తెలంగాణలో మద్యానికి ఓకే! | Liquor Stores To Open In Telangana | Sakshi
Sakshi News home page

మద్యానికి ఓకే!

Published Tue, May 5 2020 2:37 AM | Last Updated on Tue, May 5 2020 8:12 AM

Liquor Stores To Open In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మద్యం ప్రియులకు శుభవార్త. రెండు మూడు రోజుల్లో రాష్ట్రంలో మద్యం దుకాణాలు తెరుచుకోబోతున్నాయి. కరోనా వైరస్‌ నియంత్రణ కోసం మార్చి 22న జనతా కర్ఫ్యూ సందర్భంగా మూతబడిన మద్యం దుకాణాలు లాక్‌డౌన్‌ కారణంగా ఇప్పటివరకు తెరుచుకోలేదు. అయితే, కేంద్రం ఇచ్చిన సడలింపుల నేపథ్యంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో మద్యం విక్రయాలను తాజాగా పునఃప్రారంభించారు. దీంతో రాష్ట్రంలోనూ మద్యం విక్రయాలు చేపట్టాలని సర్కారు నిర్ణయానికి వచ్చింది. లేకుంటే పొరుగు రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి అక్రమంగా మద్యం స్మగ్లింగ్‌ చేసే అవకాశం ఉండటంతోపాటు మద్యం తాగేందుకు ఇక్కడి ప్రజలు పొరుగు రాష్ట్రాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తారని, దీని ద్వారా అక్కడ నుంచి రాష్ట్రంలోకి కరోనా వైరస్‌ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు వచ్చాయి. ఈ కారణాలరీత్యా రాష్ట్రంలో కూడా మద్యం విక్రయాలు పునరుద్ధరించడం అనివార్యంగా మారిందని ప్రభుత్వవర్గాలు పేర్కొంటున్నాయి.

కరోనా వైరస్‌ నియంత్రణ కోసం రాష్ట్రంలో అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ మే 7తో ముగియనున్న సంగతి తెలిసిందే. దీనిని మరికొన్ని రోజులు పొడిగించే అంశంతో పాటు మద్యం విక్రయాలు, ఇతర సడలింపులపై మంగళవారం రాష్ట్రమంత్రివర్గం సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకోనుంది. రెడ్, ఆరెంజ్, గ్రీన్‌ జోన్ల పరిధిలోని అన్ని జిల్లాల్లో మద్యం దుకాణాలను తెరిచేందుకు కేంద్రం ఇప్పటికే అనుమతిచ్చింది. అయితే, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్‌ జిల్లాల్లో వైరస్‌ వ్యాప్తి ఉండడంతో అక్కడ ఎలాంటి సడలింపులు వద్దని రాష్ట్ర వైద్యశాఖ సిఫార్సు చేసిన నేపథ్యంలో ఈ జిల్లాల్లో మద్యం దుకాణాలు తిరిగి తెరుచుకుంటాయా? లేదా అన్న విషయంపై కొంత సందిగ్దత నెలకొని ఉంది. ఒకవేళ మంత్రివర్గం సానుకూలత వ్యక్తం చేస్తే.. కంటైన్మెంట్‌ జోన్ల పరిధిలోని ప్రాంతాలు మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మద్యం దుకాణాలు తిరిగి తెరుచుకునే అవకాశం ఉంది. లేకుంటే, ఈ నాలుగు జిల్లాలు మినహా రాష్ట్రంలోని మిగిలిన 29 జిల్లాల్లో మద్యం విక్రయాలు మే 6 లేదా 7 లేదా 8వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు అవసరమైన స్టాకు తరలింపు ప్రక్రియ మంగళవారం ప్రారంభించే అవకాశం ఉంది. చదవండి: లాక్‌డౌన్‌ ఎత్తేస్తే? 

కేబినెట్‌ ఎజెండా ఖరారు...
రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి అదుపులోకి రాకపోవడంతో లాక్‌డౌన్‌ పొడిగింపు అనివార్యంగా మారింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దేశవ్యాప్తంగా మే 17 వరకు లాక్‌డౌన్‌ను పొడిగించడంతో పాటు పలు కీలక విషయాల్లో సడలింపులను ప్రకటించింది. తెలంగాణలో సైతం లాక్‌డౌన్‌ పొడిగించడంతో పాటు కేంద్రం ప్రకటించిన కొత్త సడలింపుల అమలకు రాష్ట్రంలో ఉన్న అవకాశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. ఇందుకోసం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో సమావేశం కానుంది. మంత్రివర్గ సమావేశానికి సన్నాహకంగా సీఎం కేసీఆర్‌ సోమవారం వరుసగా రెండోరోజు ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. కేబినెట్‌ ఎజెండాను ఈ సందర్భంగా ఖరారు చేశారు.

కరోనా నియంత్రణకు రాష్ట్రంలో ఇప్పటివరకు తీసుకున్న చర్యలు ఏ మేరకు ఫలితాలిచ్చాయి? ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఎలా ఉంది? ఇకపై తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి? అన్న అంశాలను దృష్టిలో పెట్టుకుని లాక్‌డౌన్‌ పొడిగింపుపై మంగళవారం ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. మే 21 వరకు మరో రెండు వారాల పాటు లాక్‌డౌన్‌ పొడిగించే అవకాశాలు అధికంగా ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గకపోవడంతో లాక్‌డౌన్‌ పొడిగింపునకే అధిక శాతం ప్రజలు మొగ్గుచూపుతున్నారని వివిధ వర్గాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ప్రభుత్వం ఓ అంచనాకు వచ్చినట్టు తెలిసింది. చదవండి: విమానాల్లో ఇక దూరం దూరం 

సడలింపులే కీలకం..
రాష్ట్రంలో లాక్‌డౌన్‌ పొడిగింపు లాంఛనమే కాగా, కొత్తగా ప్రకటించనున్న సడలింపుల విషయంలోనే సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. మార్చి 23 నుంచి రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలు చేస్తుండడంతో పారిశ్రామిక, వ్యాపార, వాణిజ్య సముదాయాలు మూతబడి రాష్ట్రం ఆర్థికపరంగా తీవ్ర నష్టాలను ఎదుర్కొంటోంది. మరోవైపు కరోనా వైరస్‌ ప్రభావం లేని గ్రీన్, ఆరెంజ్‌ జోన్ల పరిధిలోని జిల్లాల్లో పరిశ్రమలు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు నిర్వహించుకోవడానికి అనుమతించాలని పారిశ్రామికవర్గాల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. భవన నిర్మాణ రంగ పనులకు ఇప్పటికే రాష్ట్రంలో సడలింపులు ఇవ్వగా.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పరిశ్రమల్లో ఉత్పత్తిని పునరుద్ధరించడం పట్ల సైతం ప్రభుత్వం సానుకూల వైఖరితో ఉన్నట్టు సమాచారం.

కేంద్ర ప్రకటించిన సడలింపుల మేరకు ఇప్పటికే పొరుగు రాష్ట్రాల్లో పరిశ్రమల్లో ఉత్పత్తిని పునరుద్ధరించారు. ఈ సమయంలో మన రాష్ట్రంలోని పరిశ్రమలు పడకేసి ఉంటే భవిష్యత్తులో పోటీ నుంచి కనుమరుగయ్యే ప్రమాదముంది. ఈ క్రమంలో పరిశ్రమల నిర్వహణ విషయంలో ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసే అవకాశాలున్నాయి. అలాగే పొరుగు రాష్ట్రాల్లో పగటిపూట ఎలాంటి ఆంక్షలు లేకుండా నిర్దేశించిన సీటింగ్‌ సామర్థ్యంతో ప్రైవేటు వాహనాలు అనుమతిస్తున్నారు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయాలు తీసుకోనుంది. చదవండి: రేషన్‌ తీసుకోని వారికి సాయం ఎలా?  

రాష్ట్ర ఆర్థికవ్యవస్థకు కీలకమైన ఐటీ, ఐటీ ఆధారిత సేవల రంగ పరిశ్రమల నిర్వహణకు అనుమతించడంతో పాటు మద్యం దుకాణాల పునరుద్ధరణపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు సేవలను పునరుద్ధరించేందుకు మరికొన్ని రోజులు వేచి చూస్తారని తెలుస్తోంది. ఆటోలు, ఆర్టీసీ బస్సులు వంటి ప్రజారవాణా సదుపాయాలను పునరుద్ధరిస్తే లాక్‌డౌన్‌ను అమలు చేయడం సాధ్యం కాదని అభిప్రాయం వ్యక్తమవుతోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement