కామారెడ్డి దేవునిపల్లిలోని ఓ బ్యాంక్ వద్ద భౌతిక దూరం పాటిస్తూ కూర్చున్న మహిళలు
సాక్షి, కామారెడ్డి: ప్రభుత్వం ప్రకటించిన కరోనా సాయాన్ని తీసుకునేందుకు ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఖాతాల్లో జమ అయిన రూ.1500 కోసం బ్యాంకుల వద్ద బారులు తీరుతున్నారు. ఎర్రటి ఎండలో బారులు తీరుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. డబ్బుల కోసం శుక్రవారం రామారెడ్డిలోని బ్యాంకు వద్ద క్యూలో నిలుచున్న ఓ మహిళ గుండెపోటుతో మృతి చెందడం కలకలం రేపింది. లాక్‌డౌన్ సమయంలో పేదలు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం కరోనా ప్యాకేజీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒక్కో మనిషికి 12 కిలోల చొప్పున ఉచితం బియ్యంతో పాటు రేషన్‌కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ.1500 చొప్పున ఇస్తున్నట్లు ప్రకటించింది.
ఇప్పటికే చాలా మంది ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. అయితే, అంతకుముందు జన్‌ధన్ ఖాతాల్లో జమ అయిన డబ్బులు తీసుకోకుంటే పోతాయన్న వదంతులతో బ్యాంకులకు జనం పరుగులు తీసినట్టే.. ఇప్పుడు కూడా బ్యాంకులకు పరుగులు పెట్టారు. దీంతో బ్యాంకుల వద్ద జనం బారులు తీరుతున్నారు. బ్యాంకు దగ్గరికి ఉదయమే వచ్చి ఎండల్లో క్యూ కడుతున్నారు. కొన్ని బ్యాంకుల దగ్గర టెంట్లు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ వందలాది మంది తరలివస్తుండడంతో టెంట్లు ఏమాత్రం సరిపోవడం లేదు. దానికితోడు భౌతికదూరం కూడా పాటించే పరిస్థితులు కూడా లేకుండాపోయాయి. ఈ క్రమంలో డబ్బుల కోసం శుక్రవారం బ్యాంకుకు వెళ్లిన రామారెడ్డి మండలం కన్నాపూర్ తండాకు చెందిన అంగోత్ కమల (45) గుండెపోటుతో కుప్పకూలి, క్షణాల్లో ప్రాణాలు కోల్పోయింది.
జిల్లాలో మొత్తం 2,48,913 రేషన్‌కార్డులు ఉన్నాయి. ఇప్పటివరకు 2,20,030 రేషన్ కార్డు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రూ.1500 చొప్పున రూ.30 కోట్లు జమ అయ్యాయి. మిగతా వారి ఖాతాల్లో ఇంకా రూ.7.33 కోట్లు జమ చేయాల్సి ఉందని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కొండల్‌రావ్ ‘సాక్షి’కి తెలిపారు. మిగతా వారి బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం కాకపోవడం, ఇతర కారణాలతో జమ కాలేదని, వారి ఖాతా నెంబర్లు సేకరించి జమ చేయనున్నట్లు పేర్కొన్నారు.
డబ్బుల కోసం ఆగమాగం..
బ్యాంకు ఖాతాల్లో జమ అయిన సొమ్ము ఎక్కడికి పోదని తెలిసినా రకరకాల వదంతుల నేపథ్యంలో ప్రజలు బ్యాంకుల వద్దకు పరుగెడుతున్నారు. కొందరు చేతిలో డబ్బులు లేక తమ ఖాతాల్లో జమ అయిన డబ్బులు తీసుకునేందుకు వెళ్తుండగా, మరికొందరు ఖాతా నుంచి డబ్బులు తీసుకోకుంటే వాపస్ పోతాయన్న వదంతులతో హైరానా పడుతున్నారు. దీంతో వచ్చిన డబ్బులు వెంటనే తీసుకోవాలన్న ఆరాటంతో బ్యాంకులకు పరుగులు తీస్తున్నారు. కొన్ని మండలాల్లో పది, పదిహేను గ్రామాలకు ఒక బ్యాంకు ఉంది. దీంతో అక్కడ భారీ క్యూలు ఉంటున్నాయి. పొద్దంతా ఎండలో నిల్చునే ఓపిక లేక వరుసల్లో చెప్పులు పెడుతున్నారు.
(చదవండి : ఎర్రటి ఎండలో.. బ్యాంకుల వద్ద పరిస్థితి ఇదే!)
భౌతిక దూ.. రం..
కరోనా కట్టడికి భౌతికి దూరం పాటించాలన్న ప్రభుత్వ ఆదేశాలు బ్యాంకుల వద్ద పెద్దగా కనిపించడం లేదు. కొన్ని చోట్ల బ్యాంకు సిబ్బంది, పోలీసులు చొరవ తీసుకుని వరుస క్రమంలో పంపిస్తున్నారు. కొన్నిబ్యాంకుల వద్ద ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో వందలాది మంది జనం గుమిగూడుతున్నారు. చాలా మంది ముఖానికి మాస్కులు గాని, టవల్స్ గాని కట్టుకోవడం లేదు. డబ్బులు అవసరం ఉన్న వారు బ్యాంకుకు రావడం వేరుగాని, అవసరం లేని వారు కూడా వచ్చి వరుస కడుతుండడంతో ఏ బ్యాంకు వద్ద చూసినా జాతరను తలపిస్తోంది.
ఓ వైపు కరోనా.. మరోవైపు ఎండ
ఇప్పటికే జిల్లాలో కరోనా భయం వెన్నాడుతుండగా, మరోవైపు ఎండలు తీవ్రమయ్యాయి. జిల్లా అంతటా దాదాపు 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు దా టాయి. ఉదయం తొమ్మిది నుంచే భానుడు భగభగమంటున్నాడు. ఈ క్రమంలో జనం ఎండల్లో అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే డబ్బు లు తీసుకోకుంటే వాపస్ పోతాయన్న భయంతోనే ప్రజలు బ్యాంకులకు పరుగులు తీస్తున్నారు. ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి అధికా రులు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment