13, 14 తేదీల్లో రైతు హక్కుల కమిటీ పర్యటన
- రాజధాని ప్రాంతంలో రైతులు, కూలీల మనోభావాలు తెలుసుకుంటాం: అంబటి
- భూములిస్తామంటే మద్దతిస్తాం ఇబ్బందులున్నాయంటే వారి తరఫున పోరాడతాం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మించ తలపెట్టిన గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఏర్పాటు చేసిన రాజధాని రైతుల, కూలీల హక్కుల పరిరక్షణ కమిటీ ఈ నెల 13, 14 తేదీల్లో పర్యటిస్తుందని పార్టీ పీఏసీ సభ్యుడు అంబటి రాంబాబు తెలిపారు. రాజధాని రైతుల హక్కుల పరిరక్షణ కమిటీ కన్వీనర్‌గా పార్టీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావును వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నియమించారని, ఈ కమిటీలో ఎమ్మెల్యేలు ఉప్పులేటి కల్పన, జలీల్‌ఖాన్, కత్తెర సురేష్, ఎంవీఎస్ నాగిరెడ్డి సభ్యులుగా ఉంటారని వివరించారు.
జగన్ అధ్యక్షతన సోమవారం జరిగిన హక్కుల పరిరక్షణ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో రాజధాని గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించామన్నారు. కమిటీ సభ్యులు అన్ని గ్రామాల్లోనూ ఈ రెండు రోజుల్లో పర్యటించి రైతులు, కూలీల, కౌలు రైతుల మనోభావాలను తెలుసుకుంటుందని తెలిపారు.
అక్కడి రైతులు నిజంగా భూములు ఇవ్వాలనుకుంటున్నారా? భూములు ఇవ్వడానికి ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కొంటున్నారా అనే విషయాలను వారితో ప్రత్యక్షంగా మాట్లాడి తెలుసుకుంటామని వివరించారు. అక్కడి రైతులు రాజధానికి భూములు ఇవ్వాలని భావిస్త్తుంటే తాము మద్దతునిస్తామని, ఇబ్బందులేమైనా వ్యక్తం చేస్తే అన్నదాతల పక్షాన పోరాడుతామని చెప్పారు. ప్రభుత్వ విధానంవల్ల రైతులు, కూలీల, కౌలు రైతుల హక్కులకు ఎట్టి పరిస్థితుల్లో భంగం కలుగకుండా చూడటమే తమ కమిటీ ప్రధాన లక్ష్యమన్నారు.
గ్రామాల్లో పర్యటించాక రైతుల అభిప్రాయాలపై ఒక నివేదికను తమ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డికి అందజేస్తామని, ఆ తరువాత అవసరమనుకుంటే రైతుల పక్షాన నిలబడటానికి కార్యాచరణను రూపొందిస్తామని చెప్పారు. అవసరమైతే తమ పార్టీ రైతుల సమస్యలపై అఖిలపక్ష సమావేశం కూడా ఏర్పాటు చేస్తుందని తెలిపారు. కమిటీ సమావేశంలో సభ్యులు మర్రి రాజశేఖర్, జలీల్ ఖాన్ , ఉప్పులేటి కల్పన, గొట్టిపాటి రవికుమార్, కొడాలి నాని, కత్తెర సురేష్, ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎంవీఎస్ నాగిరెడ్డి, పీఏసీ సభ్యులు ఎమ్వీ మైసూరారెడ్డి, డీఏ సోమయాజులు, జగన్ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.