చర్చలు విఫలం.. లారీల సమ్మె ఉధృతం | Lorry Owners Association Telangana huge strike today onwards | Sakshi
Sakshi News home page

చర్చలు విఫలం.. లారీల సమ్మె ఉధృతం

Published Tue, Apr 4 2017 2:23 AM | Last Updated on Tue, Sep 5 2017 7:51 AM

చంద్రబాబు దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహిస్తున్న తెలంగాణ స్టేట్‌ లారీ ఓనర్స్‌

చంద్రబాబు దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహిస్తున్న తెలంగాణ స్టేట్‌ లారీ ఓనర్స్‌

8 నుంచి దేశవ్యాప్త సమ్మె
అత్యవసర వస్తువుల రవాణాను నిలిపివేస్తాం
లారీ సంఘాల హెచ్చరిక  


సాక్షి, హైదరాబాద్‌: లారీ యాజమాన్య సంఘాలతో బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ సోమవారం జరిపిన చర్చలు విఫల మయ్యాయి. దీంతో గత ఐదు రోజులుగా కొనసాగుతున్న సమ్మెను ఉధృతం చేయను న్నట్లు దక్షిణాది రాష్ట్రాల లారీ యజమానుల సంఘం, తెలంగాణ లారీ ఓనర్స్‌ అసోసి యేషన్‌ ప్రకటించాయి. ఈ నెల 8 నుంచి దేశవ్యాప్తంగా సమ్మె చేపట్టనున్నట్లు తెలి పాయి. ప్రైవేట్‌ బీమా సంస్థల ప్రయోజనాల కోసమే అన్ని రకాల వాహనాలపై బీమా మొత్తాన్ని పెంచారంటూ లారీ సంఘాలు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. గత నెల 30 నుంచి ప్రారంభమైన సమ్మెతో హైదరాబాద్‌ కు నిత్యావసర వస్తువుల రవాణా పూర్తిగా స్తంభించింది, రాజధానిలో భవన నిర్మాణ రంగానికి అవసరమైన ఇసుక రవాణా కూడా ఆగిపోయింది. వనస్థలిపురం, ఆటోనగర్, మూసాపేట్, ఔటర్‌రింగు రోడ్డు, తదితర ప్రాంతాల్లో లారీ సంఘాలు పెద్దఎత్తున ఆందోళన కొనసాగిస్తున్నాయి.

బీమా మొత్తమే ప్రధానం...
వాహనాలపై బీమా మొత్తాన్ని ఏకంగా 41% పెంచడానికి వ్యతిరేకంగా చేపట్టిన ఈ సమ్మె నేపథ్యంలో సోమవారమిక్కడ బషీర్‌బాగ్‌ లోని పరిశ్రమల భవన్‌ ఐఆర్‌డీఏ కార్యా లయంలో చైర్మన్‌ విజయన్, ప్రతినిధుల బృందం లారీ సంఘాల ప్రతినిధులతో చర్చ లు జరిపింది. పెంచిన బీమాను ఉపసంహ రించుకోవాలని లారీ సంఘాలు కోరాయి.  లారీ సంఘాల డిమాండ్‌లపై ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని ఐఆర్‌డీఏ చైర్మన్‌ విజయన్‌ స్పష్టం చేశారు. ఈ కమిటీలో లారీ సంఘాల ప్రతినిధులు కూడా ఉంటారని తెలిపారు. కమిటీ ఏర్పాటుపై సుముఖత వ్యక్తం చేసిన లారీ సంఘాలు అప్పటి వరకు బీమా పెంపును నిలిపివేయాలని కోరాయి. అయితే ఇప్పటికే అది అమల్లోకి వచ్చినందున నిలిపివేయడం సాధ్యం కాదని విజయన్‌ తెలిపారు.

ఇందుకు నిరసన తెలుపుతూ లారీ సంఘాల ప్రతినిధులు చర్చలను బహిష్క రించి బయటకు వచ్చారు. సమ్మెను మరింత ఉధృతం చేయనున్నట్లు తెలంగాణ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు భాస్కర్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాలకే పరి మితమైన సమ్మెను ఈ నెల 8 నుంచి ‘చక్రా బంద్‌’ పేరుతో దేశవ్యాప్తంగా విస్తరించాలని నిర్ణయించామన్నారు. ప్రస్తుతం తమ సమ్మె పారిశ్రామిక రంగానికి చెందిన ముడి సరుకులు, నిత్యావసర వస్తువుల రవాణాకు పరిమితమైందని, 6వ తేదీ నుంచి అత్యవసర వస్తువులైన పాలు, నీళ్లు, కూరగాయలు, మందులు, పెట్రోల్, డీజిల్‌ వంటి వస్తువుల రవాణాను కూడా నిలిపివేయనున్నట్లు తెలి పారు. 4వ తేదీ నుంచే అత్యవసర వస్తువుల సరఫరాను బంద్‌ చేయాలని అనుకున్నప్పటికీ 5న శ్రీరామనవమి ఉన్న దృష్ట్యా 6 నుంచి నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొ న్నారు. మంగళవారం నుంచి రాస్తారోకోలు, వంటావార్పు, ధర్నాలు, ర్యాలీలు వంటి నిరసన కార్యక్రమాలతో సమ్మెను ఉధృతం చేయనున్నట్లు పేర్కొన్నారు.

చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం
ఒడిశా, కర్ణాటక, మహారాష్ట్రలకు కౌంటర్‌ పర్మిట్లు ఇచ్చిన ఏపీ ప్రభుత్వం తెలంగాణకు మాత్రం ఇవ్వకపోవడం దారుణమని తెలం గాణ స్టేట్‌ లారీ ఓనర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు బూడిద నందారెడ్డి అన్నారు. ఇందుకు నిరసనగా ఆటోనగర్‌ వద్ద ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. కాగా లారీల సమ్మె ప్రభావం నిత్యావసర సరుకు లపై పడింది. హోల్‌సేల్‌ ధరల్లో 10–15% పెరుగుదల కనిపించింది. సమ్మె వల్ల మహా రాష్ట్ర నుంచి వచ్చే సరుకు రవాణా వాహనా లను జహీరాబాద్‌ వద్ద నిలిపివేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement