సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మినుముల ధర దారుణంగా పడిపోయింది. మద్దతుధర కన్నా ఏకంగా రెండు మూడు వేలు తక్కువగా పలుకుతోంది. మార్కెట్లో వ్యాపారులు మినుములు క్వింటాలుకు రూ.2,500 నుంచి రూ.4,615 వరకు మాత్రమే చెల్లిస్తుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత ఖరీఫ్‌లో 75 వేల ఎకరాల్లో మినుము పంట వేశారు. సాధారణ విస్తీర్ణంలో 95 శాతం వరకు సాగు జరిగింది.
మొత్తంగా 19 వేల టన్నుల మినుములు దిగుబడి రావచ్చని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఈ ప్రకారం ఇప్పటికే మినుములు మార్కెట్లోకి వస్తున్నాయి. కానీ దళారులు, వ్యాపారుల మాయాజాలంలో రైతులకు మద్దతు ధర దక్కడం లేదు. కేంద్రం మినుములకు రూ.5,400 మద్దతు ధర ప్రకటించగా.. అంతకన్నా రెండు మూడు వేలు తక్కువగా చెల్లిస్తుండటంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.
రంగంలోకి హరీశ్‌రావు
మినుములకు సరైన ధర దక్కని విషయం తెలుసుకున్న మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు చర్యలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తక్షణమే కొనుగోలు కేంద్రాలు తెరవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై మంగళవారం మార్కెటింగ్ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. బుధవారమే 14 ప్రాంతాలలో మినుముల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కామారెడ్డి జిల్లా మద్నూర్, జుక్కల్, బిచ్కుంద, పిట్లం, నిజామాబాద్ జిల్లాలో బోధన్, సంగారెడ్డి జిల్లాలో జహీరాబాద్, నారాయణఖేడ్ , వట్పల్లి, నిర్మల్ జిల్లాలో కుభీర్, భైంసా, జైనూర్, ముధోల్, వికారాబాద్ జిల్లా తాండూర్, వికారాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీలు, డీసీఎంఎస్‌లలో.. నాఫెడ్ తరఫున మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని ఆదేశించారు.
కేంద్ర ప్రభుత్వం మినుములకు మద్దతు ధరను సాధారణంగా అక్టోబర్ 1 నుంచి అమలు చేస్తుందని.. తమ విజ్ఞప్తి పట్ల సానుకూలంగా స్పందించి షెడ్యూల్ తేదీలకు మినహాయింపు ఇచ్చిందని హరీశ్‌రావు ఈ సందర్భంగా తెలి పారు. క్వింటాలు మినుములకు రూ.5,400 మద్దతు ధర ఉన్నందున... రైతులెవరూ తొందరపడి అంతకన్నా తక్కువ ధరకు అమ్ముకోవద్దని మంత్రి సూచించారు. నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా మినుములను కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని కోరారు. ఇక పెసర్ల కొనుగోలు విషయంలో నాఫెడ్ విధించిన నాణ్యతా ప్రమాణాలను సడలించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశామని తెలిపారు.
పత్తిని పర్యవేక్షించండి
పత్తి ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ ముగిసే వరకు జిల్లా కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలని హరీశ్‌రావు సూచించారు. ఖరీఫ్‌లో ఏయే ప్రాంతాల్లో ఎంత పత్తి పండించారో సమగ్ర వివరాలను అక్టోబర్ 5వ తేదీకల్లా పంపించాలని కలెక్టర్లను కోరారు. పత్తి రైతులు ఎటువంటి ఆందోళన చెందకుండా మార్కెట్లో అమ్ముకునేలా ఏర్పాట్లు చేశామన్నారు. మద్దతు ధర తగ్గిన వెంటనే పత్తి కొనుగోలుకు సీసీఐ ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు.
పత్తి రైతులకు గుర్తింపు కార్డులను జారీ చేయాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. ఇక గతంలో ఏర్పాటు చేసిన 84 మార్కెట్ కమిటీ కొనుగోలు కేంద్రాలకు అదనంగా జిన్నింగు మిల్లులున్న ప్రాంతాలలో 27 కేంద్రాల ఏర్పాటుకు సీసీఐ అంగీకరించినట్టు హరీశ్‌రావు తెలిపారు. పత్తి విక్రయించాక 48 నుం చి 72 గంటల్లోపు రైతుల ఖాతాలకు నేరుగా చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.