సాక్షి, నెట్‌వర్క్: రాష్ట్రంలో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. అకస్మాత్తుగా కురిసిన వాన భారీ నష్టాన్ని మిగిల్చింది. సోమవారం సాయంత్రం గంటకు 78 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు నగరాన్ని అతలాకుతలం చేశాయి. ఈ గాలులకు హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లో ప్రజలు గడగడలాడి పోయారు. కురిసింది కొద్ది సేపయినా నష్టం మాత్రం భారీగానే జరిగింది. ఇంటి పైకప్పులు గాల్లో ఎగిరిపడ్డాయి. భారీ వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. దీంతో చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ఈదురు గాలుల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా నలుగురు మృత్యువాత పడ్డారు.
హైదరాబాద్ అతలాకుతలం..
జడివాన గ్రేటర్ హైదరాబాద్‌ను గజగజలాడించింది. విద్యుత్ స్తంభాలు, తీగలు తెగిపడటంతో పలు ప్రాంతాల్లో గంటల తరబడి అంధకారం అలుముకుంది. భారీ వృక్షాలు విరిగిపడటంతో పలు ప్రధాన రహదారులపై ట్రాఫిక్ ఎక్కడికక్కడే స్తంభించిపోయింది. వర్షం 2 సెంటీమీటర్ల లోపే కురిసినా.. లోతట్టు ప్రాంతాల్లో మోకాళ్ల లోతులో నీరు చేరాయి. దీంతో ఆ ప్రాంతాల్లో జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. సికింద్రాబాద్, చార్మినార్‌లో విద్యుత్ తీగలు తెగిపడటంతో కొద్ది గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఎల్బీనగర్, మారేడ్‌పల్లి, అంబర్‌పేట్, రామకృష్ణమఠం, ఉప్పల్‌లోని పలు ప్రాంతాల్లో చెట్లు నేలకూలడంతో పలువురికి గాయాలయ్యాయి. మల్కాజ్‌గిరిలో వరదనీరు పోటెత్తింది. ఎన్‌టీఆర్ స్టేడియంలో పలు షెడ్లు, హోర్డింగ్‌లు కుప్పకూలాయి. ఈదురుగాలుల బీభత్సంతో విద్యుత్ తీగలు తెగిపడి కరెంట్ సరఫరాకు అంతరాయం కలిగింది. సుల్తాన్‌షాహీ ప్రాంతంలో ఇంటిపై కప్పు రేకులు కొట్టుకుపోయాయి. అల్వాల్‌లో చెట్లు విరిగి ప్రధాన రహదారిపై పడటంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ కుప్పకూలింది.
ఫ్లడ్ లైట్ కూలి ఒకరు..
ఈదురు గాలుల తీవ్రతకు ఎల్బీ స్టేడియంలోని భారీ ఫ్లడ్ లైటు టవర్ కుప్పకూలింది. అదే సమయంలో విధులు ముగించుకుని మెట్రో రైలు ఎక్కేందుకు స్టేడియం మీదుగా వెళ్తున్న జీఎస్టీ ఉద్యోగి సుబ్రమణ్యం (55) టవర్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనతో పాటు ఉన్న తోటి ఉద్యోగి రమేశ్ తీవ్రంగా గాయపడ్డాడు. పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్, స్పోర్ట్స్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిషోర్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ విశ్వజిత్, పోలీసు అధికారులు సందర్శించి సహాయచర్యలు చేపట్టారు. కాగా, సాధారణ రోజుల్లో సాయంత్రం సగటు విద్యుత్ వినియోగం 2,700 మెగావాట్లు నమోదు కావాల్సి ఉండగా, సోమవారం రాత్రి అనూహ్యంగా 1,400 మెగావాట్లకు పడిపోయింది. డిస్కం ఆపరేషన్స్ డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి అప్రమత్తమై ఆయా డివిజన్ల పరిధిలోని ఇంజనీర్లను రంగంలోకి దింపారు.
గాల్లో కలిసిన బాలుడి ప్రాణం..
గాలి దుమారం ముక్కుపచ్చలారని బాలుడిని మింగేసింది. సూర్యాపేట జిల్లా కోదాడ గ్రామానికి చెందిన ఎల్లేశ్ ఓల్డ్ మలక్‌పేట శంకర్ నగర్, హౌజింగ్‌బోర్డు కాలనీలో నివసిస్తున్నాడు. అతని కుమారుడు నవనీతరాజు (7) శ్రీ సాయి గ్రామర్ స్కూల్‌లో 1వతరగతి చదువుతున్నాడు. ఆదివారం సెలవురోజు కావడంతో ఇంటిపక్కనే ఉన్న పెద్దమ్మ వాళ్ల ఇంటికి ఆడుకోవడానికి వచ్చాడు. రేకుల ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా ముంచెత్తిన గాలి దుమారం ధాటికి ఆ ఇంటిపై రేకులు ఎగిరి నవనీతరాజుపై పడ్డాయి. ఒక్కసారిగా రెండు రేకులు పడటంతో నవనీత రాజు వాటి మధ్య ఇరుక్కుపోయాడు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.
మహబూబ్‌నగర్‌లో ఇలా..
ఉమ్మడి పాలమూరు జిల్లాలో సోమవారం అకాల వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులు, వడగండ్లు పంటలకు తీవ్రనష్టం మిగిల్చాయి. మహబూబ్‌నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం కురుమూర్తికి చెందిన గొల్లగోపి (35) అనే వ్యక్తి పిడుగుపాటుకు మృత్యువాత పడ్డాడు. కాగా, వనపర్తి జిల్లా ఆత్మకూర్ మండలం ఖానాపూర్‌లో వందేళ్లనాటి రావిచెట్టు కూలిపోయింది.
మెదక్ జిల్లాలో..
మెదక్ జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. చేగుంట, తూప్రాన్, రామాయంపేట, నిజాంపేట, టేక్మాల్ మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో వర్షం అతలాకుతలం చేసింది. ఈదురు గాలులతో ఇళ్ల రేకుల పైకప్పులు ఎగిరిపోయాయి. రోడ్లపై ఆరబోసిన ధాన్యం వానకు తడిసి ముద్దయింది. నిజాంపేట మండలం కె.వెంకటాపూర్‌లో ఓ కోళ్లఫారం నేలమట్టమైంది. వైరా, కొణిజర్ల మండలాల్లో వర్షం కురిసింది. వైరాలోని మార్కెట్‌లో యార్డులో దాదాపు 10 వేల క్వింటాళ్ల ధాన్యం తడిచిపోయింది. ఇల్లెందు పట్టణంలో రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి.
రాష్ట్రంపై ఉపరితల ద్రోణి.. నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుండి దక్షిణ కర్ణాటక వరకు తెలంగాణ, ఉత్తర కర్ణాటక మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. అలాగే శ్రీలంకకు ఆగ్నేయ దిశగా హిందూ మహాసముద్రం, దాన్ని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతం ప్రాంతాలలో ఈ నెల 25వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఆ తదుపరి 48 గంటలలో ఇది వాయుగుండంగా మారి శ్రీలంక తూర్పు ప్రాంతం మీదుగా వాయవ్య దిశగా తమిళనాడు వైపుకు ప్రయాణించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు తెలిపారు. దీంతో మంగళవారం రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని ఆయన తెలిపారు. బుధవారం పొడి వాతావరణం ఉంటుందన్నారు. ఇదిలావుండగా గత 24 గంటల్లో నల్లగొండ జిల్లా మర్రిగూడ, భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లెలో రెండు సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. మరోవైపు సోమవారం ఆదిలాబాద్, హన్మకొండ, నల్లగొండ, నిజామాబాద్, రామగుండంలలో 40 డిగ్రీల చొప్పున అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది.
హైదరాబాద్‌లో కురిసిన వర్షపాతం..
ప్రాంతం నమోదైన వర్షపాతం (సెంటీమీటర్లలో)
కుత్బుల్లాపూర్ 1.5
ముషీరాబాద్ 1.3
మోండామార్కెట్ 1.3
నారాయణగూడ 1.0
వెస్ట్‌మారేడ్‌పల్లి 1.5
అంబర్‌పేట్ 1.0
గాలివాన బీభత్సం
Published Tue, Apr 23 2019 1:14 AM | Last Updated on Tue, Apr 23 2019 8:12 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment