మెదక్‌లో ఫుల్‌ కిక్కు! | Liquor Shops Increase In Medak District | Sakshi
Sakshi News home page

మెదక్‌లో ఫుల్‌ కిక్కు!

Published Sat, Aug 17 2019 1:27 PM | Last Updated on Sat, Aug 17 2019 1:27 PM

Liquor Shops Increase In Medak District - Sakshi

వచ్చే నెలాఖరుతో మద్యం దుకాణాల కాలపరిమితి ముగియనుండడంతో నూతన మద్యం పాలసీపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. జిల్లాలో నూతనంగా ఆవిర్భవించిన మున్సిపాలిటీల్లో బార్ల ఏర్పాటుతోపాటు వైన్స్‌ దుకాణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. లైసెన్స్‌ ఫీజులను సైతం పెంచే 
యోచనలో సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వైన్స్‌ షాపులను దక్కించుకోవాలనే కోటి ఆశలతో ఉవ్విళ్లూరుతున్న వారితోపాటు మద్యం ప్రియులకు ‘ఫుల్‌ కిక్కే’ అని చెప్పొచ్చు.

సాక్షి, మెదక్‌: రాష్ట్ర ఖజానాకు ప్రధానంగా ఎక్సైజ్‌ శాఖ నుంచే ఆదాయం సమకూరుతోంది. ప్రతి రెండేళ్లకోసారి కొత్త పాలసీని రూపొందిస్తూ.. లైసెన్స్‌ల రూపేణా, మద్యం దుకాణాలు, బార్ల సంఖ్యను పెంచుతూ ఆదాయం పెంచుకోవడం ఆనవాయితీగా వస్తోంది. 2017 అక్టోబర్‌ ఒకటిన ప్రారంభమైన మద్యం దుకాణాలకు రెండేళ్ల కాలపరిమితి వచ్చే నెల 30తో ముగియనుంది. ఈ మేరకు నూతన ఎక్సైజ్‌ పాలసీని రూపొందించేందుకు సర్కారు సన్నాహాలు మొదలుపెట్టింది. ఆదాయం పెంచుకునే మార్గాలపై అన్వేషణ చేస్తున్న క్రమంలో జిల్లాల వారీగా నివేదికలు ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. ఈ సారి టెండర్ల లైసెన్స్‌ ఫీజులను పెంచేలా యోచిస్తున్నట్లు తెలిసింది. దీంతోపాటు కొత్త మద్యం దుకాణాలు, బార్లకు అనుమతులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. జిల్లాలో గతంలో మెదక్‌ మున్సిపాలిటీ మాత్రమే ఉండగా.. గత ఏడాది మూడు మున్సిపాలిటీలు కొత్త మద్యం పాలసీపై కసరత్తు షురూ తూప్రాన్, నర్సాపూర్, రామాయంపేట కొత్తగా ఆవిర్భవించాయి. వీటి పరిధిలో బార్‌ అండ్‌ రెస్టారెంట్ల ఏర్పాటుతోపాటు మద్యం దుకాణాల సంఖ్య పెంచే దశగా కసరత్తు సాగుతున్నట్లు తెలిసింది.

మద్యం వ్యాపారుల్లో ఉత్కంఠ
మద్యం దుకాణాల కాలపరిమితి నెలన్నర మాత్రమే మిగిలి ఉంది. వీటి గడువు ముగియక ముందే కొత్త పాలసీని ప్రకటించి టెండర్లను ఆహ్వానించాలి. ఈ మేరకు రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు ఇప్పటినుంచే విధివిధానాలను రూపొందించే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం. ఈ క్రమంలో కొత్తగా రానున్న ఎక్సైజ్‌ పాలసీపై మద్యం వ్యాపారుల్లో ఉత్కంఠ నెలకొంది. కాలపరిమితిని ఏడాదికి పరిమితం చేస్తారా.. రెండేళ్లకా.. లైసెన్స్‌ ఫీజు ఎంత పెంచుతారో వంటి అంశాలపై వ్యాపార వర్గాల్లో ఇప్పటికే చర్చ మొదలైంది.

వేలమా.. లాటరీనా..?
2015లో వేలం పాటల ద్వారా మద్యం దుకాణాలు కేటాయించారు. ఎక్కవ మొత్తంలో పాట పాడిన వారికి ఆయా దుకాణాలను కేటాయించేవారు. కొన్ని అనివార్య కారణాలతో ఈ విధానాన్ని 2017లో ప్రభుత్వం రద్దు చేసింది. ఒకే మద్యం షాపునకు ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వస్తుండడంతో షాపుల వారీగా లైసెన్స్‌ ఫీజును నిర్ధారించి.. లాటరీ పద్ధతిన మద్యం దుకాణాలు కేటాయించాలని పాలసీలో స్పష్టం చేసింది. ప్రస్తుతం వేలం పద్ధతిన కేటాయిస్తారా.. లక్కీ డ్రా అమలు చేస్తారా అనే అంశాలపై ప్రస్తుతం ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. దీనికి సంబంధించి మర్గదర్శకాల రూపకల్పనలో సంబంధిత శాఖ ఉన్నతాధికారులు నిమగ్నమయ్యారు.

పోటాపోటీ
జిల్లాలో ప్రస్తుతం 37 వైన్స్‌ దుకాణాలు, రెండు బార్‌ అండ్‌ రెస్టారెంట్లు ఉన్నాయి. రెండేళ క్రితం నిర్వహించిన టెండర్లకు 301 అప్లికేషన్లు వచ్చాయి. వీటి చార్జీలు, లైసెన్స్‌ ఫీజుల రూపేణా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు జిల్లా నుంచి రూ.3.01 కోట్లు సమకూరాయి. 2015లో ఒక్క మద్యం దుకాణానికి దరఖాస్తు రుసుం రూ.50 వేలు ఉండగా.. 2017లో రూ.లక్షకు పెంచారు. అయినప్పటికీ దరఖాస్తులు భారీగానే వచ్చాయి. ఈ సారి మద్యం దుకాణాలను పెంచనుండడంతో దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దరఖాస్తు ఫీజుతోపాటు టెండర్‌ రేటు పెంచే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న మద్యం దుకాణాల నిర్వాహకులకు వరుస ఎన్నికలు ఆర్థికంగా కలిసొచ్చాయి. లాభాల పంట పండటంతో వారు మళ్లీ తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. అయితే మద్యం వ్యాపారం లాభసాటిగా మారడంతో ఈ రంగంలోకి రావడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఈ సారి పోటీ తీవ్రంగా ఉండనున్నట్లు అధికారులతోపాటు మద్యం వ్యాపారులు అంచనా వేస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement