ఈ అభిమానం మరువలేను...
వరంగల్ అంటే ఎంతో ఇష్టం
నగరానికి రావడం రెండో సారి
మోడలింగ్ రంగం నుంచి సినిమాల్లోకి వచ్చా... హీరోయిన్ తాప్సీ
‘వరంగల్ అంటే నాకు ఎంతో ఇష్టం.. ఇక్కడి ప్రజలు చూపించే అభిమానం ఎప్పటికీ మరువలేను. నేను రెండు సార్లు ఇక్కడకు వచ్చినా ప్రతీసారి వేల సంఖ్యలో అభిమానులు నన్ను చూసేందుకు వచ్చారు.. అయితే, వరంగల్‌లో ఎన్నో చారిత్రక ప్రదేశాలు ఉన్నాయని తెలిసినా చూడడానికి సమయం చిక్కడం లేదు. మరోసారి వీలు చూసుకుని వచ్చి అన్ని ప్రదేశాలను చూస్తాను’ అని చెప్పుకొచ్చారు సినీ హీరోయిన్ తాప్సీ. 9669 ప్రొడక్షన్ ప్రతినిధి వినోద్‌రెడ్డి నేతృత్వంలో శుక్రవారం నిర్వహించిన ఓ ప్రైవేట్ యాడ్ షూటింగ్‌లో పాల్గొనేందుకు వరంగల్ వచ్చిన ఆమె ఎక్స్‌క్లూజివ్‌గా ‘సాక్షి’తో మాట్లాడారు. ఈ మేరకు తాప్సీ చెప్పిన సంగతులు ఆమె మాటల్లోనే... - పోచమ్మమైదాన్
ఆదరణ అపూర్వం..
వరంగల్‌కు రావడం ఇది రెండో సారి. గతంలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి వచ్చాను. అప్పుడు ఎంతోమంది అభిమానులు నన్ను చూసేందుకు వచ్చారు. నా కోసం గంటల తరబడి వేచి ఉన్నారు. అలా వారు చూపించిన ఆదరణను ఎప్పటికీ మరిచిపోలేను. అందుకే వరంగల్ అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడున్న పర్యాటక ప్రాంతాల గురించి అందరూ ఎంతో గొప్పగా చెప్పుకుంటారు. కానీ బిజీ షెడ్యూల్‌తో చూడలేకపోతున్నా. మరోసారి తీరికగా వచ్చి వేయిస్తంభాల గుడి, ఖిలా వరంగల్, రామప్ప, లక్నవరం తప్పక సందర్శిస్తాను.
మోడలింగ్ అంటే నాకు మొదటి నుంచి ఇష్టం. 2008లో మిస్ ఇండియా కాంటెస్ట్‌లో 28 మంది ఫైనలిస్టుల్లో ఒకరిగా నిలిచా. మిస్ బెస్ట్ స్క్రీన్, ఫ్రెష్ ఫేస్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు గెలుచుకున్నా. డిగ్రీ పూర్తయ్యూక నీకిష్టమైన రంగంలోకి వెళ్లమని నాన్న చెప్పారు. దీంతో బీటెక్ పూర్తి చేశాక మోడలింగ్ రంగంలోకి వచ్చాను. సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాబ్ వచ్చినా వెళ్లలేదు. ఆ సమయంలోనే కె.రాఘవేంద్రరావు తన సినిమా కోసం హీరోయిన్ కోసం వెదుకుతున్నారని తెలిసి అడిషన్‌కు వెళ్లాను. నన్ను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. అలా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సార్ సినిమాలో హీరోయిన్ పాత్ర దక్కడం నా లక్కీ. ఇక ఓసారి నా జీవితంలో మరిచిపోలేని సంఘటన గురించి చెప్పాలి వస్తే.. ‘గుండెల్లో గోదారి’ సినిమా షూటింగ్ కోసం పాలకొల్లు వెళ్లే సరికి అక్కడ ఎవరూ లేరు. నేను కారు దిగే సమయానికి వేల సంఖ్యలో గుమిగూడారు. నాకు అంత మంది అభిమానులు ఉన్నారని అప్పుడే తెలిసింది. షూటింగ్ జరుగుతున్నప్పుడు రాత్రయినా సరే గంటల తరబడి నిల్చుని చూసేవారు.
ఆత్మవిశ్వాసంతోనే విజయం
ప్రతీ ఒక్కరూ ఆత్మవిశ్వాసంతో ఉండాలి. నేను ఎంచుకున్న రంగంలో రాణిస్తాననేపట్టుదల ఉండాలి. వీటికి తోడు మనం ఎంచుకున్నది మంచి మార్గమై ఉండి.. కష్టపడి తత్వం కలిగే ఉంటే విజయం తప్పక వరిస్తుంది. నేను ఇప్పటి వరకు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో 24 సినిమాల్లో నటించాను. మరో రెండు సినిమాలకు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.