
11న రైతు కుటుంబాలతో మహాధర్నా
వామపక్షాల ప్రకటన
సాక్షి, హైదరాబాద్: రైతుల ఆత్మహత్యలు, వ్యవసాయ రంగంలో సంక్షోభ నివారణకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలతో వచ్చేనెల 11న ఇందిరాపార్కు వద్ద మహాధర్నాను నిర్వహిస్తామని వామపక్షా లు ప్రకటించాయి. వచ్చేనెల 5-11 తేదీల మధ్య ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను కలుసుకోనున్నట్లు తెలిపాయి. అసెంబ్లీ జరుగుతున్నా బాధిత కుటుంబాలకు నష్టపరిహారాన్ని చెల్లించే విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని ఈ పార్టీలు ఖండించాయి.
అసెంబ్లీ సమావేశాలు ముగి సేలోగా ఈ విషయంలో సానుకూలంగా స్పం దించాలని విజ్ఞప్తి చేసినా ప్రభుత్వంలో ఉలుకూ పలుకూ లేదని విమర్శించాయి. ఈనెల 29లోగా స్పష్టమైన ప్రకటన రాకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు దిగనున్నట్లు హె చ్చరించాయి. బుధవారం మఖ్దూంభవన్‌లో ఆర్‌ఎస్‌పీ నేత జానకిరాములు అధ్యక్షతన జరిగిన సమావేశంలో చాడవెంకటరెడ్డి (సీపీఐ), తమ్మినేని (సీపీఎం), వెంక టరామయ్య (న్యూడెమోక్రసీ), సురేందర్‌రెడ్డి (ఫార్వర్డ్‌బ్లాక్), కె.గోవర్దన్ (న్యూడెమోక్రసీ), గౌస్ (ఎంసీపీఐ), మురహరి (ఎస్‌యూసీఐ-సీ) పాల్గొన్నారు.