
భగ్గుమన్న భూ తగాదాలు
కంటోనిపల్లిలో కత్తితో ముగ్గురిపై దాడి
ఒకరి పరిస్థితి విషమం ఇద్దరికి తీవ్ర గాయాలు
పోలీసుల అదుపులో నిందితుడు
వెల్దండ : భూ తగాదాలు, పాతకక్షల కారణంగా దాయాదులు ఘర్షణ పడి కత్తితో దాడి చేయడంతో ఒకరి పరిస్థితి విషమంగా మారింది. ఈ సంఘటనలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామస్తుల కథనం ప్రకారం.. వెల్దండ మండలంలోని కంటోనిపల్లికి చెందిన తలసాని వెంకట్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి అన్నదమ్ములు. వీరిలో శ్రీనివాస్‌రెడ్డి ఏడేళ్లక్రితమే మృతి చెందాడు. అప్పటి నుంచి అతడి భూమిని వెంకట్‌రెడ్డి సాగు చేస్తుండటంతో తరచూ దాయాదుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. వారికి ఎన్నోసార్లు గ్రామస్తులు సర్ది చెప్పినా పరిస్థితిలో మార్పురాలేదు. కాగా, శనివారం అర్ధరాత్రి అదే గ్రామానికి చెందిన దామోదర్ ఇంట్లో విందు నిర్వహించారు.
ఇందులో అన్న తలసాని వెంకట్‌రెడ్డి, తమ్ముడు రామకృష్ణారెడ్డి, మరదలు హైమావతి, బంధువు బొద్దం అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ క్రమంలోనే పాతకక్షలతో అన్నదమ్ములు గొడవ పడ్డారు. కోపంతో అన్న కత్తితో దాడి చేయడంతో తమ్ముడు, మరదలు, బంధువుకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన చుట్టుపక్కలవారు వెంటనే బాధితులను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆదివారం ఉదయం సీఐ వెంకట్, ఎస్‌ఐ జానకిరాంరెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు.