
జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆంజనేయులు
మహబూబ్‌నగర్ క్రైం : ప్రేమించుకున్నాం..పెళ్లి చేయండని ఓ ప్రేమజంట పెద్దలను వేడుకున్నారు.. వారు ఒప్పుకోక పోవడంతోపాటు ప్రేమజంటను విడదీయాలని ప్రయత్నించడంతో ఇద్దరు మనస్తాపానికి గురయ్యారు. కలిసి బతకలేకపోతే కలిసి చనిపోదాం అని నిర్ణయించుకుని పురుగుల మందు తాగి ఆత్మాహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ సంఘటన మండల పరిధిలోని అల్లీపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలిలా.. పట్టణంలోని గాంధీరోడ్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఓ బాలిక, అల్లీపూర్ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ ఆంజనేయులు ఇద్దరు కొన్నిరోజులుగా ప్రేమించుకుంటున్నారు.
ఈనెల 18న ఇద్దరు ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. అయితే ఈ విషయంపై అమ్మాయి తల్లిదండ్రులకు తెలిసింది. అమ్మాయిని తీసుకుని రావాలని అబ్బాయి కుటుంబ సభ్యులపై ఒత్తిడి తీసుకొచ్చి రెండు రోజులు గడువు పెట్టారు. అనంతరం రూరల్ పోలీస్ స్టేషన్‌లో కిడ్నాప్ చేశారంటూ ఫిర్యాదు చేశారు.
ఈ విషయం ప్రేమికులకు తెలియగా శుక్రవారం ఉదయం అల్లీపూర్ సమీపంలో పంట పొలాల్లో వారిద్దరు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి చికిత్స కోసం జనరల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారు కోలుకుంటున్నారు. ఇదిలా ఉండగా అమ్మాయి మైనర్ కావడంతో వచ్చిన ఫిర్యాదు మేరకు ఆంజనేయులపై కేసు నమోదు చేసినట్టు రూరల్ ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment