ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాంచందర్‌రావు ఘన విజయం
సాక్షి, మహబూబ్‌నగర్: పట్టభద్రులు కమలానికి పట్టం కట్టారు. మహబూబ్‌నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ జిల్లాల పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఎన్.రాంచందర్‌రావు విజయకేతనం ఎగిరేశారు. ఉద్యోగ సంఘాల నేత, అధికార టీఆర్‌ఎస్ అభ్యర్థి దేవీ ప్రసాద్‌ను ఓడించారు. రాంచందర్‌రావు వరుసగా మూడుసార్లు పోటీచేసి ఎట్టకేలకు పట్టుసాధించారు. బీజేపీ అభ్యర్థి విజయం సాధించడంతో ఆ పార్టీ కార్యకర్తలు, అనుబంధ సంఘాలు సంబరాలు జరుపుకున్నారు. బుధవారం రాత్రి జిల్లా కేంద్రం తో పాటు పలు పట్టణాల లో బాణాసంచా కాల్చి, స్వీ ట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు.
ఫలించిన వ్యూహం...
పట్టభద్రుల ఎన్నికలపై కన్నేసిన బీజేపీ వీటిపై ప క్కా ప్రణాళికతో ముం దుకు సాగింది. రామచంద్రరావు ఇదివరకే 2007, 2009 లలో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన నేపథ్యం ఉండడంతో ఆయనకు కలిసి వచ్చింది. రెండుసార్లు ఓటమి సానుభూతితో అనుకూలంగా మలుచుకోవడంతో పాటు ముందస్తు ప్రణాళికతో ముందుకు సాగారు. ఎన్నికలకు ఆరునెలల ముందుగానే పార్టీ అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించడంతో ఎక్కడిక్కడ సమావేశాలు నిర్వహించారు. అలాగే కొత్తగా ఓటర్లను నమోదు చేయడంలో ముందుండి నడిచారు. ఓటరుగా నమోదైన ప్రతీ ఒక్కరినీ కలిసే ప్రయత్నం చేశారు.
దీంతో పాటు పార్టీకి అనుబంధమైన విద్యార్థి సంఘం ఏబీవీపీ కూడా శక్తిమేర బీజేపీ అభ్యర్థి విజయానికి కృషి చేసింది. అలాగే కొన్నిచోట్ల కాంగ్రెస్ నేతలు లోలోన బీజేపీకి మద్దతిచ్చినట్లు సమాచారం. తమ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశం లేదని భావించిన కాంగ్రెస్ నేతలు... టీఆర్‌ఎస్ ఓటమి లక్ష్యంగా బీజేపీకి అనుకూలంగా వ్యవహరించినట్లు తెలిసింది. మరోవైపు ఉపాధ్యాయ సంఘాలు కూడా అధికార టీఆర్‌ఎస్‌పై ఉన్న కోపంతో బీజేపీకి మద్దతిచ్చినట్లు వినికిడి.
బీజేపీకి పట్టం కడుతున్న పాలమూరు...
బీజేపీకి సంచలన విజయాలకు కేరాఫ్ అడ్రస్‌గా పాలమూరు జిల్లా కేంద్రంగా మారుతుంది. ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికలే కాదు గతంలో జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా బీజేపీకి సంచలన విజయాలు అందించింది. దివంగత ఎమ్మెల్యే రాజేశ్వర్‌రెడ్డి ఆకస్మిక మరణంతో ఖాళీ ఏర్పడడంతో అనివార్యంగా ఏర్పడిన ఎన్నికల్లో పాలమూరు వాసులు బీజేపీకి పట్టం కట్టారు.
ఉద్యమం బాగా తీవ్రస్థాయిలో ఉన్న నేపథ్యంలో కూడా ప్రజలు టీఆర్‌ఎస్‌ను కాదని, బీజేపీకి 2012లో పట్టం కట్టారు. అప్పుడు బీజేపీ అభ్యర్థి యెన్నం శ్రీనివాసరెడ్డి విజయఢంకా మోగించారు. ప్రస్తుతం కూడా పట్టభద్రుల ఎన్నికల్లో మూడు జిల్లాలో అత్యధికంగా పోలింగ్ జరిగినది పాలమూరులోనే. పాలమూరు అత్యధికంగా 56.08శాతం ఓటింగ్ జరిగింది. గతంలో కంటే రెట్టింపు స్థాయిలో జరిగిన పోలింగ్‌లో పట్టభద్రులు కమలానికి పట్టంగట్టారు.