11 నెలల్లోనే రూ. 11,450 కోట్ల ‘మద్యం’ విక్రయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మందుబాబుల జోరుతో మద్యం విక్రయాలకు కిక్కొచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పది జిల్లాల్లో సగటున నెలకు రూ. వెయ్యి కోట్లకుపైగా విలువైన ‘సుక్క’ అమ్ముడైంది. ఈ ఆర్థిక సంవత్సరం ముగింపునకు నెల ముందే (ఫిబ్రవరి నెలాఖరు వరకు) సుమారు రూ. 11,450 కోట్ల ఆదాయంతో ప్రభుత్వ ఖజానా గలగలలాడుతోంది. గత ఆర్థిక ఏడాది (2014-15) తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ (టీఎస్‌బీసీఎల్) రూ. 10,888 కోట్ల మద్యం అమ్మకాలు సాగించగా ఈ ఏడాది ఫిబ్రవరి నాటికే ఆ విక్రయాలను సంస్థ అధిగమించింది. ఈ నెలలో సాగే అమ్మకాలతో ఆదాయం రూ. 13 వేల కోట్లకు చేరవచ్చని అంచనా వేస్తున్నట్లు టీఎస్‌బీసీఎల్ అధికార వర్గాలు తెలిపాయి.
వేసవి ప్రభావం నేపథ్యంలో బీర్ల అమ్మకాలు ఈనెలలో పెరుగుతాయని భావిస్తున్నారు. మద్యం అమ్మకాల్లో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉండగా, అనూహ్యంగా ఆదిలాబాద్ రెండో స్థానంలో ఉండడం గమనార్హం. హైదరాబాద్ జిల్లా పరిధిలో రూ. 2,656 కోట్ల మద్యం అమ్మకాలు సాగగా ఆదిలాబాద్‌లో రూ. 1,629 కోట్ల విలువైన మద్యం అమ్ముడైంది. గుడుంబా విక్రయాలపై ఉక్కుపాదం మోపడం, మహారాష్ట్ర నుంచి దిగుమతి అయ్యే దేశీదారుకు అడ్డుకట్ట వేయడం వల్లే ఆదిలాబాద్‌లో మద్యం అమ్మకాలు భారీగా పెరిగినట్లు ఎక్సైజ్ వర్గాలు తెలిపాయి. రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లాలు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఖమ్మం జిల్లాలో సుంకం చెల్లించని మద్యం (ఎన్‌డీపీఎల్) అమ్మకాలు పెరిగినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అక్కడ అతితక్కువగా 553 కోట్ల మద్యమే అమ్ముడైంది.
రెవెన్యూ రూ. 3,484 కోట్లే..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 11 నెలల్లో ఎక్సైజ్‌శాఖకు మద్యం విక్రయాల ద్వారా రూ. 11,450 కోట్లు, లెసైన్సు ఫీజుల రూపంలో రూ. 1,752 కోట్లు, ప్రివిలేజ్ ఫీజు ద్వారా రూ. 351 కోట్లు వసూలైనా నికర ఆదాయం మాత్రం తక్కువగానే లభించింది. మద్యం విక్రయాల ద్వారా వచ్చిన మొత్తం ఆదాయం నుంచి ‘వ్యాట్ బై ఎక్సైజ్’ రూపంలో రూ. 7,269 కోట్లు వాణిజ్యపన్నులశాఖ ఖాతాకు బదిలీకాగా ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్)కి రూ. 204 కోట్లు జమయ్యాయి. ఇతర ఖర్చులు, చెల్లింపులుపోగా ఆబ్కారీశాఖకు నికరంగా రూ. 3,484 కోట్ల ఆదాయమే లభించింది.
గత 11 నెలల్లో జిల్లాలవారీగా మద్యం విక్రయాలు (రూ. కోట్లలో)
జిల్లా మద్యం అమ్మకాలు
హైదరాబాద్ 2,656
ఆదిలాబాద్ 1,629
కరీంనగర్ 654
ఖమ్మం 553
మెదక్ 773
మహబూబ్‌నగర్ 1,197
నల్లగొండ 841
నిజామాబాద్ 1,176
రంగారెడ్డి 1,261
వరంగల్ 709