
బీర్లకు తగ్గిన క్రేజ్..!
నల్లగొండ : మద్యం ప్రియులు రూటుమార్చారు. మండు వేసవిలో లక్షల కొద్ది పెట్టెలు ఖాళీ కావాల్సిన బీర్లు బేజారెత్తాయి. ఏప్రిల్ పగటి పూట ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు చేరిన రోజుల్లో కూడా మద్యం ప్రియులు లిక్కర్ పైనే మక్కువ చూపించారు. గతేడాది ఏప్రిల్‌లో బీర్లు లక్షల పెట్టెల్లో ఖాళీగా కాగా...ఈ ఏడాది సేల్స్ తగ్గిపోయాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో లిక్కర్ సేల్స్ తో పోలిస్తే బీర్ల అమ్మకాలు 4.27 శాతానికి పడిపోయాయి. బీర్ల కంటే లిక్కర్ సేల్స్ పైనే ఎ క్సైజ్ శాఖ ప్రధానంగా దృష్టి కేంద్రీకరించడంతో ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరిగింది. ఒక్క ఏప్రిల్‌లోనే లిక్కర్ అమ్మకాలు 2.72 శాతం పెరగడంతో ప్రభుత్వానికి రూ.8.88 కోట్ల ఆదాయం అదనంగా సమకూరింది. అయితే కిందటి ఏడాదితో పోలిస్తే లిక్కర్, బీర్ల అమ్మకాల్లో కొన్ని సర్కిల్స్ వెనకబడటంతో ఎక్సైజ్ శాఖ కొంత ఆదాయాన్ని కోల్పోవాల్సి వచ్చింది.
రాబడి పెరిగింది...
గతేడాది ఏప్రిల్ 1 నుంచి 30 వరకు ఉమ్మడి జిల్లాలో బీర్లు, లిక్కర్ అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి వచ్చిన రాబడి రూ.137.84 కోట్లు. కాగా ఈ ఏడాది అదే రోజుల్లో బీర్లు, లిక్కర్ అమ్మకాలతో వచ్చిన ఆదాయం రూ.146.72 కోట్లు. ఈ లెక్కన గతేడాదితో పోలిస్తే రూ.8.88 కోట్ల ఆదాయం పెరిగిందని చెప్పొచ్చు. అయితే బీర్ల అమ్మకాలు 11, లిక్కర్ అమ్మకాల్లో నాలుగు సర్కిల్స్‌లో సేల్స్ పడిపోవడం ఎక్సైజ్ ఆదాయానికి గండి పడింది.
రాబడి పెరిగినా తగ్గిన సేల్స్...
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గతేడాది ఏప్రిల్ 1 నుంచి 30 వరకు లిక్కర్ 2,31,598 పెట్టెలు అమ్ముడయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి 30 వరకు మూడు జిల్లాల్లో కలిపి 2,37,900 పెట్టెలు పెరిగాయి. అయితే ఎక్సైజ్ సర్కిల్ వారీగా చూసినప్పుడు మాత్రం హుజూర్‌నగర్, నాంపల్లి, భువనగిరి, మోత్కూరు సర్కిల్స్‌లో లిక్కర్ సేల్స్ తగ్గుముఖం పట్టాయి.
11 సర్కిల్స్‌లో బీర్లు ఢమాల్...
నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలో 15 ఎక్సైజ్ సర్కిల్స్ ఉన్నాయి. వీటిల్లో 11 సర్కిల్స్‌లో బీర్లు సేల్స్ అమాంతగా పడిపోయాయి. గతేడాది ఏప్రిల్ 1 నుంచి 30 వరకు బీర్లు 5, 12,890 పెట్టెలు అమ్ముడవ్వగా... ఈ ఏడాది అదే రోజుల్లో 4,90,981 పెట్టెలకు పడిపోయాయి. ఈ లెక్కన గతేడాదితో పోలిస్తే బీర్లు 21,909 పెట్టెలు తగ్గాయి. సర్కిల్ వారీగా చూసినట్లయితే... అత్యధికంగా భువనగిరి, రామన్నపేట, మోత్కూరు, నకిరేకల్ సర్కిల్స్‌లో బీర్లు సేల్స్ 27.74 శాతం నుంచి 15.22 శాతానికి పడిపోయాయి. ఆ తర్వాతి స్థానాల్లో నల్లగొండ, దేవరకొండ, చండూరు, నాంపల్లి, సూర్యాపేట, హుజూర్‌నగర్, కోదాడ సర్కిల్స్‌లో బీర్ల అమ్మ కాలు 6.86 శాతం నుంచి 1.45 శాతం వరకు తగ్గాయి. గరిష్టంగా బీర్ల అమ్మకాలు మిర్యాలగూడ సర్కిల్‌లో 36.80 శాతం పెరిగాయి.