
త్వరలో భారీగా ఐటీ ఉద్యోగాలు: కేసీఆర్
హైదరాబాద్కు వస్తున్న ఐటీఐఆర్ కోసం 6-10 వేల కోట్ల రూపాయల నిధులు ఇవ్వనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన అసెంబ్లీ సమావేశాల్లో శుక్రవారం వెల్లడించారు. విప్రో నుంచి 5వేల ఉద్యోగాలు ఇస్తామని అజీమ్ ప్రేమ్జీ హామీ ఇచ్చారని తెలిపారు. ఆదిభట్లలో ఏర్పాటుచేసే టీసీఎస్ కంపెనీ నుంచి 27వేల ఉద్యోగాలు వస్తున్నాయన్నారు.
కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిష్కరించుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా కొన్ని ఆంధ్రప్రదేశ్ ఖాతాలో జమ అవుతున్నాయని, వచ్చే బడ్జెట్ నాటికల్లా అన్ని లెక్కలు సెటిల్ అవుతాయనే భావిస్తున్నామని ఆయన చెప్పారు. వాల్మీకి బోయ కులానికి రిజర్వేషన్ విషయంలో వేర్వేరు వాదనలు ఉన్నాయని, ఇలాంటి రిజర్వేషన్ వివాదాల పరిష్కారానికి ఓ కమిషన్ ఏర్పాటు చేస్తున్నామని ఆయన చెప్పారు. తమిళనాడు తరహాలో కమిషన్ సూచనల మేరకు పరిష్కారం కనుగొంటామన్నారు.
ప్రభుత్వం నుంచి కనీసం లక్ష ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తున్నామని, కమలనాథన్ కమిటీ ఇంకా తుది మార్పు చేర్పులు చేయలేదని కేసీఆర్ చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు కార్పొరేషన్లలోనూ ఉద్యోగాలు ఉన్నాయని, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను త్వరలోనే ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇక ఛత్తీస్గఢ్లో ఉన్న మిగులు విద్యుత్ కోసం ఆ రాష్ట్ర సీఎం రమణ్సింగ్తో మాట్లాడినట్లు ఆయన వివరించారు. రెండు రాష్ట్రాల మధ్య 9వేల మెగావాట్ల అల్ట్రా పవర్ లైన్లు రెండింటిని వేస్తున్నామని అన్నారు.