ప్రేమ.. పెళ్లి... ఘర్షణ | love .. Wedding ... confrontation | Sakshi
Sakshi News home page

ప్రేమ.. పెళ్లి... ఘర్షణ

Published Fri, Mar 18 2016 2:37 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

ప్రేమ.. పెళ్లి... ఘర్షణ - Sakshi

ప్రేమ.. పెళ్లి... ఘర్షణ

మరదలిని బెదిరించి పెళ్లాడిన బావ
వేరొకరిని ప్రేమించిన మరదలు
విషయం తెలియడంతో బావతో ప్రేమికుడి ఘర్షణ

 
 అలంపూర్ : కర్నూలు జిల్లాకు చెందిన ప్రేమికుల పంచాయతీ అలంపూర్‌కు చేరింది. ఆ వివరాలిలా ఉన్నాయి.. కర్నూలు జిల్లా నందికోట్కూరు నియోజకవర్గం మిడ్తూరుకు చెందిన రమేష్, అదే గ్రామానికి చెందిన అమ్మాయి ప్రేమించుకున్నారు. త్వరలోనే పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అయితే అమ్మాయి కుటుంబ సభ్యులు మాత్రం మేనత్త కొడుకు ఉదయ్‌కుమార్‌తో వివాహం చేయడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆదోనికి చెందిన ఉదయ్ రెండురోజుల క్రితం మిడ్తూరు చేరుకున్నాడు. అలంపూర్‌లోని గుడికి వెళ్తామని ఇంట్లో చెప్పి గురువారం ఉదయం మరదలితో కలిసి బయల్దేరారు. అలంపూర్‌కు చేరుకున్న తర్వాత ఉదయ్‌కుమార్, తనను పెళ్లి చేసుకోవాలని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి బలవంతంగా మరదలికి తాళికట్టాడు.

అనంతరం అక్కడి నుంచి తిరుగు పయణమయ్యారు. తనకు ఇష్టంలేకుండా ఎందుకు తాళికట్టావంటూ అమ్మాయి నిలదీసింది. దీంతో ఉదయ్ మరుగుదొడ్లు శుభ్రం చేయడానికి ఉపయోగించే మందును తాగే ప్రయత్నం చేశాడు. ఇదే సమయంలో తన ప్రేమికురాలు బావతో కలిసి వెళ్లిందనే సమాచారం తెలియడంతో రమేష్, ఉదయ్ సెల్‌కు ఫోన్‌చేసి మాట్లాడుతుండగా అమ్మాయి ఫోన్ లాక్కుని జరిగిన విషయం రమేష్‌కు చెప్పింది. త్వరగా రావాలని కోరింది. దీంతో రమేష్ వెంటనే అలంపూర్ చౌరస్తాకు వచ్చాడు.

అక్కడే ఉదయ్, తన ప్రియురాలు కనిపించారు. నేను ప్రేమించిన అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటావని రమేష్ అతనితో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య ఘర్షణ పెద్దదికావడంతో స్థానికులు సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వారిని ఔట్‌పోస్టుకు తరలించి విచారించారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు అలంపూర్ చౌరస్తాకు చేరుకుని పోలీసులతో మాట్లాడి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ సంఘటనకు సంబందించి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని మానవపాడు ఎస్‌ఐ భగవంతరెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement