చిరుత చిక్కింది..
చిన్నశంకరంపేట (మెదక్): అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న గ్రామాల ప్రజలను కలవరపాటుకు గురిచేస్తున్న చిరుత ఎట్టకేలకు అటవీశాఖ అధికారుల ఎరకు చిక్కింది. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం కామారం అటవీ ప్రాంతంలో రెండు రోజుల క్రితం కామారం తండాకు చెందిన రైతు లంబాడి హరికి చెందిన లేగదూడను చిరుత హతమార్చింది. ఇది హైనానా...చిరుతనా తేల్చేందుకు అధికారులు ఆదివారం రాత్రి కామారం శివారులోని అటవీ ప్రాంతంలో మాటు వేశారు. బోనును ఏర్పాటు చేసి అందులో లేగదూడ కళేబరాన్ని ఉంచారు. రెండవ రోజు కూడ లేగదూడ మాంసం తినేందుకు వచ్చిన చిరుత బోనులోకి వెళ్లింది. అప్రమత్తమై న అధికారులు బోనులో చిరుతను బంధించి వల్లూర్ ఫారెస్టు అధికారులకు సమాచారం అందించారు. వారు ప్రత్యేక వాహనంలో చిరుతను పోచారం అభయారణ్యానికి తరలించారు.