సాక్షి, హైదరాబాద్: వస్తు సేవల పన్ను, ఇంధన ధరల పెంపునకు వ్యతిరేకంగా తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ చేపట్టిన రెండు రోజుల సమ్మెతో సోమవారం హైదరాబాద్‌లో సుమారు ఐదు వేల లారీలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో నిత్యావసర వస్తువులు, వివిధ రకాల ముడిసరుకు రవాణాకు బ్రేక్ పడింది. ఆదివారం అర్ధరాత్రి వరకు బుకింగ్‌లు చేసుకుని రోడ్డెక్కిన లారీలు మినహా మిగతావన్నీ ఆగిపోయాయి. వస్తువుల లోడింగ్, అన్‌లోడింగ్‌లను కూడా నిలిపివేశారు.
దీంతో హైదరాబాద్‌లోని ఉస్మాన్‌గంజ్, మహరాజ్‌గంజ్, బేగంబజార్, అబిడ్స్, కోఠి, దిల్‌సుఖ్‌నగర్, సికింద్రాబాద్, జనరల్‌బజార్, మోండా, రాణిగంజ్ తదితర ప్రాంతాల్లో సమ్మె ప్రభావం కనిపించింది. అత్యవసర వస్తువులు మినహా ఇతర అన్ని రకాల వస్తువుల సరఫరాను లారీ సంఘాలు అడ్డుకున్నాయి. మంగళవారం కూడా సమ్మె కొనసాగనుండడంతో కొన్ని రకాల వస్తువుల ధరలపైన ప్రభావం పడే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి.
నగరంలోని కూకట్‌పల్లి, మూసారాంబాగ్, ఎల్‌బీనగర్, ఆటోనగర్ తదితర ప్రాంతాల్లో లారీ యాజమాన్య సంఘాలు ఆందోళనకు దిగాయి. జీఎస్‌టీకి వ్యతిరేకంగా ఆల్ ఇండియా మోటారు ట్రాన్స్‌పోర్ట్ కాంగ్రెస్, సౌత్ ఇండియా మోటార్ ట్రాన్స్‌పోర్ట్స్ అసోసియేషన్ తదితర సంస్థల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా చేపట్టిన రెండు రోజుల లారీ సమ్మెలో భాగంగా తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ హైదరాబాద్‌లో సమ్మెకు దిగింది. విజయవాడ జాతీయ రహదారిపై చేపట్టిన నిరసన కార్యక్రమంలో లారీ యాజమాన్య సంఘాల ప్రతినిధులు, ఓనర్లు పాల్గొని నిరసన తెలిపారు.
ఆగిపోయిన 90 శాతం బుకింగ్‌లు..
సరుకు రవాణా రంగంలో సుమారు 2 లక్షల లారీలు రాకపోకలు సాగిస్తుండగా, ఒక్క హైదరాబాద్‌లోనే రోజూ సుమారు 5,000 లారీల ద్వారా వివిధ రకాల వస్తువులు నగరానికి ఎగుమతి, దిగుమతి అవుతాయి. కూరగాయలు, పాలు, మందులు, పెట్రోల్, డీజిల్, తాగునీరు వంటి అత్యవసర వస్తువులు మినహా మిగిలిన వస్తువుల ఎగుమతి, దిగుమతులు నిలిచిపోయాయి. లారీ బుకింగ్ కార్యాలయాలను మూసివేశారు. ఎలాంటి ఆర్డర్లను స్వీకరించలేదు. 90 శాతం మేర బుకింగ్‌లు ఆగిపోయినట్లు రాష్ట్ర లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ఉస్మాన్‌గంజ్, మహరాజ్‌గంజ్ వంటి మార్కెట్‌లలో బంద్ కారణంగా స్తబ్దత నెలకొంది.
జీఎస్‌టీ దెబ్బకు కుదేలు..
జీఎస్‌టీ ప్రభావంతో రవాణా రంగం కుదేలైందని, చాలామంది లారీ యజమానులు ఆర్డర్లు లేక రోడ్డున పడే పరిస్థితి నెలకొందని రాష్ట్ర లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్.భాస్కర్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రూ.లక్షల్లో అప్పులు చేసి వాహనాలు కొనుగోలు చేసి రుణగ్రస్తులుగా మారారన్నారు. జీఎస్‌టీ దెబ్బతో వస్తు రవాణా కోసం వర్తకులే సొంతంగా వాహనాలను ఏర్పాటు చేసుకునే పరిస్థితి తలెత్తిందన్నారు. రోజూ డీజిల్ ధరలను సవరించే కారణంతో ధరలను అమాంతంగా పెంచేస్తున్నారన్నారు. టోల్‌ట్యాక్స్ నుంచి లారీలకు మినహాయింపునివ్వాలని, పెంచిన డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఆర్టీఏ చెక్‌పోస్టుల వద్ద అక్రమ వసూళ్లను అరికట్టాలని, ఓవర్‌లోడు పేరుతో డ్రైవర్ల లైసెన్సులపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరారు.
కేటీఆర్ సానుకూల స్పందన
మంత్రి కేటీఆర్‌తో సోమవారం తమ సమస్యలపై చర్చలు జరిపినట్లు భాస్కర్‌రెడ్డి తెలిపారు. జీఎస్‌టీ ప్రభావం, ఇంధన ధరల పెంపు తదితర అంశాలపైన కేంద్రంతో సంప్రదించనున్నట్లు మంత్రి హామీ ఇచ్చారన్నారు. నేడు కూడా సమ్మె యథావిధిగా కొనసాగుతుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment