సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల బరిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రాష్ట్ర కాంగ్రెస్ సీని యర్లు సిద్ధమవుతున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలైన నేతలతోపాటు మొద టి నుంచి పార్లమెంటుకు వెళ్లాలన్న ఆలోచనతో ఉన్న నేతలు టికెట్ల కోసం పోటీ పడుతున్నట్లు సమాచారం. సీఎల్పీ నేత హోదాలో పనిచేసిన సీనియర్ నేత జానారెడ్డి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న రేవంత్‌రెడ్డి తదితరులు లోక్‌సభపై కన్నేశారని గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. ఈసారి లోక్‌సభ ఎన్నికల అభ్యర్థులను ఫిబ్రవరిలోనే ప్రకటిస్తారనే అంచనాల నేపథ్యంలో ఆశావహ నేతలు అప్పుడే ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ కూడా ప్రారంభించినట్టు తెలుస్తోంది. తమకు అనుకూలమైన అధిష్టానం పెద్దలను కలసి మనసులో మాట చెబుతున్నారని, అవకాశం ఇస్తే రాహుల్ నాయకత్వంలో లోక్‌సభలో పనిచేస్తామని వారిని ప్రసన్నం చేసుకుంటున్నారని సమాచారం. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో హైదరాబాద్, పెద్దపల్లి స్థానాల నుంచి పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోతుండటం గమనార్హం.
నియోజకవర్గాలవారీగా...
లోక్‌సభ నియోజకవర్గాలవారీగా పరిశీలిస్తే నల్లగొండ నుంచి మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సై అంటున్నారు. ఇటీవల జరిగిన పార్టీ సమీక్షా సమావేశానికి హైదరాబాద్ వచ్చిన ఆయన తాను నల్లగొండ ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు. కోమటిరెడ్డితోపాటు ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు సీనియర్ నేత జానారెడ్డి, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భార్య పద్మావతి కూడా మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. భువనగిరి స్థానం నుంచి నలుగురు నేతల పేర్లు వినిపిస్తున్నాయి. మొదటి నుంచీ ఈ స్థానాన్ని ఆశిస్తున్న టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డితోపాటు పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, జనగామ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి.
భువనగిరి పార్లమెంటరీ స్థానంపై గట్టి పట్టు ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఇక్కడి నుంచి వంగాల స్వామిగౌడ్‌ను ప్రతిపాదిస్తున్నారు. బీసీ సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉండటంతోపాటు స్వామిగౌడ్ స్థానికుడు కూడా కావడం కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి ఇటీవలే టీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి పోటీ చేసిన పటోళ్ల కార్తీక్‌రెడ్డితోపాటు కాసాని జ్ఞానేశ్వర్ పేర్లు వినిపిస్తున్నాయి. పాలమూరు పార్లమెంటు నుంచి సీనియర్ నేత ఎస్.జైపాల్‌రెడ్డితోపాటు ఆ పార్టీ ఫైర్‌బ్రాండ్ నేతలుగా గుర్తింపు పొందిన మాజీమంత్రి డి.కె.అరుణ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి పేర్లు తెరపైకి వస్తున్నాయి.
ఖమ్మం నుంచి రేణుకాచౌదరి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఆదిలాబాద్ నుంచి రమేశ్ రాథోడ్, నరేశ్ జాదవ్, మహబూబాబాద్ నుంచి బలరాంనాయక్, రవీంద్రనాయక్, బెల్లయ్యనాయక్, నాగర్‌కర్నూలు నుంచి నంది ఎల్లయ్య, మల్లు రవి, సంపత్, సికింద్రాబాద్ నుంచి అంజన్‌కుమార్ యాదవ్, అజారుద్దీన్, బండ కార్తీకరెడ్డి, మెదక్ నుంచి దామోదర రాజనర్సింహ, నిర్మలాజగ్గారెడ్డి, మల్కాజ్‌గిరి నుంచి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, రేణుకాచౌదరి, వరంగల్ నుంచి మాజీ ఎంపీలు రాజయ్య, విజయరామారావులతోపాటు ఇటీవలి ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన ఇందిర, నిజామాబాద్ నుంచి ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీగౌడ్, కరీంనగర్ నుంచి సీనియర్ నేత జీవన్‌రెడ్డి, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు నేరెళ్ల శారద, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, జహీరాబాద్ నుంచి సురేశ్‌షెట్కార్ పేర్లు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ స్థానం నుంచి మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌ను బరిలో దింపాలని అధిష్టానం భావిస్తు న్నా ఆయన సికింద్రాబాద్ స్థానంపై కన్నేసినట్టు తెలుస్తోంది. హైదరాబాద్, పెద్దపల్లిల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు నేతలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్లలో ఎంతమంది ఆశలు ఫలిస్తాయో.. ఎవరు లోక్‌సభకు ఎన్నికవుతారో వేచిచూడాల్సిందే!
నష్టాన్నిపూడ్చుకునేపనిలో
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంతటి ఘోర పరాజయం పొందిందో అంతే ఘోర పరాభవాన్ని ఆ పార్టీ సీనియర్లు మూటకట్టుకున్నారు. జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డి.కె.అరుణ, గీతారెడ్డి, షబ్బీర్ అలీ, దామోదర రాజనర్సింహ, జీవన్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి.. ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు 20 మంది సీనియర్ నేతలు అనూహ్యంగా ఓటమిపాలయ్యారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన రాజకీయనష్టాన్ని పూడ్చుకునేందుకు లోక్‌సభ ఎన్నికలను వేదికగా మార్చుకోవాలని చాలామంది సీనియర్లు ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఓటమి పాలయ్యామనే సానుభూతి మరవకముందే లోక్‌సభ ఎన్నికలు వస్తుండటం, గతంలో ఉన్న ఛరిష్మా, సాధారణంగా జాతీయ పార్టీగా కాంగ్రెస్‌కు పార్లమెంటు ఎన్నికల్లో ఉండే సానుకూలతలు కలిసి వస్తాయనే అంచనాతో లోక్‌సభ బరిలో దిగేందుకు ఆసక్తి చూపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment