నాలుగేళ్ల సంబరం
'ప్రత్యేక రోజు' వేడుకలకు సిద్ధం
ఫిబ్రవరి 29.. నాలుగేళ్లకోసారి వచ్చే రోజు. ఈ అరుదైన రోజున చోటు చేసుకొనే సంఘటనలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. లీపు సంవత్సరం అందరికీ కామన్ అయినా, కొందరికి మాత్రం సమ్‌థింగ్ స్పెషల్. నాలుగేళ్లకోసారి వచ్చే ఈ రోజున వేడుకలు జరుపుకొనేందుకు సిద్ధమయ్యారు వీరు. బర్త్ డే, మ్యారేజ్ డేను ఘనంగా జరుపుకొనేందుకు ఎంతో ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు. మరీ మనం కూడా వీరికి శుభాకాంక్షలు చెబుదామా..!
రెండో పుట్టిన రోజు..
కమ్మర్‌పల్లి : మండలంలోని హాసాకొత్తూర్‌కు చెందిన వాల్గోట్ రమేశ్, లత దంపతుల రెండో కూతురు శ్రీనిత్య. 2008 ఫిబ్రవరి 29న జన్మించిన ఈ పాప ఇప్పటివరకు ఒకే పుట్టిన రోజును జరుపుకొంది. రెండో బర్త్ డేను ఘనంగా నిర్వహించేందుకు తల్లిదండ్రులు సిద్ధమయ్యారు.
మూడో బర్త్ డే
ఆర్మూర్ : పెర్కిట్ గ్రామానికి చెందిన మంచిర్యాల సురేశ్, సంధ్యారాణి దంపతుల పెద్ద కుమారుడు లలిత్ చంద్ర. అందరిలా ఏడాదికోసారి కాకుండా నాలుగేళ్లకోసారి బర్త్ డే జరుపుకొంటాడు. 2004 ఫిబ్రవరి 29న జన్మించిన ఆయన ఇప్పటివరకు రెండుసార్లు మాత్రమే పుట్టినరోజు జరుపుకొన్నాడు. సోమవారం మూడో బర్త్ డే వేడుకలను ఘనంగా నిర్వహించుకొనేందుకు సిద్ధమయ్యాడు. లలిత్ చంద్ర తమ్ముడు జనవరి 1న జన్మించడం విశేషం.
32 ఏళ్లు.. ఏడో బర్త్ డే!
ఆర్మూర్: ఆర్మూర్ పట్టణానికి చెందిన నారాయణ, శకుంతల దంపతుల కుమారుడు కుబీర్ శివానంద్ 1984 ఫిబ్రవరి 29న జన్మించాడు. 32 ఏళ్ల యువకుడైన ఇతను ఏడు సార్లు మాత్రమే జన్మదినాన్ని జరుపుకున్నాడు. బీవీఎన్ పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న శివానంద్.. ఎనిమిదో జన్మదినాన్ని సోమవారం జరుపుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. బీవీఎన్ పాఠశాలలో హిందీ ఉపాధ్యాయునిగా కొనసాగుతున్నాడు. నాలుగేళ్లకోసారి వచ్చే జన్మదినాన్ని ఘనంగా జరుపుకోవడం ఆనందంగా ఉందని చెబుతున్నాడాయన.
మొదటి పెళ్లి రోజు..
ఆర్మూర్ అర్బన్ : మాకు 2012 ఫిబ్రవరి 29న వివాహం జరిగింది. మాకు ఇద్దరు కుమారులు వినేశ్ సాయి, మోక్షిత్ సాయి. నాలుగు సంవత్సరాల తర్వాత మొదటి పెళ్లి రోజు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. మాకు వివాహం జరిగిన ఆలయంలో పెళ్లి రోజు వేడుకలను జరుపుకోవడానికి ప్రణాళిక చేసుకున్నాం. నాలుగు సంవత్సరాలకోసారి వచ్చే మా పెళ్లి రోజును ఘనంగా జరపడానికి మాకుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. - రాస ప్రసాద్, స్వర్ణలత, ఆర్మూర్
మర్చిపోలేని రోజు..
నాగిరెడ్డిపేట : అందరూ సంవత్సరానికి ఒక్కసారి పెళ్లిరోజు వేడుకలు జరుకుంటే మేము మాత్రం నాలుగేళ్లకు ఒకసారి పెళ్లిరోజు జరుపుకొంటాం. అందరికంటే భిన్నం గా ఉండాలనే ఫిబ్రవరి 29న పెళ్లి చేసుకున్నాం. నాలుగేళ్లకు ఒకసారి వచ్చే మా పెళ్లిరోజున ఉత్సాహంగా గడుపుతాం. పిల్లలతో కలిసి గుడికి వెళ్తాం. కుటుంబ సభ్యులతో కలిసి పెళ్లిరోజు వేడుకలను జరుపుకొంటాం. లీపు సంవత్సరం.. ఎవరూ మర్చిపోకుండా మా బంధువులంతా శుభాకాంక్షలు తెలుపుతారు. - బోయిని రాజశేఖర్, విజయలక్ష్మి, నాగిరెడ్డిపేట
థ్రిల్లింగ్‌గా ఉంది
మోర్తాడ్ : నా పేరు కొండ శంకర్. మాది తాళ్ల రాంపూర్. 1976 ఫిబ్రవరి 29న జన్మించా. నా వయస్సు 40 సంవత్సరాలు. కానీ, ఇప్పటివరకు 9 పుట్టిన రోజులే జరుపుకొన్నాను. ఇప్పుడు పదో పుట్టిన రోజును ఘనంగా నిర్వహించుకొనేందుకు సిద్ధమయ్యా. అందరికి ఏడాదికి ఒకసారి పుట్టిన రోజు వస్తే నాకు మాత్రం నాలుగేళ్లకు ఒకసారి వస్తుంది. ఇది ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంటుంది. రికార్డు ప్రకారం వయస్సు 40 ఏళ్లు అయినా జరుపుకొన్న పుట్టిన రోజులను పరిగణలోకి తీసుకుంటే నా వయస్సు నాలుగింతలు తగ్గుతుంది.
అదృష్టమే..!
బాన్సువాడ టౌన్ : ఈ అబ్బాయి పేరు దీక్షిత్‌కుమార్. బాన్సువాడ సంగమేశ్వర కాలనీకి చెందిన భాగ్యలక్ష్మి, విఠల్‌చారి దంపతుల కుమారుడు. అందరిలాగే ప్రతి సంవత్సరం పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాలని ఉన్నప్పటికీ, 2004 ఫిబ్రవరి 29న జన్మించడం వల్ల ఆ కోరిక తీరకుండా పోయింది. అయితేనేం, మర్చిపోలేని రోజున జన్మించడం ఎంతో అదృష్టం చెబుతున్నాడు దీక్షిత్. నాలుగేళ్లకొకసారి వచ్చే పుట్టిన రోజును తల్లిదండ్రులు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.