సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బుధవారం నుంచి మద్యం విక్రయాలు ప్రారంభిస్తున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. పొరుగు రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు తెరిచినందున ఇక్కడ తెరవకుంటే స్మగ్లింగ్ పెరిగే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ‘గుడుంబాను రూపుమాపి సాంఘిక దురాచారాలు లేకుండా చేయాలని చూశాం. ప్రత్యామ్నాయ ఉపాధి కోసం రూ.800 కోట్లు ఖర్చు చేశాం. కరోనా మూలంగా రాష్ట్రంలో మద్యం దుకాణాలు, బార్లు, పబ్బులు తదితరాలు బంద్ చేశాం. కేంద్రం మార్గదర్శకాలతో మన చుట్టూ ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు మద్యం దుకాణాలు తెరిచాయి. మన దగ్గర మద్యం దుకాణాలు మూసివేయడంతో గుడుంబా, సెకండ్స్ మద్యం విక్రయం ప్రారంభమైంది. మద్యం దుకాణాలు తెరవకుంటే స్మగ్లింగ్ పెరిగే అవకాశం ఉంది. మరోవైపు డిస్టిలరీ కంపెనీలు కూడా గొడవ చేస్తున్నాయి.
రాష్ట్రంలో 2,200 మద్యం దుకాణాలకు గానూ కంటైన్మెంట్ జోన్లలోని 15 దుకాణాలు మినహాయించి మిగిలిన అన్నింటినీ తెరుస్తాం. రెడ్‌జోన్ సహా అన్నిచోట్లా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలను బుధవారం నుంచి తెరుస్తాం. బార్లు, పబ్బులు, క్లబ్బులకు అనుమతి లేదు. చీప్ లిక్కర్‌పై 11 శాతం, మద్యంపై 16శాతం ధర అదనంగా పెంచుతున్నాం. లాక్‌డౌన్ తొలగించిన తర్వాత కూడా ఈ ధరలను తగ్గించేది లేదు. అమ్మేవారు, కొనుగోలు చేసేవారు భౌతిక దూరం, ఇతర నిబంధనలు పాటించాలి. నిబంధనలు పాటించకున్నా, మాస్క్‌లు లేకుండా కొనుగోలు చేసినా లైసెన్సులు రద్దు చేస్తాం. నో మాస్క్ నో లిక్కర్.. నో మాస్క్ నో గూడ్స్’నినాదం అమలు చేస్తాం’అని సీఎం తెలిపారు. చదవండి: తెలంగాణలో 29 దాకా లాక్‌డౌన్
Comments
Please login to add a commentAdd a comment