Telangana Lorry Owners Association
-
5 వేల లారీలకు బ్రేక్
-
5 వేల లారీలకు బ్రేక్
సాక్షి, హైదరాబాద్: వస్తు సేవల పన్ను, ఇంధన ధరల పెంపునకు వ్యతిరేకంగా తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ చేపట్టిన రెండు రోజుల సమ్మెతో సోమవారం హైదరాబాద్‌లో సుమారు ఐదు వేల లారీలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో నిత్యావసర వస్తువులు, వివిధ రకాల ముడిసరుకు రవాణాకు బ్రేక్ పడింది. ఆదివారం అర్ధరాత్రి వరకు బుకింగ్‌లు చేసుకుని రోడ్డెక్కిన లారీలు మినహా మిగతావన్నీ ఆగిపోయాయి. వస్తువుల లోడింగ్, అన్‌లోడింగ్‌లను కూడా నిలిపివేశారు. దీంతో హైదరాబాద్‌లోని ఉస్మాన్‌గంజ్, మహరాజ్‌గంజ్, బేగంబజార్, అబిడ్స్, కోఠి, దిల్సుఖ్నగర్, సికింద్రాబాద్, జనరల్‌బజార్, మోండా, రాణిగంజ్ తదితర ప్రాంతాల్లో సమ్మె ప్రభావం కనిపించింది. అత్యవసర వస్తువులు మినహా ఇతర అన్ని రకాల వస్తువుల సరఫరాను లారీ సంఘాలు అడ్డుకున్నాయి. మంగళవారం కూడా సమ్మె కొనసాగనుండడంతో కొన్ని రకాల వస్తువుల ధరలపైన ప్రభావం పడే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. నగరంలోని కూకట్పల్లి, మూసారాంబాగ్, ఎల్బీనగర్, ఆటోనగర్ తదితర ప్రాంతాల్లో లారీ యాజమాన్య సంఘాలు ఆందోళనకు దిగాయి. జీఎస్టీకి వ్యతిరేకంగా ఆల్ ఇండియా మోటారు ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్, సౌత్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్స్ అసోసియేషన్ తదితర సంస్థల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా చేపట్టిన రెండు రోజుల లారీ సమ్మెలో భాగంగా తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ హైదరాబాద్‌లో సమ్మెకు దిగింది. విజయవాడ జాతీయ రహదారిపై చేపట్టిన నిరసన కార్యక్రమంలో లారీ యాజమాన్య సంఘాల ప్రతినిధులు, ఓనర్లు పాల్గొని నిరసన తెలిపారు. ఆగిపోయిన 90 శాతం బుకింగ్‌లు.. సరుకు రవాణా రంగంలో సుమారు 2 లక్షల లారీలు రాకపోకలు సాగిస్తుండగా, ఒక్క హైదరాబాద్‌లోనే రోజూ సుమారు 5,000 లారీల ద్వారా వివిధ రకాల వస్తువులు నగరానికి ఎగుమతి, దిగుమతి అవుతాయి. కూరగాయలు, పాలు, మందులు, పెట్రోల్, డీజిల్, తాగునీరు వంటి అత్యవసర వస్తువులు మినహా మిగిలిన వస్తువుల ఎగుమతి, దిగుమతులు నిలిచిపోయాయి. లారీ బుకింగ్ కార్యాలయాలను మూసివేశారు. ఎలాంటి ఆర్డర్లను స్వీకరించలేదు. 90 శాతం మేర బుకింగ్‌లు ఆగిపోయినట్లు రాష్ట్ర లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ఉస్మాన్‌గంజ్, మహరాజ్‌గంజ్ వంటి మార్కెట్లలో బంద్ కారణంగా స్తబ్దత నెలకొంది. జీఎస్టీ దెబ్బకు కుదేలు.. జీఎస్టీ ప్రభావంతో రవాణా రంగం కుదేలైందని, చాలామంది లారీ యజమానులు ఆర్డర్లు లేక రోడ్డున పడే పరిస్థితి నెలకొందని రాష్ట్ర లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్.