సాక్షి, ఆదిలాబాద్: కోడలిని హత్య చేసిన కేసులో అత్తమామలతోపాటు కుటుంబ సభ్యులు ఏడుగురికి జీవిత ఖైదు విధిస్తూ ఎస్సీ, ఎస్టీ కోర్టు ప్రత్యేక జిల్లా అదనపు న్యాయమూర్తి జీవీఎన్ భరతలక్ష్మీ సంచలన తీర్పునిచ్చారు. లైజన్ అధికారి వెంకట్రావ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ పట్టణంలోని పిట్టల్‌వాడ కాలనీకి చెందిన శాలినికి ఇచ్చోడ మండలం గుండివాగు గ్రామానికి చెందిన బీఎస్‌ఎఫ్ జవాన్ పవార్ మస్నాజితో 2013లో వివాహం జరిగింది. 2015లో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. పెళ్లి సమయంలో పుట్టింటి వారు ఇచ్చిన వస్తువుల కోసం శాలిని, ఆమె తల్లి కానిస్టేబుల్ సర్దార్‌సింగ్‌తో కలిసి శాలిని అత్తగారింటికి వెళ్లారు. తమ కుమారుడి మృతికి కోడలే కారణమంటూ 2015 ఏప్రిల్ 13న శాలినిపై అత్తమామలు పవార్ లక్ష్మణ్, మతురబాయిలతోపాటు బావలు రమేశ్, సంజీవ్, బాలాజీ, తోడికోడళ్లు సులోచన, తానాబాయిలు కర్రలతో దాడి చేసి కిరోసిన్ పోసి నిప్పంటించారు. దీంతో శాలిని అక్కడికక్కడే మృతిచెందింది. ఆమె వెంట వెళ్లిన కానిస్టేబుల్‌ను బంధించి దాడికి పాల్పడ్డారు. శాలిని తల్లి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించడంతో నిందితులను అరెస్టు చేశారు. దాడిపై కానిస్టేబుల్ దరఖాస్తు ఇవ్వడంతో అప్పటి ఎస్సై సంజీవ్ కేసు నమోదు చేశారు. సీఐ మోహన్ చార్జీషీటు దాఖలు చేయగా, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మల్లికార్జున్ 24 మంది సాక్షులను విచారించారు. నేరం రుజువైనందున ఈ కేసుకు సంబంధించి సోమవారం ఎస్సీ, ఎస్టీ కోర్టు న్యాయమూర్తి భరతలక్ష్మీ ఏడుగురు నేరస్తులకు జీవిత ఖైదు శిక్షతోపాటు ఒక్కొక్కరికి రూ.20,500 జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment