ట తదితర గ్రామాల పరిధిలో సుమారు రెండు వేల ఎకరాల భూసేకరణ ఇంకా జరగాల్సి ఉంది. నెన్నెల, బెల్లంపల్లి తదితర మండలాల పరిధిలో భూసేకరణ పక్రియ కొనసాగుతోంది.
ముందుకు సాగని పనులు..
కొలిక్కిరాని భూసేకరణ ప్రక్రియ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పనులకు ప్రధాన అడ్డంకిగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ప్రక్రియ ఇంకా ఓ కొలిక్కి రాకపోవడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. పనులు చేపట్టిన కాంట్రాక్టు కంపెనీ భూసేకరణ సాకుగా చూపి పనులను పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవున్నాయి. ప్రస్తుతం కౌటాల నుంచి బెజ్జూరు వరకు కాలువల నిర్మాణం పనులు మాత్రమే జరుగుతున్నాయి. ఐదు ప్యాకేజీల పరిధిలో పలుచోట్ల భూసేకరణ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో పనులకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని నీటి పారుదల శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
భూసేకరణా నత్తనడకే..
Published Mon, Dec 29 2014 3:00 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement