పెద్దపల్లి : పొలం తగాదా కారణంగా గొడవ జరిగి ముగ్గురు కత్తిపోట్లకు గురయ్యారు. కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మండలం కుర్మపల్లి గ్రామంలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. కుర్మపల్లి గ్రామానికి చెందిన రాయమల్లు, సంతోష్‌లకు చెందిన పొలాలు పక్కపక్కనే ఉంటాయి. రాయమల్లు పొలం మీదుగా వీరయ్యగౌడ్ అనే వ్యక్తి పెద్ద బండరాయి తీసుకెళుతుండగా తన పొలం నుంచి ఎందుకు తీశావంటూ రాయమల్లు అడ్డుకున్నాడు. ఈ రాయి పక్కనున్న క్వారీదని చెప్పినా వినిపించుకోకుండా గొడవకు దిగాడు. కాసేపయ్యాక రాయమల్లు, సంతోష్, హరీష్ అనే వ్యక్తులు వీరయ్యగౌడ్ ఇంటి వద్దకు వెళ్లి ప్రశ్నించడంతో ఆగ్రహించిన అతడు కత్తితో ముగ్గురిని పొడిచాడు. స్థానికులు అక్కడకు వచ్చి గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పెద్దపల్లి ఎస్‌ఐ తెలిపారు.