నేటి అర్ధరాత్రి నుంచి లారీల సమ్మె
స్తంభించనున్న సరుకు రవాణా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం అర్ధరాత్రి నుంచి సరుకు రవాణా స్తంభించనుంది! తమ సమస్యలను పరిష్కరించాలంటూ తెలంగాణ లారీ యజమానుల సంఘం నిరవధిక సమ్మె చేపట్టనుంది. దీంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సుమారు లక్ష లారీలు సహా తెలంగాణ వ్యాప్తంగా 3.5 లక్షల లారీలు ఎక్కడికక్కడ నిలిచిపోనున్నాయి. లారీల బంద్ వల్ల నిత్యావసర వస్తువుల సరఫరాపై తీవ్ర ప్రభావం పడనుంది.
ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు కొండెక్కి సాధారణ ప్రజలు సతమతమవుతుండగా లారీల సమ్మె వల్ల వాటి ధరలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త రవాణా పన్ను విధానానికి వ్యతిరేకంగా లారీ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. పన్ను విధానంలో కొన్ని మినహాయింపులు ఇవ్వడం సహా పెండింగ్‌లో ఉన్న 17 డిమాండ్లను పరిష్కరించాలని లారీ యజమానులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
ఇప్పటికే పలు దఫాలుగా సీఎం, రవాణాశాఖ మంత్రితోపాటు ఆ శాఖ ఉన్నతాధికారులను కలసి విన్నవించుకున్నారు. అయితే సోమవారం అర్ధరాత్రి వరకు ప్రభుత్వం నుంచి చర్చలకు పిలుపు అందలేదని తెలంగాణ లారీ యజమానుల సంఘం అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి తెలిపారు. గత్యంతరం లేని స్థితిలో సమ్మెకు సిద్ధమయ్యామన్నారు. టాటా ఏస్‌లు, గూడ్స్ ఆటోలు మినహా ఇతర సరుకు రవాణా వాహనాలు బంద్‌లో పాల్గొంటాయన్నారు. అత్యవసర వస్తువులు రవాణా చేసే వాహనాలు, నీటి ట్యాంకర్లను సమ్మె నుంచి మినహాయించారు.
డిమాండ్‌లు ఇవీ...
⇒ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త రవాణా పన్నుకంటే ముందు ఉమ్మడి రాష్ట్రంచెల్లుబాటయ్యేలా తాము చెల్లించిన త్రైమాసిక పన్ను నుంచి ఏపీలోని 13 జిల్లాలకు పన్ను తగ్గించాలి.
⇒ ఇరు రాష్ట్రాల్లో తిరిగేందుకు అనుమతినిస్తూ ఏటా రూ.3 వేల నుంచి రూ. 5 వేల వరకు పన్ను తీసుకొని కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్‌లు ఇవ్వాలి.
⇒ 15 ఏళ్లు నిండిన కాలం చెల్లిన సరుకు రవాణా లారీలపై నిషేధం విధించే అంశంపై సంప్రదింపులు జరపాలి.
⇒ లారీ యజమానుల నుంచి హమాలీ, గుమాస్తా మామూళ్ల వసూలును నిలిపేయాలి.
⇒ సరుకు లోడింగ్, అన్‌లోడింగ్ సమయంలో రక్షణ కల్పించాలి.టట్రక్ ఓనర్స్ హైవే ఎమినిటీస్ సొసైటీ (తోహాస్) నూతన కమిటీని ఏర్పాటు చేయాలి.టజిల్లా, తాలూకా కేంద్రాల్లో ట్రక్ టర్మినల్స్, ట్రక్ పార్కింగ్‌లు ఏర్పాటు చేయాలి.
ఆంధ్రప్రదేశ్‌లో సమ్మె వాయిదా..
ఏపీలో డీజిల్, పెట్రోలుపై పెంచిన వ్యాట్ రద్దు చేయడంతోపాటు మరో 10 డిమాండ్లు నెరవేర్చాలని పెట్రోల్ బంకులు, లారీల యజమానులు మంగళవారం అర్ధరాత్రి నుంచి నిర్వహించ తలపెట్టిన సమ్మె వాయిదా పడింది. సోమవారం రాత్రి వరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుతో ఏపీ పెట్రోలియం ట్రేడర్స్ ఫెడరేషన్, ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్, ఏపీ పెట్రోలియం ట్యాంక్ ట్రక్ ఆపరేటర్‌ల అసోసియేషన్ ఐక్య కార్యాచరణ సమితితో జరిగిన చర్చలు సఫలమయ్యాయి.
జూలై 8లోగా సమస్యల్ని పరిష్కరించడంతోపాటు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తామని సీఎస్ హామీనివ్వడంతో సమ్మె తాత్కాలికంగా విరమిస్తున్నట్లు నేతలు ప్రకటించారు. జూలై 8లోగా సమస్యలు పరిష్కరించకపోతే 9 నుంచి సమ్మెలోకి వెళతామని స్పష్టం చేశారు. ఈ మేరకు జేఏసీ కన్వీనర్ ఈశ్వరరావు ‘సాక్షి’కి తెలిపారు.