అమరుల త్యాగాలను వృథాకానివ్వం
కరీంనగర్ : తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మబలిదానాలు చేసుకున్న అమరవీరుల త్యాగాలను వృథా కానివ్వబోమని.. ఈ విజయం అమరులకే అంకితమని రాష్ట్ర ఆర్థిక , పౌరసరఫరాల శాఖామంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మంగళవారం జిల్లాకు వచ్చిన ఆయనకు అడుగడుగునా అపూర్వ స్వాగతం లభించింది. జిల్లా సరిహద్దు శనిగరం నుంచి, బెజ్జంకి క్రాసింగ్, అల్గునూర్ వరకు దారిపొడవునా నాయకులు, ప్రజలు స్వాగతం పలికారు.
కరీంనగర్ బైపాస్ రోడ్ నుంచి తెలంగాణ చౌక్ వరకు స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో నగరంలో భారీ స్వాగత ర్యాలీ నిర్వహించారు. మహాత్మా జ్యోతిరావుపూలే, కోతిరాంపూర్‌లోని గాంధీ విగ్రహం, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి మంత్రి నివాళులర్పించారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన వేలాది మందితో ర్యాలీగా తెలంగాణ చౌక్‌కు చేరుకున్నారు. టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో ఈటెల రాజేందర్ మాట్లాడారు.
తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చింది కరీంనగర్ అని, కష్టకాలంలో జిల్లా ప్రజలు అండగా నిలిచారని కొనియాడారు. పద్నాలుగేళ్లుగా కేసీఆర్ సారథ్యంలో అలుపెరగని పోరాటం చేసి రాష్ట్రం సాధించామని, ఈ విజయం తెలంగాణ బిడ్డలందరిదని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హమీని విస్మరించబోమని, అన్నింటిని అమలు చేసి చూపిస్తామని ఆయన స్పష్టం చేశారు. అధికారంతో అహంకారానికి పోకుండా అభివృద్ధే అజెండాగా పనిచేస్తామన్నారు. బలహీన వర్గాలకు ఇళ్లు, పెన్షన్లు, రుణమాఫీ, తదితర హామీలను నూరు శాతం అమలు చేస్తామన్నారు. అవినీతి లేని ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతామన్నారు.
కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. పద్నాలుగేళ్ల పాటు ప్రజాస్వామ్యబద్ధంగా, పార్లమెంటరీ పద్ధతుల్లో, రాజకీయ ప్రక్రియ ద్వారా తెలంగాణ సాధించామన్నారు. పోరాడిన వారికే ప్రజలు పట్టం కట్టారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయబోమని అన్నారు. ఈటెల, కేటీఆర్‌లకు మంత్రి పదవులు రావడం జిల్లాను అభివృద్ధికి శుభసూచకమన్నారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ సాధన కోసం ప్రజలు టీఆర్‌ఎస్‌కు అండగా నిలువాలని కోరారు. బహిరంగ సభలో పెద్దపలి ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు సోమారపు సత్యనారాయణ, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, బొడిగె శోభ, రసమయి బాలకిషన్, టీఆర్‌ఎస్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు తుల ఉమ, జిల్లా అధ్యక్షురాలు కఠారి రేవతీరావు, మాజీ ఎమ్మెల్సీ చెన్నాడి సుధాకర్‌రావు, నాయకులు అక్బర్ హుస్సేన్, సర్దార్ రవీందర్‌సింగ్, ఎడ్ల అశోక్, కట్ల సతీష్, కర్ర శ్రీహరి, సుంకె రవిశంకర్, చొప్పరి వేణు, చల్లా హరిశంకర్, గుగ్గిళ్లపు రమేష్ తదితరులు పాల్గొన్నారు.