సాక్షి, హైదరాబాద్: కొడుకు, కోడలు తనను తన ఇంటినుంచి వెళ్లగొడితే అందరిలాగా ఆ వృద్ధురాలు మౌనంగా ఉండలేదు. పోలీసుల వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశారు. వారు కూడా పట్టిం చుకోలేదు. అయినా.. బెదరలేదు. తన ఖర్మ అని వదిలేయలేదు. ఫిర్యాదు తీసుకునేందుకు నిరాకరించిన పోలీసులపై న్యాయ పోరాటానికి దిగారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. కొడుకు, కోడలిపై ఆ వృద్ధురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదుచేసి దర్యాప్తు జరపాలని కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు పోలీసులను ఆదేశించింది. కొడుకు, కోడలి వద్దకు రోడ్డునపడ్డ ఆ వృద్ధురాలిని తిరిగి చేర్చాలని, రక్షణ కల్పించాలని న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు ఆదేశించారు.
కేపీహెచ్‌బీ కాలనీ అడ్డగుట్టలోని శ్రీనిలయంలో ఉంటున్న తనను తన కొడుకు, కోడలు గెంటేయడమే కాకుండా, చంపేందుకు సైతం ప్రయత్నించారని, వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు తనకు రక్షణ కల్పించేలా చూడాలంటూ వి.శివలక్ష్మీ కేపీహెచ్‌బీ పోలీసులకు గతేడాది అక్టోబర్ 31న రెండు వేర్వేరు ఫిర్యాదులు ఇచ్చారు. అయితే ఆ ఫిర్యాదులపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఆమె కేపీహెచ్‌బీ పోలీసులపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు విచారణ జరిపారు. శివలక్ష్మీ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, వృద్ధురాలని చూడకుండా కొడుకు, కోడలు ఇంటినుంచి బయటకు గెంటేశారని తెలిపారు. ఆమెను చంపేందుకు కూడా ప్రయత్నించారన్నారు. వారి తీరుపై ఫిర్యాదు చేయడమే కాకుండా తల్లిదండ్రులు, వృద్ధుల సంరక్షణ చట్టం కింద రక్షణ కల్పించాలని పోలీసులను కోరినా పట్టించుకోలేదన్నారు.
ఇకపై జాగ్రత్తగా చూసుకుంటాం
కొడుకు తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, తండ్రి కొనుగోలు చేసిన స్థలంలో నిర్మించిన అపార్ట్‌మెంట్‌లో తమ కుటుంబానికి ఆరు ఫ్లాట్లు వచ్చాయని, ఇందులో తల్లితో పాటు తమ ఇద్దరు సోదరులకు సైతం వాటా ఉందన్నారు. ఇందులో రెండు ఫ్లాట్లు అమ్మేశామని, మిగిలినవి ఉమ్మడి కుటుంబంగా ఉన్న తల్లి, తమ సోదరుల పేర్లపైనే ఉన్నాయన్నారు. ఇకపై తల్లిని జాగ్రత్తగా చూసుకుంటారన్నారు. పోలీసుల తరపు న్యాయవాది తమ వాదన వినిపిస్తూ.. పిటిషనర్ ఫిర్యాదుల ఆధారంగా గతేడాది నవంబర్ 24న కేసు నమోదు చేశారని, దర్యాప్తు కొనసాగుతోందని వివరించారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి.. ఇది ఉమ్మడి కుటుంబానికి సంబంధించి ఆస్తి వివాదం కాబట్టి, సంబంధిత న్యాయస్థానంలో తేల్చుకోవడం ఉత్తమమన్నారు. తల్లిని ఇకపై జాగ్రత్తగా చూసుకుంటామన్న కొడుకు నిర్ణయాన్ని స్వా గతిస్తూ.. ఆమె ఇంటిని ఆమెకిచ్చేందుకు ఎటువంటి అడ్డంకులు సృష్టించబోరని భావిస్తున్నట్లు తెలిపారు. ఆ వృద్ధురాలికి తగిన రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించారు.
ఓ అమ్మ విజయం
Published Sun, Mar 24 2019 2:59 AM | Last Updated on Sun, Mar 24 2019 2:59 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment