
మంత్రులు, ఎమ్మెల్యేలతో లోకేశ్ సమీక్ష
ధాన్యం సేకరణ, మద్దతు ధరపై సమావేశం.. చంద్రబాబు విదేశీ పర్యటన నేపథ్యంలో తెరపైకి..
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్లడంతో ఆయన తనయుడు లోకేశ్ అధికారిక కార్యక్రమాలను సమీక్షించారు. అదీ తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో.. మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు హాజరైన సమావేశంలో ధాన్యం సేకరణ, మద్దతు ధర అంశాలపై సమీక్ష జరిపారు. మంగళవారం నిర్వహించే ఈ సమావేశానికి రావాలని వ్యవసాయ, పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులను కూడా ఆదేశించినా వారు నిరాకరించారు.
మంత్రులు సచివాలయంలోని తమ చాంబర్‌లో సమావేశం నిర్వహిస్తే తాము వచ్చి ధాన్యం సేకరణ, మద్దతు ధరపై వివరాలు ఇస్తామని, అది తమ బాధ్యత అని, అందులో ఎవరు పాల్గొంటారన్నది తమకు అనవసరమని వారు స్పష్టం చేసినట్లు తెలిసింది. అయితే మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పరిటాల సునీత, కింజరాపు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రలతో పాటు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పయ్యావుల కేశవ్, ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్రకుమార్, కాగిత వెంకట్రావు, తోట త్రిమూర్తులు, కురుకొండ రామకృష్ణ, కొమ్మాలపాటి శ్రీధర్, బోడే ప్రసాద్, ఎన్.రామానాయుడు, గుండా లక్ష్మీదేవి, పార్టీ నేతలు టీడీ జనార్దనరావు, వి.జయరామిరెడ్డి, వీవీవీ చౌదరి తదితరులు పాల్గొన్నారు.
ఈ నెల మూడో తేదీన పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం సంద ర్భంగా.. రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర రాకపోవటం, సేకరణలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రస్తావనకొచ్చాయి. రైతుల సమస్యలపై చర్చించేందుకు మంత్రులు, పార్టీ నేతలతో కమిటీ ఏర్పాటు చేస్తున్నానని, వారు చర్చించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని ఆ సందర్భంగా చంద్రబాబు చెప్పారు. చంద్రబాబు మంగళవారం తెల్లవారుజామున ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్లిన నేపథ్యంలో.. ఇప్పుడు అదే కమిటీతో లోకేశ్ సమీక్ష నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు స్థానికంగా ధాన్యం సేకరణకు ఎదురవుతున్న ఇబ్బందులను వివరించారు. భారీ స్థాయిలో ధాన్యం సేకరిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఖరీఫ్ సీజన్‌లో పండిన పంటలో చాలా భాగం ఇంకా రైతుల వద్దే ఉందని తెలిపారు. కాగా లోకేశ్ ధాన్యం సేకరణకు సంబంధించి పార్టీ కార్యకర్తలు, రైతుల నుంచి సేకరించిన సమాచారాన్ని సమావేశంలో ప్రస్తావించారు.