భాస్కర్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రూ.లక్షల్లో అప్పులు చేసి వాహనాలు కొనుగోలు చేసి రుణగ్రస్తులుగా మారారన్నారు. జీఎస్టీ దెబ్బతో వస్తు రవాణా కోసం వర్తకులే సొంతంగా వాహనాలను ఏర్పాటు చేసుకునే పరిస్థితి తలెత్తిందన్నారు. రోజూ డీజిల్ ధరలను సవరించే కారణంతో ధరలను అమాంతంగా పెంచేస్తున్నారన్నారు. టోల్‌ట్యాక్స్ నుంచి లారీలకు మినహాయింపునివ్వాలని, పెంచిన డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఆర్టీఏ చెక్‌పోస్టుల వద్ద అక్రమ వసూళ్లను అరికట్టాలని, ఓవర్‌లోడు పేరుతో డ్రైవర్ల లైసెన్సులపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరారు. కేటీఆర్ సానుకూల స్పందన మంత్రి కేటీఆర్‌తో సోమవారం తమ సమస్యలపై చర్చలు జరిపినట్లు భాస్కర్‌రెడ్డి తెలిపారు. జీఎస్టీ ప్రభావం, ఇంధన ధరల పెంపు తదితర అంశాలపైన కేంద్రంతో సంప్రదించనున్నట్లు మంత్రి హామీ ఇచ్చారన్నారు. నేడు కూడా సమ్మె యథావిధిగా కొనసాగుతుందని చెప్పారు. -
నేటి అర్ధరాత్రి నుంచి లారీల సమ్మె
స్తంభించనున్న సరుకు రవాణా సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం అర్ధరాత్రి నుంచి సరుకు రవాణా స్తంభించనుంది! తమ సమస్యలను పరిష్కరించాలంటూ తెలంగాణ లారీ యజమానుల సంఘం నిరవధిక సమ్మె చేపట్టనుంది. దీంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సుమారు లక్ష లారీలు సహా తెలంగాణ వ్యాప్తంగా 3.5 లక్షల లారీలు ఎక్కడికక్కడ నిలిచిపోనున్నాయి. లారీల బంద్ వల్ల నిత్యావసర వస్తువుల సరఫరాపై తీవ్ర ప్రభావం పడనుంది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు కొండెక్కి సాధారణ ప్రజలు సతమతమవుతుండగా లారీల సమ్మె వల్ల వాటి ధరలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త రవాణా పన్ను విధానానికి వ్యతిరేకంగా లారీ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. పన్ను విధానంలో కొన్ని మినహాయింపులు ఇవ్వడం సహా పెండింగ్‌లో ఉన్న 17 డిమాండ్లను పరిష్కరించాలని లారీ యజమానులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా సీఎం, రవాణాశాఖ మంత్రితోపాటు ఆ శాఖ ఉన్నతాధికారులను కలసి విన్నవించుకున్నారు. అయితే సోమవారం అర్ధరాత్రి వరకు ప్రభుత్వం నుంచి చర్చలకు పిలుపు అందలేదని తెలంగాణ లారీ యజమానుల సంఘం అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి తెలిపారు. గత్యంతరం లేని స్థితిలో సమ్మెకు సిద్ధమయ్యామన్నారు. టాటా ఏస్‌లు, గూడ్స్ ఆటోలు మినహా ఇతర సరుకు రవాణా వాహనాలు బంద్‌లో పాల్గొంటాయన్నారు. అత్యవసర వస్తువులు రవాణా చేసే వాహనాలు, నీటి ట్యాంకర్లను సమ్మె నుంచి మినహాయించారు. డిమాండ్లు ఇవీ... ⇒ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త రవాణా పన్నుకంటే ముందు ఉమ్మడి రాష్ట్రంచెల్లుబాటయ్యేలా తాము చెల్లించిన త్రైమాసిక పన్ను నుంచి ఏపీలోని 13 జిల్లాలకు పన్ను తగ్గించాలి. ⇒ ఇరు రాష్ట్రాల్లో తిరిగేందుకు అనుమతినిస్తూ ఏటా రూ.3 వేల నుంచి రూ. 