
ధన ప్రభావంపై చర్చ జరగాలి
‘బ్యాలెట్ ద్వారా ఎన్నికలు’ వాదన సరికాదు: ఎంపీ వినోద్
ట్యాంపరింగ్‌కు తావు లేకుండా మెరుగుపర్చాలి: ఉమ్మారెడ్డి
ఈవీఎంల వివాదంపై ఢిల్లీలో ఈసీ చర్చ
సాక్షి, న్యూఢిల్లీ: ఈవీఎంలపై 2010లో జరిగిన చర్చలోనే ‘ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీప్యాట్)’ విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించారని... అందువల్ల బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలనే వాదన సరికాదని ఎంపీ బి.వినోద్‌కుమార్ పేర్కొన్నారు. ఈవీఎంల వివాదంపై శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసింది.
దీనికి ఏడు జాతీయ పార్టీలతో పాటు 48 ప్రాంతీయ పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్ తరఫున వినోద్ కుమార్, వైఎస్సార్‌సీపీ తరఫున సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, టీడీపీ తరఫున ఎంపీ మాల్యాద్రి పాల్గొని.. అభిప్రాయం వెల్లడించారు. ఈ సందర్భంగా ఈవీఎంలను టీఆర్‌ఎస్ స్వాగతిస్తోందని, దేశంలో ఎన్నికల సంఘం తన విధులను సమర్థవంతంగా నిర్వహిస్తోందని వినోద్‌కుమార్ పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి సమర్థవంతమైన ఈవీఎంలను రూపొందించుకోవాలని సూచించారు. ఈవీఎంలో ఏడు సెకన్లుగా ఉన్న ఓటు సమయాన్ని కొద్దిగా పెంచాల్సిన అవసరం ఉందని.. కేవలం ఏడు సెకన్లు అంటే ఓటరు ఆందోళన చెందే అవకాశం ఉందని చెప్పారు. ఎన్నికల్లో ధన ప్రభావం, నగదు పంపిణీపై చర్చ జరగాల్సి ఉందని వినోద్‌కుమార్ స్పష్టం చేశారు. ప్రలోభపెట్టడం అంటే ఇవ్వడం, తీసుకోవడం రెండింటినీ కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.
సమస్యలు రాకుండా ఈవీఎంలను సరిదిద్దాలి: ఉమ్మారెడ్డి
ఈవీఎంలు ట్యాంపరింగ్‌కు గురవుతున్నాయంటూ తిరిగి బ్యాలెట్ విధానాన్ని అనుసరించాలన్న వాదన సరికాదని వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సమావేశంలో స్పష్టం చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి, ట్యాంపరింగ్‌కు తావులేని విధంగా మెరుగుపర్చాలని చెప్పారు. తాము ఎవరికి ఓటు వేశామో తెలుసుకునే వెసులుబాటు కల్పిస్తే అపోహలకు అవకాశం ఉండదని స్పష్టం చేశారు. ఎన్నికలు నిర్వహిస్తున్న ఎన్నికల సంఘం ఫిరాయింపులపై చర్యలు తీసుకునే బాధ్యతలను కూడా చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.
ఈవీఎంలను వ్యతిరేకిస్తున్నాం: టీడీపీ
ఈవీఎంలను వ్యతిరేకిస్తున్నామని, బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు నిర్వహించాలని టీడీపీ ఎంపీ శ్రీరాం మాల్యాద్రి కోరారు. ఎన్నికల సంఘం ఎంత పటిష్టంగా నిర్వహించాలనుకున్నా.. కింది స్థాయిలో సిబ్బందిని ప్రలోభాలకు గురి చేసే అవకాశాలు లేకపోలేదని పేర్కొన్నారు.