కదిలిన క్రమబద్ధీకరణ
- పంద్రాగస్టులోపు దరఖాస్తుల పరిశీలన పూర్తి
- కనీస ధర చెల్లింపు వాయిదాల్లో మార్పులు చేర్పులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఎట్టకేలకు భూ క్రమబద్ధీకరణకు గ్రహణం వీడింది. చెల్లింపు కేటగిరీల్లో దరఖాస్తుల పరిశీలనకు ప్రభుత్వం తేదీలను ఖరారు చేసింది. పంద్రాగస్టులోపు జీఓ 59 దరఖాస్తులకు మోక్షం కలిగించాలని గడువు విధించింది. ఈ మేరకు జిల్లా యంత్రాంగానికి రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి బీఆర్ మీనా మార్గదర్శకాలు జారీచేశారు.
అంతేగాకుండా స్థలాల క్రమబద్ధీకర ణకు నిర్ధేశించిన కనీస ధరల వాయిదాలను సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ యంత్రాంగం జీఓ 59 దరఖాస్తుల వడపోతకు సన్నద్ధమవుతోంది. 125 గజాల్లోపు స్థలాలను ఉచితంగా క్రమబద్ధీకరించిన సర్కారు.. ఈ కేటగిరీలో దాదాపు 63వేల మందికి ఇళ్ల పట్టాలను అందజేసింది. జీఓ 58 కింద ఈ దరఖాస్తుల ప్రక్రియ కొలిక్కి రావడంతో తాజాగా 59 జీఓపై దృష్టి సారించింది.
వాయిదాల సవరణ..
చెల్లింపు కేటగిరీలో కట్టడాలను క్రమబద్ధీకరించుకునేందుకు వెసులుబాటు కల్పించిన ప్రభుత్వం... నిర్ధే శించిన మొత్తాన్ని ఐదు వాయిదాల్లో చెల్లించే అవకాశం ఇచ్చింది. క్రమబద్ధీకరణ మొత్తాన్ని 20శాతం చొప్పున కట్టుకునేలా వాయిదాల తేదీలను ప్రకటించింది. అయితే, ఈ జీఓ కింద దరఖాస్తుల పరిశీలన ఆలస్యం కావడంతో తొలుత ప్రకటించిన వాయిదాల్లో మార్పులు చేర్పులు చేసింది. తొలి వాయిదాను దరఖాస్తు సమర్పణ సమయంలో స్వీకరించిన రెవెన్యూ అధికారులు... రెండో వాయిదాను ఏప్రిల్ 15లోపు, మూడో విడత జూన్ 30, నాలుగో వాయిదా సెప్టెంబర్ 30, చివరి వాయిదాను ఈ ఏడాది ఆఖరు తేదీన చెల్లించేందుకు వెసులు ఇచ్చింది. తాజాగా ఈ వాయిదాలను సవరించింది.
రెండో విడత ఆగస్టు 31, మూడో వాయిదా సెప్టెంబర్ 30, నాలుగో విడత నవంబ ర్ 15, ఐదో వాయిదా చెల్లింపులో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. తొలుత ప్రకటించినట్లుగానే డిసెంబర్ 31న చివరి వాయిదా కట్టాలని నిర్ధేశించింది. ఇదిలావుండగా, జీఓ 59 కింద 11,744 దరఖాస్తులురాగా డిమాండ్ డ్రాఫ్ట్‌ల రూపంలో రూ.60 కోట్ల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు జమ అయ్యింది. భూముల క్రమబద్ధీకరణ ద్వారా దాదాపు రూ.150 నుంచి రూ.200 కోట్ల రాబడి వస్తుందని లెక్క గడుతున్న రెవెన్యూ యంత్రాంగం.... జీఓ 58 నుంచి చెల్లింపు కేటగిరీకి మార్చిన 3వేల దరఖాస్తులకు సంబంధించిన సొమ్ము రాబట్టేందుకు అంచనా వేస్తోంది. జీఓ 59 కింద దరఖాస్తులను పరిశీలించాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో హరితహారం కార్యక్రమం పూర్తికాగానే... దీనిపై కార్యక్షేత్రంలోకి దిగనున్నట్లు కలెక్టర్ రఘునందన్‌రావు ‘సాక్షి’కి తెలిపారు.