5 వేల వరకు పన్ను తీసుకొని కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్లు ఇవ్వాలి. ⇒ 15 ఏళ్లు నిండిన కాలం చెల్లిన సరుకు రవాణా లారీలపై నిషేధం విధించే అంశంపై సంప్రదింపులు జరపాలి. ⇒ లారీ యజమానుల నుంచి హమాలీ, గుమాస్తా మామూళ్ల వసూలును నిలిపేయాలి. ⇒ సరుకు లోడింగ్, అన్లోడింగ్ సమయంలో రక్షణ కల్పించాలి.టట్రక్ ఓనర్స్ హైవే ఎమినిటీస్ సొసైటీ (తోహాస్) నూతన కమిటీని ఏర్పాటు చేయాలి.టజిల్లా, తాలూకా కేంద్రాల్లో ట్రక్ టర్మినల్స్, ట్రక్ పార్కింగ్లు ఏర్పాటు చేయాలి. ఆంధ్రప్రదేశ్‌లో సమ్మె వాయిదా.. ఏపీలో డీజిల్, పెట్రోలుపై పెంచిన వ్యాట్ రద్దు చేయడంతోపాటు మరో 10 డిమాండ్లు నెరవేర్చాలని పెట్రోల్ బంకులు, లారీల యజమానులు మంగళవారం అర్ధరాత్రి నుంచి నిర్వహించ తలపెట్టిన సమ్మె వాయిదా పడింది. సోమవారం రాత్రి వరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుతో ఏపీ పెట్రోలియం ట్రేడర్స్ ఫెడరేషన్, ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్, ఏపీ పెట్రోలియం ట్యాంక్ ట్రక్ ఆపరేటర్ల అసోసియేషన్ ఐక్య కార్యాచరణ సమితితో జరిగిన చర్చలు సఫలమయ్యాయి. జూలై 8లోగా సమస్యల్ని పరిష్కరించడంతోపాటు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తామని సీఎస్ హామీనివ్వడంతో సమ్మె తాత్కాలికంగా విరమిస్తున్నట్లు నేతలు ప్రకటించారు. జూలై 8లోగా సమస్యలు పరిష్కరించకపోతే 9 నుంచి సమ్మెలోకి వెళతామని స్పష్టం చేశారు. ఈ మేరకు జేఏసీ కన్వీనర్ ఈశ్వరరావు ‘సాక్షి’కి తెలిపారు. -
23 అర్ధరాత్రి నుంచి లారీ రవాణా బంద్
తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రకటన సాక్షి, హైదరాబాద్: లారీ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వానికి విన్నవించినా స్పందన లేకపోవడంతో ఈ నెల 23 అర్ధరాత్రి నుంచి నిరవధిక లారీ రవాణా బంద్ చేపడుతున్నట్లు తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్, రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డికి శుక్రవారం లేఖ రాసింది. గతేడాది జూన్‌లో తమ సమస్యలపై ముఖ్యమంత్రికి విన్నవించినా పరిష్కారం లభించలేదని పేర్కొన్నారు. త్రైమాసిక పన్ను తగ్గించాలని, కౌంటర్ సిగ్నేచర్ ద్వారా తెలంగాణ, ఏపీలో వాహనాలు తిరిగేలా అనుమతించాలని ఇప్పటికే ప్రభుత్వానికి విన్నవించింది. తాము ప్రభుత్వానికి సమర్పించిన 11 డిమాండ్లపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు భాస్కర్‌రెడ్డి, దుర్గాప్రసాద్ విజ్ఞప్తి చేశారు.