సాక్షి, హైదరాబాద్: మందు బాబుల జేబులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ చిల్లు పెట్టింది. మద్యం ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పేదలు తాగే చీప్ లిక్కర్ నుంచి సంపన్నులు సేవించే ఖరీదైన మందు వరకు అన్ని బ్రాండ్ల ధరలను 10 నుంచి 30 శాతం వరకు పెంచేసింది. చీప్ లిక్కర్ ధరలు 30 శాతం వరకు పెంచడం గమనార్హం. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం.. సాధారణ మద్యంపై క్వార్టర్‌కు కనీసం రూ.20 చొప్పున పెరగ్గా, ప్రీమియం బ్రాండ్లపై రూ.40 వరకు పెరిగింది. ఇక బీర్ల ధరలను రూ.20, రూ.30 చొప్పున పెంచింది. విస్కీ, బ్రాందీ, రమ్, బీర్లు ఇలా అన్నిరకాల మద్యంపై పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని, అయితే మద్యం వ్యాపారులు ఇప్పటికే తీసుకున్న స్టాక్‌ను పాత ధరలకే అమ్మాల్సి ఉంటుందని, కొత్తగా బుధవారం నుంచి తీసుకునే స్టాక్‌కే కొత్త ధరలు వర్తిస్తాయని ఎక్సైజ్ వర్గాలు స్పష్టం చేశాయి.
బీర్ ‘భారమే’...
కనీసం ఒక్కో క్వార్టర్‌కు రూ.20 చొప్పున ధరలను పెంచగా, కొన్ని బ్రాండ్లకు ఇంకా ఎక్కువే పెంచారు. మొత్తం మీద సాధారణ మద్యం ప్రస్తుతమున్న ధరలతో పోలిస్తే 90 ఎంఎల్ రూ.10, క్వార్టర్ రూ.20, హాఫ్ బాటిల్ రూ.40, ఫుల్‌బాటిల్ రూ.80, లీటర్ బాటిల్ రూ.110 వరకు పెంచారు. కొన్ని ప్రీమియం బ్రాండ్ల ఫుల్ బాటిల్ ధర రూ.150 వరకు పెరిగాయి. యువత ఎక్కు వగా తీసుకునే బీర్ల ధరలనూ భారీగానే పెంచారు. గతంలో లైట్ బీర్ రూ.100 కాగా, ఇప్పుడు దాన్ని రూ.120 చేశారు. స్ట్రాంగ్ బీర్‌ను రూ.120 నుంచి 130కి పెంచగా, కొన్ని బ్రాండ్లు రూ.180 వరకు పెరిగాయి. చిన్న బీర్ల విషయానికి వస్తే రూ.60 ఉన్న బీరు 70కి, రూ.80 ఉన్న బీరు 90కి పెరిగింది. చీప్‌లిక్కర్ ధరలూ విపరీతంగా పెంచారు. డైమండ్, ఆర్‌కేఎస్, కేరళ, రైజోమ్ లాంటి బ్రాండ్లపై క్వార్టర్‌కు రూ.20 చొప్పున పెం చారు. అన్ని బ్రాండ్ల బ్రీజర్లపై రూ.30 వరకు పెంచారు.
గప్‌చుప్‌గా...
వాస్తవానికి మద్యం ధరలను పెంచాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉన్నప్పటికీ దీనికోసం మంత్రివర్గ ఉప సంఘం వేయాలని భావించింది. కానీ, ఉప సంఘం నియమించకుండానే, ఆ కమిటీ సిఫారసు లేకుండానే ఎక్సైజ్ అధికారులు గప్‌చుప్‌గా మద్యం ధరలను సవరించేశారు. సవరించిన ధరలను అమల్లోకి తెచ్చేందుకు ఎలాంటి సూచన లేకుండా సోమవారం నుంచే మద్యం డిపోల నుంచి సరఫరా నిలిపివేశారు. మంగళవారం కూడా వైన్‌షాప్‌లకు డిపోల నుంచి మద్యం ఇవ్వడం లేదని, బుధవారం నుంచే కొత్త స్టాక్ ఇస్తామని ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారి ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment