
సహజీవనం చేస్తున్న యువతి ఆత్మహత్య
హైదరాబాద్: సహజీవనం చేస్తున్న యువకుడితో గొడవపడి ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. వివరాలు... మణిపూర్‌కు చెందిన యషోకి(25) బంజారాహిల్స్ రోడ్ నెం.10లోని సిటీ సెంటర్ మాల్‌లోని ఓపీఎం స్పాలో బ్యూటీషియన్. నందినగర్‌లో గది అద్దెకు తీసుకొని ఉంటున్న ఈమె కొంతకాలంగా మణిపూర్‌కి చెందిన యోర్జాట్ అనే యువకుడిని ప్రేమించి సహజీవనం చేస్తోంది.
ప్రతిరోజూ రాత్రి 12.30కి విధులకు ముగించుకొని ఇంటికి వచ్చేది. ఆమె వచ్చేసరికి యోర్జాట్ వంట చేసిపెట్టేవాడు. అయితే, మంగళవారం రాత్రి యోర్జాట్ వంట చేయకపోవడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఇంట్లో తిని ఖాళీగా కూర్చొనే నీవు కనీసం వంటకూడా చేయవా? అంటూ ఆమె అతడిని నిలదీయడంతో ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలోనే బుధవారం మధ్యాహ్నం గదిలో ఒంటరిగా ఉన్న యషోకి కిటికీ ఊచలకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.