సాక్షి, హైదరాబాద్: తూర్పు ఆఫ్రికా నుంచి బయల్దేరి భారత్‌కు చేరిన మిడతల దండు ప్రస్తుతం మహారాష్ట్రలోని నాగ్‌పూర్ వద్ద ఆగింది. తెలంగాణకు కేవలం 200 కిలోమీటర్ల దూరంలో ఈ దండు నాగ్‌పూర్, గోండియా జిల్లాల్లోని బత్తాయితోటలపై దాడి చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలోకి మిడతల దండు వస్తే ఎలా ఎదుర్కోవాలన్న విషయంలో ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల బృందం తన నివేదికను సీఎస్‌కు బుధవారం అందజేయనుంది. వీరితో పాటు ఉమ్మడి ఆదిలాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో బుధవారం బీఆర్కేభవన్‌లో సీఎస్ సమావేశమవుతారు. డీజీపీ మహేందర్‌రెడ్డి, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ ఫైర్ సర్వీసెస్ డీజీ, వ్యవసాయ–సహకార శాఖ కార్యదర్శి కూడా హాజరవుతారు. మరో మిడతల దండు యెమెన్ దేశం నుంచి బయల్దేరిందని, అవి ముంబైని చేరతాయంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.
రాష్ట్రానికి రాదు..!
మిడతల దండు ద్వారా రాష్ట్రానికి పొంచి ఉన్న ముప్పును ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల బృందం ఇప్పటికే అధ్యయనం చేసి ఒక అంచనాకు వచ్చింది. ఈ మేరకు నివేదికను కూడా సిద్ధం చేసింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. ప్రస్తుతం మహారాష్ట్రలోని నాగ్‌పూర్, గోండియా జిల్లాల్లోని పంటపొలాలు, బత్తాయి ఇతర పండ్ల తోటలపై తిష్టవేసిన ఈ దండు ఇప్పట్లో రాష్ట్రానికి వచ్చే అవకాశం లేదు. నైరుతి రుతుపవనాలు ప్రారంభమైన దరిమిలా.. గాలి దక్షిణం నుంచి ఉత్తరానికి వీస్తోంది. సాధారణంగా మిడతలు కూడా గాలివాటానికి అనుగుణం గానే తమ ప్రయాణాన్ని కొనసాగిస్తుంటాయి. అలాగే ప్రస్తుతం ఇవి ఉత్తర భారత్‌లోని మధ్యప్రదేశ్‌వైపు వెళ్లే అవకాశాలున్నాయి. తూర్పు ఆసియాలో మొదలైన ఈ దండు ప్రయాణం.. యెమెన్, ఇరాన్, పాకిస్తాన్ దేశాల మీదుగా భారత్‌లోని రాజస్తాన్ నుంచి ఇతర రాష్ట్రాల్లోకి చొచ్చుకొచ్చాయి. ఈ దండు ఇంతకుముందు రాజస్తాన్ వరకు ఒకసారి, మధ్యప్రదేశ్ వరకు ఒకసారి వచ్చాయని అధికారులు తెలిపారు. ఈ ఏడాది మాత్రమే మహారాష్ట్ర వరకు వచ్చాయి. ఏటేటా.. ఇవి దేశంలోకి మరింత లోపలికి చొచ్చుకువస్తున్నాయని తెలిపారు.
అంతేకాకుండా నాగ్‌పూర్ వెళ్లిన తెలంగాణ అధికారుల బృందం వీటిపై పూర్తిగా అధ్యయనం చేసింది. కొన్ని కీటకాలను బంధించి వాటి భౌతిక అంశాలు, జాతి, హానికారక లక్షణాలను అధ్యయనం చేసింది. అవి ఏ స్థాయిలో ప్రమాదకారులు, వాటి ప్రత్యుత్పత్తి కాలం, దాడి చేసే సామర్థ్యం, ఏ మందుకు లొంగుతాయి? అన్న విషయంపై నివేదికను రూపొందించినట్లు సమాచారం. కమిటీ సభ్యుడు రామగుండం కమిషనర్ సత్యనారాయణ ఆదేశాలతో ప్రత్యేక పోలీసుల బృందం ఈనెల 2వ తేదీ, 12వ తేదీల్లో నాగ్‌పూర్, గొండియాలో పర్యటించింది. అక్కడి పరిస్థితులపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి, వివరాలను మన వ్యవసాయ శాస్త్రవేత్తలకు అందజేశారు. ఇక ఒక్కో మిడతల దండు 15 కి.మీ. పొడవు, 3 కి.మీ. వెడల్పుతో ఉండి పంటలపై దాడి చేశాయి. మహారాష్ట్ర అధికారులు పురుగుల మందులు చల్లడంతో ఇవి 3 కి.మీ. పొడవైన చిన్న దండులుగా విడిపోయాయి. ఇటీవల అరేబియాలో సంభవించిన నిసర్గ్ తుఫాన్ వల్ల చాలా మిడతల దండులు మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్, చింద్వారా పంజాబ్ రాష్ట్రాల వైపునకు వెళ్లాయని సమాచారం. ప్రస్తుతం కొన్ని మాత్రమే మహారాష్ట్రలో మిగిలిపోయాయి.
అధికారులు రెడీ..
ఒకవేళ గాలి దిశ మారి.. తెలంగాణపై మిడతల దండు దాడి చేసే అవకాశాలున్న నేపథ్యంలో అధికారులు సిద్ధంగానే ఉన్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మంలోని పలు ప్రాంతాలతో పాటు గోదావరి పరీవాహక ప్రాంతాల్లో మిడతలు దాడి చేసే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో అధికారులు ఏరియల్ సర్వే చేశారు. ఇందుకోసం ఇప్పటికే ఆదిలాబాద్, కొమరంభీం–ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల సరిహద్దుల్లో అధికారులు పురుగుల మందులతో సిద్ధంగా ఉన్నారు. 15 వేల లీటర్ల మెలాథియన్, క్లోరోఫైరోపోస్, లాంబ్డా సహాలాత్రిన్‌ను అందుబాటులో ఉంచారు. ముఖ్యంగా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ సరిహద్దులను పంచుకునే చోట పిచికారీ చేసేందుకు ఫైరింజన్లు, జెట్టింగ్ యంత్రాలతో సిబ్బంది మోహరించారు.
Comments
Please login to add a commentAdd a comment